Tuesday, January 7, 2025

శివోహం

శివా!

నా జీవితంలో ఉన్న సమస్యలలో 99 శాతం సమస్యలు నేను సృష్టించుకున్నవే…

ఎందుకంటే నేను జీవితాన్ని గంబిరమైనది అని అనుకున్నారు.

శివ నీ దయ

శివా!ఏదైనా నిన్నే అడుగుతాను

అడగడం నా హక్కు కాదంటావా

నీవే నాకు దిక్కు ఏమంటావు

మహేశా . . . . . శరణు .

శివా!ఏదైనా చెప్పు ఏదో వొకటి చెప్పు

నిన్ను తెలిసేలా నేను విరిసేలా

నీతో కలిసేలా నేను మెరిసేలా

మహేశా . . . . . శరణు .

శివా!మారుతున్న జగతిలోన మసలుచున్న నేను

మారని నిన్ను చేర ముడుపు మూట కట్టినాను

ముడుపు నాకు చెల్లనీ మూట నీకు ముట్టనీ.

మహేశా.....శరణు.

శివా!ఋబు గీత చదివి యున్నాను

ఋజు మార్గము తెలుసు కొన్నాను

ఋషిని అగు కాంక్ష కలిగియున్నాను.

మహేశా . . . . . శరణు .

శివా!సూర్య చంద్రులు నీ కంట వుదయించి

నింగినేలగ చరియించి వెలుగులు పంచేను

ఏమి వెలుగులు నీవయ్య విశ్వనాథ.

మహేశా . . . . . శరణు .

శివా!వేరు భావన నానుండి వేరుచేయి

వేద వాదము నాలోన విరయనీయి

నేను అన్నది నిను చేరి ముగియనీయి

మహేశా . . . . . శరణు.

ఓంకారాన్ని చూస్తుంటే వింటుంటే,

అంటుంటే తెలియని తరంగాలు

తోసుకొస్తుంటే .....

ఏమి చెప్పను ఆ ఆనందానుభూతి

అది అక్షరాలకందని . తెలుసుకోండి

చూస్తూ ,అంటూ ,వింటూ.

శివా!ఒంటిగా నను పంపి వెంట నీవన్నావు

సత్య ధర్మముల వెంట సాగిపోమన్నావు

తెలియలేదంటె శోధించమన్నావు

మహేశా ..... శరణు.

శివా!తెలిసి చేస్తున్నాను స్మరణ

తెలియకనే కలుగుతోంది స్పురణ

సద్గతికి కోరి వేడుతున్నాను శరణు .

మహేశా . . . . . శరణు.

శివా!నందిని ఏమని పిలవాలి

నీ చిందులు ఏమని తెలియాలి

తెలియనీయవయ్యా తెలివి నొసగి

మహేశా . . . . . శరణు.

ఏందయ్యా నీవు ఎనకనే వుంటావు

మా కన్నెదుటకేలనో కనరావు

వున్నావు అన్నారు అంతటా నీవనీ

విన్నాను అన్నాను కనిపించ రమ్మనీ

ఓ విశ్వనాథా శ్రీ విశ్వనథా

శ్రీ విశ్వానాథా ఓ విశ్వనాథా

తొలి దైవమై నీవు తెలియ వచ్చేవు

తొల్లింటి వాడిగా పూజలందేవు

తెలివి తేటకు నీవు తలుపు తీసేవు

తెలివిలో తేజమై తెలియ వచ్చేవు

ఓ విశ్వనాథా శ్రీ విశ్వనథా

శ్రీ విశ్వానాథా ఓ విశ్వనాథా

లింగాన తెలిసేవు అంగాన్ని పంచేవు

అర్ధాంగినొక రీతి తెలియ జేసేవు

అర్ధ పరమార్ధాలు అందు నిలిపేవు

అది మాకు తెలియగా భోద చేసేవు

ఓ విశ్వనాథా శ్రీ విశ్వనథా

శ్రీ విశ్వానాథా ఓ విశ్వనాథా

కథ మొదలు నీవెగా కన్నావు

కథ ముగియు వేళలో కూడేవు

కథలన్ని నీతోనె సాగేను

కథ ముగియ కంచికే చేరేను

ఓ విశ్వనాథా శ్రీ విశ్వనథా

శ్రీ విశ్వానాథా ఓ విశ్వనాథా

శివా!తోడు లేకనే తిరుగుతున్నావు

నీడ లేకనే నిలిచి వున్నావు

మా తోడు,నీడ నీవై వున్నావు

మహేశా . . . . . శరణు .

శివా!జన్మను తీసుకు వచ్చాను

క‌ర్మలు కూడి వున్నాను

ఓ కంట చూసి కాల్చుమా కర్మలను

మహేశా . . . . . శరణు .

శివా!లెక్కపెట్టగ లేవు నీ యింట వాసాలు

చిత్రాతి చిత్రాలు నీ నామ రూపాలు

చిత్త భవుడవె గాని చిత్తాన తెలియవు

మహేశా . . . . . శరణు .

శివా!నీ చిరు నామమే నే తెలుసుకున్నాను

నీ చిరునామా ఎక్కడో తెలియలేకున్నాను

తెలిసేదెలా నేను నిన్ను కలిసేదెలా

మహేశా . . . . . శరణు .

శివా!రంగు లేదు ఏ హంగు లేదు

నీ రూపము తెలియగ లేదు

నీ తేట తేజము నాకు తెలుపుమయ్యా

మహేశా . . . . . శరణు .

శివా!ఊపిరై తిరుగుతూ తిరగనిచ్చేవు

వెలుగువై అంతటా చూడనిచ్చేవు

నాలోని నీ వెలుగు చూడనీవయ్యా

మహేశా . . . . . శరణు .

శివా!స్మరణ సాగుతోంది

స్పురణ కలుగుతోంది

ఏదైనా నీవేనని తెలుస్తోంది

మహేశా . . . . . శరణు .

శివా!కంటి చూపుతో కంధర్పుని కాల్చినా

నోటి మాటకు నీ నోట విషము పట్టినా

లోక కళ్యాణానికే నీవు కట్టుబడినావు

మహేశా . . . . . శరణు .

శివా!జీవునిగ పుట్టాక నీ పదము మ్రొక్కాక

తెలుసుకో మంటున్నారు నేనెవరో

తెలుసుకుంటే మరి నేనెక్కడ నీవెక్కడ

మహేశా ..... శరణు.

శివా!భూమాకాశములు బగ్గుమన్నను

కడలి వొడిని అన్నీ ఏకమైననూ

ఈ ధ్యానమేమిటో దీని అర్ధమేమిటో

మహేశా . . . . . శరణు .

శివా!ఏ ఆస్థానమూ కోరలేదు

నీ సంస్థానమున కూడనిమ్ము

నా ప్రస్థానము ఇలా ముగియనిమ్ము.

మహేశా . . . . . శరణు .

శివా!పిలిచినదే తడవుగా వచ్చేస్తావు

అడిగినదే తడవుగా యిచ్చేస్తావు

భక్త సులభుడంటే మరి ఎవరయ్యా

మహేశా . . . . . శరణు .

శివా!అడిగినదె తడవుగా ఆరగించేవు

అటు ఇటూ పోకుండ అంగుట్లో పట్టేవు

ఎట పోయినా రక్షించు భారము నీదేనని

మహేశా . . . . . శరణు .

శివా!ధూర్జటి అని నిను తలచినంత

దూరమై పోవు దుఃఖములన్నీ

చేరువై పోవు నీ చెలిమి కలిమి

మహేశా . . . . . శరణు .

శివా!మననంలోనే మనుగడ సాగిస్తూ

స్మరణంలోనే శాంతిని సాధిస్తూ

ధ్యానంలో సదా నిన్ను దర్శించనీ

మహేశా . . . . . శరణు .ఏదో

శివా!నీ చిందు చూడ పసందు

కను చెవులకు అరుదైన విందు

ఆ భాగ్య మొకసారి కలిగించమందు

మహేశా . . . . . శరణు .

శివా!తట్టి లేపగ నీవే తరలి వచ్చి

తమోగుణమును తరిమికొట్టి

మనో నాశనముకై మందు వేసావా

మహేశా . . . . . శరణు

శివా!నీ పాదాల పడి మ్రైక్కినా

నీ నామం గాలితో కలిపి త్రిప్పినా

నాదైన మనసును గాడిని పెట్టుటకే

మహేశా . . . . . శరణు .

శివోహం

శివా! నా జీవితంలో ఉన్న సమస్యలలో 99 శాతం సమస్యలు నేను సృష్టించుకున్నవే… ఎందుకంటే నేను జీవితాన్ని గంబిరమైనది అని అనుకున్నారు. శివ నీ దయ శివా!ఏ...