లేనిది కావాలనిపిస్తుంది ఉన్నది వద్దనిపిస్తుంది…
సూదూరంగా ఉన్నవి సౌందర్యంగా చేరువైనవి వ్యర్ధంగా…
శాంతినిచ్చేవి చీకాకుగా అశాంతి నిచ్చేవి ఆనందంగా...
స్థితిమితానికీ ఆస్తిమితానికి మధ్య ఊగిసలాట....
అదే మనస్సు మాయే మనస్సు మనస్సే మాయ...
మనస్సును జయిస్తే మాయను జయించినట్లే మనస్సును స్థిరం చేస్తే మోక్షం ప్రాప్తించ్చినట్లే…
తెలిసిన వారికి సిద్ధాతం…
తెలియని వారికి వేదాతం.
ఓం శివోహం…సర్వం శివమయం
శివా!కనులు మూసి చూసాను కానలేకపోయాను
కనులు తెరచి చూసాను తెలియలేకపోయాను
ప్రయత్నమైతె చేసాను ఫలమీయమన్నాను
మహేశా . . . . . శరణు .
శివా!మందాకినియే సిగను కూడ
ఉదకాభిషేకానికే నీవు ఉబ్బనేల
తలవంచి అడిగేను తెలియజెప్పు
మహేశా . . . . . శరణు .
శివా!ఏరి కోరితి నిన్ను భాగ్యమీయ
భాగ్యమన్న నాయందు సిరులుకావు
నీ పాద రేణువుగ నన్ను తెలియనీయి
మహేశా . . . . . శరణు .
శివా!విశ్వ ధ్యానమున నీవు వున్నావు
పరధ్యానమున నేను వున్నాను
పడిపోనీకు నన్ను వోడిపోనీకు.
మహేశా . . . . . శరణు.
శివా!స్పురణగా రావేమి
కరుణతో కనవేమి
శరణమన వినవేమి
మహేశా . . . . . శరణు
శివా!కుప్పల తెప్పల కథలు కూడుతున్నాయి
సశేషాల కథలు ఇంక చాలునయ్యా
సమాప్తమనిపించు కథను కంచికి నడిపించు
మహేశా . . . . . శరణు .
శివా!ఇహమును వీడగ మోహాలు
పరమును చేరగ బంధాలు
తొలగించుమా నన్ను కరుణించుమా
మహేశా . . . . . శరణు .
శివా!అహము విడిచాను తలను వంచాను
తలపులో సదా నిన్నే నిలుపుకున్నాను
నిన్ను స్మరణ గొన్నాను శరణమన్నాను
మహేశా . . . . . శరణు .
శివా!శ్వాసతో సాగేవు స్మరణగా
ధ్యానంలో నిలిచేవు ధ్యేయంగా
పర ధ్యానమే కోరేను వరముగా
మహేశా . . . . . శరణు .
శివా! గుండె గుడిని నీవున్నా
గుర్తు లెన్ని తెలుసున్నా
గతి నెరుగలేకున్నా మతి నీయవా
మహేశా. . . . .శరణు.
శివా!కరుణగా తెలిసేవు
స్పురణగా విరిసేవు
శరణమంటి నీ చరణమే
మహేశా . . . . . శరణు .
శివా!సృష్టి నిర్మాణమున పరమేష్టి నీవే
స్థితి కార్యము నందు శ్రీహరివి నీవే
లయ ప్రళయముల రాజిల్లు నీవే
మహేశా . . . . . శరణు .
శివా!సిగలోన శిఖి పించముంచి
కనుల పైన కస్తూరి తిలకముంచి
సుదర్శన మిలా అందజేసావు
మహేశా . . . . . శరణు .
శివా!కైలాసమును నుండి కదలి వచ్చేవు
వైకుంఠమును చేరి వెలుగు పంచేవు
విష్ణుమూర్తిగ నీవె వ్యాప్తి చెందేవు
మహేశా . . . . . శరణు .
శివా!నీ నిజ రూపము నెరుగ రూపమేది
నీ దివ్య తేజము నెరుగ దారి యేది
రూపమే దాల్చేవో,తేజమై తెలిసేవో
మహేశా . . . . . శరణు .
శివా!స్పురణకు సూత్రము నీవు
స్మరణకు మాత్రము నేను
సాధన చేయగ మేను
మహేశా . . . . . శరణు
No comments:
Post a Comment