కార్యసాధకుడు కపీశ్వరుడు...
సుందరకాండ పారాయణ చేస్తే ఆగిపోయిన పనులు కూడా అయిపోతాయని లోకంలో ప్రతీతి. అలా చెప్పడంలో పెద్దల ఉద్దేశ్యం కేవలం పారాయణ చేసినంతలో ఏదో హనుమచ్చక్తి కిందికి దిగి వచ్చి మన పనులన్నీ చేసి పెట్టేస్తుందని కాదు. సుందరకాండ మొత్తం సావకాశంగా, సావధానంగా చదివితే.. కార్యసాధనలో ఎదురయ్యే ఆటంకాలు ఎన్ని రకాలుగా ఉంటాయో, వాటిని ఏ రకంగా తొలగించుకోవాలో అవగాహన చేసుకొంటారని పెద్దల ఉద్దేశం. ఏ విషయాన్నైనా అవగాహన చేసుకొని వాటిని మన జీవితానికి అన్వయం చేసుకొని ఆచరణలో పెడితే కాని పని ఉంటుందా? హనుమంతుడు సముద్రలంఘనం చేస్తుంటే మూడు రకాల ఆటంకాలేర్పడ్డాయి. మైనాక పర్వతం మర్యాద చేయడానికి అడ్డంగా వచ్చి నిలబడింది.
ఇది సాత్త్వికాటంకం. తర్వాత సురస అనే రాక్షసి ఆకాశమార్గానికి అడ్డంగా వచ్చి.. తన నోట్లో ప్రవేశించకుండా ఏ ప్రాణీ ముందుకు వెళ్లలేదని పంతం పట్టింది. ఇది రాజసాటంకం. ఆ తర్వాత సింహిక అనే ఛాయాగ్రాహిణి మాటామంతీ లేకుండా కిందికి లాగెయ్యడం మొదలుపెట్టింది. ఇది తామసాటంకం. కార్యసాధకుడైన హనుమంతుడు మూడు ఆటంకాలనీ మూడు రకాలుగా ఎదుర్కొన్నాడు. మైనాకుడు మర్యాదలు చెయ్యడం కోసం అడ్డుపడ్డాడు కాబట్టి.. అతనితో మర్యాదగానే మాట్లాడి, తిరిగివచ్చేటప్పుడు ఆగుతానని చెప్పి దాటి వెళ్లిపోయాడు. సురస ఆంజనేయుణ్ణి మింగేద్దామని నోరుతెరిచింది.
స్వామి దాంతో పోటీపడి దానికి రెట్టింపు స్థాయిలో శరీరం పెంచాడు. కొంతసేపయ్యాక సమయం వృథా అవుతోందని గమనించి.. అతి సూక్ష్మ శరీరంతో దాంట్లోంచి బయటపడ్డాడు. రాజసాటంకాల నుండి బయటపడే ఉపాయం అది. ఆ తర్వాత సింహిక.. ఆంజనేయుడి నీడ పట్టుకొని బలవంతంగా కిందికి లాగేస్తుంటే అది తమోగుణ ప్రవృత్తి అని గ్రహించి.. తన బలమంతా ఉపయోగించి దాన్ని పైకిలాగి ఒక్క గుద్దుతో పైలోకాలకి పంపేశాడు. అంటే తమో గుణానికి దండనతో బదులు చెప్పాడన్నమాట. అలామనం కూడా ఏదైనా ఒక గొప్ప లక్ష్యాన్ని సాధించాలనుకొన్నప్పుడు ఎదురయ్యే ఆటంకాలు ఏ రకమైనవో గమనించుకొని ఆ రకమైన ప్రవృత్తితోనే వాటిని ఎదుర్కోవాలి. కొన్నింటిని మర్యాదగానే ప్రక్కకి తొలగించాలి. మరికొన్ని విషయాల్లో కొంతసేపు పోటీపడినా.. సూక్ష్మమైన ఉపాయాలను ఆలోచించి, ఆ పోటీ నుండి బయటపడి మన పని మనం చేసుకోవాలి. తీవ్రవాదం వంటి సమస్యలను అంతే తీవ్రంగా ఎదుర్కొని ఉక్కుపాదంతో అణచివేయాలి. అక్కడ మెతకదనం పనికిరాదు.
ఒక్క వ్యక్తి జీవితానికైనా, మొత్తం వ్యవస్థలో మార్పులకైనా ఈ త్రిగుణాత్మక వ్యూహం బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఈ రకంగా సుందరకాండలో ఘట్టాల్ని అవగాహన చేసుకొని, మన జీవితానికి అన్వయించుకుని ఆచరణలో పెడితే కాని పని అంటూ ఉంటుందా? అందుకోసం సుందరకాండ అందరూ చదవాలి. కపీశ్వరుని కార్యసాధకత్వాన్ని అవగాహన చేసుకొని అనుసరించాలి.