రచన: రాజన్
సకల చరాచర సృష్టికర్త, ధర్మసంస్థాపకుడు అయిన భగవంతునికి,
జీవకోటిలొ శ్రేష్టుడు అయిన ‘నేను’ సందేహ నివృత్తికై వ్రాయుచున్న లేఖ.
భగవాన్! కళ్ళకు కనపడని నీవు ఎక్కడున్నావని అడిగితే.. గుళ్ళో ఉన్నావని కొందరు, భక్తుల గుండెల్లో ఉన్నావని మరికొందరు అంటున్నారు. సంతృప్తి చెందని నేను…స్వాములను, పండితులను దర్శించి ప్రశ్నిస్తే..నువ్వు నాలోనే ఉన్నావని, నేను చూడగలిగే వాళ్ళందరిలో ఉన్నావని, అసలు మేమంతా నీలోనే ఉన్నామని జ్ఞానోపదేశం చేసారు. కానీ.. ఒకప్పటి అసాధ్యాలను సుసాధ్యాలుగా చేస్తూ భౌతిక జీవన పరిణామానికి వెన్నెముకగా నిలుస్తున్న ఆధునిక శాస్త్రవేత్తలు మాత్రం నువ్వనే వాడివి అసలు లేవని, భ్రమకు మరో పేరే భగవంతుడని వాదిస్తున్నారు. పురాతన గ్రంధాలను, తత్వ శాస్త్రాన్ని అవపోసన పట్టిన పండితుల మాటలను నమ్మాలో..లేక అపర సృష్టికర్తలైన శాస్త్రవేత్తల మాటలు విశ్వసించాలో తెలియడం లేదు. అందుకే నా మొదటి ప్రశ్న…‘ నువ్వనే వాడివి ఉన్నావా? ఉంటే ఎక్కడున్నావు? ‘
ఇక నా రెండవ ప్రశ్న…నువ్వనే వాడివి ఉంటే నీకు ఇష్టమైన వారెవరు? నీ నామమే స్మరిస్తూ జనారణ్యానికి దూరంగా ఉండే మునులా? రోజూ నీకు కొబ్బరికాయలు, అరటిపళ్ళు సమర్పించి గంటల కొద్దీ పూజలు చెసే సామాన్య భక్తులా? కోట్లు కొల్లగొట్టి లక్షలు నీ హుండీ లో వేసే ధనిక భక్తులా? లేక జనానికి ధర్మోపన్యాసాలిస్తూ విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్న నవీనతరం స్వామీజీలా? ఇంకో చిన్న అనుబంధ ప్రశ్న ప్రభూ…నిన్ను నమ్మని వారంటె నీకు కోపమా?
ధర్మం నశించినప్పుడు, అధర్మం ఉరకలేస్తునప్పుడు అవతరిస్తూనే ఉంటానని గీతలో గోవిందునిగా చెప్పావు. కానీ ఇప్పుడు ధర్మం నశించిపోలేదంటావా? పదవుల కోసం, ఆస్తుల కోసం సొంతవారినే చంపుకుంటున్నారు. కుల, మతాల పేరుతో ఒకరినొకరు ఊచకోతలు కోస్తున్నారు. విద్యా, వైద్యశాలలు కేవలం వ్యాపార కేంద్రాలుగా మారిపోయాయి. ప్రతి మనిషిలోనూ వికృతత్వం తాండవిస్తుంది. కేవలం ఒకరిద్దరు రాక్షసులను చంపడానికి, కొంతమంది భక్తులను రక్షించడానికి ప్రతీ యుగంలోను జన్మిస్తుంటావని కథలు కథలుగా చెప్పుకుంటూ ఉంటాం. మరి ఇంతమంది రాక్షసులున్న ఈ యుగంలో ఎందుకు నువ్వింకా జన్మించలేదు? ఇది నా మూడవ ప్రశ్న.
దయామయా… నా ప్రశ్నల్లో అజ్ఞానం ఉంటే మన్నించు. కానీ నిరంతరం నాలోను, నా చుట్టూ ఉన్న ఈ ప్రపంచంలోనూ జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే వేదన భరించలేకున్నాను. సృష్టిలో అత్యధికుల విశ్వాసానికి ప్రతిరూపానివైన నీవు మాత్రమే నాలోని ఈ అలజడిని తగ్గించి, శాంతిని ప్రసాదించగలవని భావించి ఈ ఉత్తరం వ్రాస్తున్నాను.
సౌగుణ్యశీలి అయిన జగన్మాతకు నా నమస్కారములు తెలియజేయి.
నీ జవాబు కోసం ఎదురు చుస్తూ,
భూలోక చరుడు,
మానవుడు
*************
భగవంతుని జవాబు
కుమారా,
నీవు వ్రాసిన “భగవంతునికి లేఖ” ప్రతి అందింది. సృష్ట్యాది నుండి తపస్సులు, పూజలు, ప్రార్ధనలు, బలిదానాలు వంటి విధానాల ద్వారా మాత్రమే ఇంతవరకూ నేను భక్తుల కోర్కెలను, సందేహాలను తీరుస్తూ వచ్చాను. వీటికి భిన్నంగా ఒక లేఖ ద్వారా నా అస్థిత్వానికి, పరమాత్మ తత్వానికి సంబందించిన సమాధానాలు తెలుసు కోవాలనుకున్న నీ ఆలోచన నన్ను ఆకర్షించింది. అందుకే సృష్టి చరిత్రలో మొదటిసారిగా నా స్వహస్తాలతో నీ లేఖకు సమాధానం వ్రాస్తున్నాను. సమాధానాలు చిత్తగించు.
నీ మొదటి ప్రశ్న: “నువ్వనే వాడివి ఉన్నావా? ఉంటే ఎక్కడున్నావు?” అన్నది నా అస్థిత్వానికి సంబందించినది. ఈ ప్రశ్నకు సమాధానం కోసం ఎందరో పండితులను, భక్తులను, శాస్త్రవేత్తలను ప్రశ్నించానన్నావు. కానీ ఇంతమందిని సమాధానం అడిగిన నీవు విచిత్రంగా నిన్ను నువ్వు మాత్రం ప్రశ్నించుకోవడం మరచిపోయావు. బాహ్య ప్రపంచం అన్నది నిలకడలేనిది. ఒక వ్యక్తి నుండి మరో వ్యక్తికి, ఒక సమాజం నుండి మరో సమాజానికి దాని స్వభావం మారిపోతూ ఉంటుంది. ఈ ప్రపంచం అంతా అంగీకరించే ఏక సిద్ధంతాలంటూ ఏమీ లేవు. ఈ పండితులు, శాస్త్రవేత్తలందరూ తమ చుట్టూ ఉన్న సమాజం నుండి, తమకు ఎదురైన అనుభవాల నుండి కొన్ని సిద్దాంతాలను ఏర్పరచుకొని అవి మాత్రమే నీకు చెప్పగలరు. మరి అలాంటప్పుడు వేల సిద్దాంతాలలో ఏదో ఒకదానిని పట్టుకు వేలాడే వాళ్ళకు మూల పదార్ధమైన నా గురించి ఎలా తెలుస్తుంది. నన్ను తెలుసుకోవడనికి, చేరుకోవడానికి ఉన్న ఏకైక మార్గం అంతర ప్రపంచంలోనికి ప్రయాణించడం. అలా తమలోకి తాము ప్రయాణం చేస్తున్న వారినే ఙ్ఞానులంటారు. ఙ్ఞానమన్నది ఓ నిరంతర ప్రయాణం. ఙ్ఞానమంటే సర్వమూ తెలిసిఉండటం కాదు. ఆ సర్వమూ తనలోనే ఉందని తెలుసుకోవడం. అలాంటి ఙ్ఞానులకు విగ్రహాలతోను, సిద్దాంతాలతోను పనిఉండదు. దేవుడు ఉన్నాడా లేడా అనే మీమాంసకు వారి మనసులో తావులేదు. ఇదే నీ మొదటి ప్రశ్నకు సమాధానం: దేవుడనే వాడు నిశ్చలానందంలోనూ, సర్వవ్యాపకత్వాన్ని గ్రహించగలిగే హృదయాంతరాళంలోను ఉన్నాడు. మరోలా చెప్పాలంటే “నువ్వే నేనై ఉన్నాను”.
ఇక నీ రెండవ ప్రశ్న: “నువ్వనే వాడివి ఉంటే నీకు ఇష్టమైన వారెవరు?”. నిజానికి నీ మొదటి ప్రశ్నకు సమాధానం తెలుసుకుంటే నీ మిగతా రేండు ప్రశ్నలకి సమాధానాలు సులభంగానే దొరుకుతాయి. అయినా నీ ప్రతి ప్రశ్నకు జవాబిద్దామనే ఉద్దేశ్యంతో వీటికి కూడా జవాబిస్తున్నాను. మునులు, ధనిక భక్తులు, బీద భక్తులు, ధర్మోపన్యాసాలిచ్చే గురువులు…వీరిలో నాకు ఇష్టమైన వారెవ్వరని అడిగావుకదా…విను… సృష్టికి అందాన్ని తేవడానికి, సృష్టి కార్యక్రమం సజావుగా జరగడానికి పగలు రాత్రి, ఎండా వానా, వేడీ చలీ అనే పరస్పర విరుద్ధ భావనలను సృజించాను. ఆ తరువాత నాలోనే మంచి చెడు, ఆనందం దుఖం లాంటి గుణాలను పుట్టించుకొని మానవునిగా మారాను. ఈ గుణాలను తొలగించుకుంటే మళ్ళీ దేవుడైపోతాను. అంటే మానవుడినైనా దేవుడినైనా నేనే… గుణాలే తేడా. మునులు, మూర్ఖులు, మహాత్ములు, బూటకపు స్వామీజీలు, ఆస్థికులు, నాస్తికులు వీళ్ళంతా నేనే. నీకంటికి నేను ఇన్ని రూపాలలో కనిపిస్తూ ఉండటం వల్ల నీకీ సందేహం వచ్చింది. నా మొదటి సమాధానం ద్వారా ఒక్క సారి నువ్వు నేనై చూడు. అంతా ఒకేలా కనిపిస్తుంది. ఇక నీ అనుబంద ప్రశ్న “నిన్ను నమ్మని వారంటే నీకు కోపమా?”. భగవంతుడు అనబడే నేను ఒక నమ్మకం…. నేను నమ్మిన వారి నమ్మకం లోనే కాక నమ్మని వారి నమ్మకం లోను ఉంటాను. ఇక నాకు నచ్చని వారనే ప్రశ్న ఎక్కడ ఉంది.
చివరిదైన నీమూడవ ప్రశ్న: “ఇంతమంది రాక్షసులున్న ఈ యుగంలో ఎందుకు నువ్వింకా జన్మించలేదు? “. ఇది బ్రహ్మ రహస్యం, కానీ చెప్పక తప్పదు కాబట్టి చెబుతున్నాను. ప్రతీ యుగానికి కొన్ని యుగ లక్షణాలుంటాయి. పూర్వయుగాలలో రాక్షసులనే వారిని ప్రత్యేకించి సృష్టించి వాళ్ళను చంపడానికి రాముడుగా, కృష్ణుడుగా పుడుతూ వచ్చాను. కానీ కలియుగానికొచ్చేసరికి ఈ రాక్షసులను బయట కాక ప్రతీ మనిషి మస్తిష్కంలోనూ పుట్టించాను. భయం, ద్వేషం, అలసత్వం ఈ రాక్షసులలో ప్రముఖులు. వీరిని సంహరించడానికి ధైర్యం, ప్రేమ అనే రూపాలలో అదే మస్తిష్కంలో పుట్టే ఉన్నాను. కావలసిందల్లా యుద్ధం మొదలుపెట్టి ఆ రాక్షసులను చంపడమే. ఇదే నీ ఆఖరి ప్రశ్నకు సమాధానం: “నేను ఇప్పటికే నీ మస్తిష్కంలో జన్మించి ఉన్నాను”.
నీ సందేహాలు నివృత్తి అయ్యాయి కదా. మానవునిగా ప్రశ్నించి భగవంతునిగా సమాధానం చెప్పావు. ప్రశ్నించడం మొదలైంది అంటే దైవంగా మారడానికి నీ ప్రయాణం మొదలైందన్నమాట. ఙ్ఞానం పై మెట్టు అయితే ప్రశ్న మొదటి మెట్టు. ఇక నుండి ప్రతి ప్రశ్నని ప్రశ్నించు. ఆ వచ్చిన జవాబునీ ప్రశ్నించు. తలపెట్టిన ప్రతికార్యాన్ని సఫలీకృతం చేసుకోవడానికి పూర్తిస్తాయిలో యత్నించు. మానవుని పరిపూర్ణరూపమే భగవంతుడనే సత్యాన్ని ప్రపంచానికి చాటించు.
శుభం భూయాత్