కృష్ణార్పణం అనడానికి కారణమేమిటి? ఫలమేమిటి?
సమాధానం;- ఏదో ఒక కర్మ చెయ్యకుండా ఏ ప్రాణీ ఉండలేదు. మంచి పనులు చేస్తే కీర్తి, ప్రతిష్టలు, స్వర్గసుఖాలు, పుణ్యఫలాలు వస్తాయి.
చెడ్డపనులు చేస్తే సంఘంలో చెడ్డపేరు, నరకయాతనలు, పాపఫలాలు వస్తాయి. ఇలా పాపపుణ్యాలు చేస్తూ, స్వర్గనరకాలనుభవిస్తూ, మరల మరల జన్మలెత్తుతూ ఈ జన్మ మరణ సంసార చక్రంలో ఉండిపోవలసిందేనా?
లేక మోక్షం పొందడం ఉందా? అని మనం విచారించడం సహజం. మనలోని ఈ విచారాన్ని దూరం చేయడానికే గీతలో శ్రీకృష్ణ భగవానుడు చక్కని మార్గం చూపాడు.
అర్జునా! నువ్వేపని చేసినా, ఏమి తిన్నా, ఏ హోమం చేసినా, ఎవరికి ఏదిచ్చినా, ఏ తపం చేసినా అదంతా నాకు సమర్పించు
అయితే ఈ సలహా పాటిస్తే మనకు వచ్చే లాభం ఏమిటి? ఇలా చేస్తే, మనం మూడు త్యాగాలు చేసినట్లవుతుంది.
మొదటిది కర్తృత్వ త్యాగం. ఈ పని నేనే చేస్తున్నాను లేదా చేయిస్తున్నాననే అహంకారం వదలాలి. ఏ కర్మయినా ఆ భగవంతుడే చేయిస్తున్నాడని భావించాలి. ఏం చేసినా భగవత్పరంగా చెయ్యాలి. ఇలా చేస్తే, మనం పాపపు పనులు చేయడానికి జంకుతాము. కర్మసాక్షి అయిన భగవానుణ్ణి తలుచుకుంటూ సదా సత్కార్యాలకు పూనుకుంటాము.
రెండోది ఫలత్యాగం. ఏం చేసినా ఇది నా కర్తవ్యం అని చెయ్యాలి. అంతేగాని ఇది చేస్తే నాకీ ఫలం వస్తుంది అని కోరికతో చెయ్యవద్దు. నేనేం చేసినా దాని ఫలం భగవానుడిదే. అన్నీ భగవత్ కైంకర్య రూపాలే అని నమ్మాలి.
మూడోది సంగత్యాగం. ఇది నాది, ఇది నేనే చెయ్యాలి. అంతా నా ఇష్టప్రకారం జరగాలి. ఇది నా ఆనందం కోసం అని బంధం పెంచుకోవద్దు. అంతా భగవన్ముఖ వికాసం కోసం, ఆయన ఆనందమే నా ఆనందం అని మనస్ఫూర్తిగా అనుకోవాలి.
ఈ త్రివిధ త్యాగాలు ఎలా చెయ్యాలి?
ఏ పనిచేసినా, ఒక్క నమస్కారం పెట్టి, ఒక్క మాట చెప్పు, చాలు.
సర్వం శ్రీకృష్ణార్పణమస్తు
పై త్రివిధ త్యాగాలను త్రికరణశుద్ధిగా అవలంబించాలి.