భక్తుడి విశిష్టత!
భగవంతుడిదీ భక్తుడిదీ విడదీయ లేని బంధం. విడ దీయరాని అనుబంధం. ఒకరు ఉంటేనే మరొకరు. ఓ తత్వముంటేనే మరొక తత్వం.
భగవంతుడు లేనిదే భక్తుడుండడు. భక్తి ఉండదు. భక్తుడు లేకపోతే భగవంతుడికి ఆకారం ఉండదు. సాకారం ఉండదు. భక్తుడుంటేనే భగవంతుని దర్శనం అవసరమ య్యేది. ప్రత్యక్షమవటం, ప్రసన్నమవటం యిత్యాది విషయా లకు ప్రాముఖ్యత వచ్చేది. భగవంతుడు ఉంటేనే భక్తుడికి పూర్ణత్వం పరిపూర్ణత్వం, మోక్షత్వం, అమరత్వం లభించేది.
భక్తుడు భగవంతుని కోసం తపిస్తాడు. తపన పడతాడు. భగవంతుడు తన భక్తుడి మీద నిండుగా మెండుగా దండిగా అనుగ్రహం కురిపించేటందుకు, అనుక్షణం ఆరాటపడుతుం టాడు. భగవంతుడు భక్తుడు యిద్దరూ… ఒకరికి మరొకరు తోడుగా, నీడగా, జోడుగా, జోడీగా, ఉంటేనే భక్తి భగవత్ తత్వాలు రెండూ ఉండేవి. భక్తికో విధం, పధం, విధానం, మార్గం ఉండేది. భగవంతుడికి ఓ రూపం, స్వరూపం, గుణం, నామం ఉండేది. సాలోక్యత ఉండేది. సామీప్యత ఉండేది. సారూప్యత, సాయుజ్యం ఉండేది. అంతటి అవినా భావ అనుబంధం భగవంతుడుది భక్తుడిదీ.
అయితే భగవంతుడు భక్తుడు వీళ్ళిద్దరిలో ఎవరు
గొప్ప? అనే సందేహం సహజంగా కలిగేదే.
ఓసారి ఓ కొం-టె- శిష్యుడికి ఈ సందేహమే కలిగింది. సందేహం రావడమే ఆలస్యం, సందేహ నివృత్తి కోసం తిన్న గా గురువుగారిని ఆశ్రయించాడు. ”భగవంతుడు భక్తుడు వీళ్ళిద్దరిలో ఎవరు గొప్ప?” అని గురువుని అడిగాడు.
వెంటనే గురువు శిష్యుణ్ణి ”పంచభూతాలు ఉన్నాయి
కదా? వాటిలో ఏది గొప్పది?” అని అడిగారు.
”నీరు మూడొంతులు ఉంటే భూమి ఒక వంతే ఉంది
కదా స్వామీ! కాబట్టి నీరే గొప్పది” అని శిష్యుడు సమాధానం చెప్పాడు.
అది విన్న గురువుగారు ”అంత గొప్పది అయిన నీటిని అగస్త్యుడు ఒక్క గుక్కలో ఔపోసన పట్టేసాడు. మరి నీరు
గొప్పదా? అగస్త్యుడు గొప్పవాడా?” అని అడిగారు.
”అంత గొప్పదైన నీటిని ఔపోసన పట్టేసిన అగస్త్యుడే
గొప్పవాడు” అని సమాధాన మిచ్చాడు శిష్యుడు.
”ఆహా! అలాగా. అంత గొప్పవాడైన అగస్త్యుడు ఆకాశం లో ఉంటాడు కదా? ఆకాశం గొప్పదా? అగస్త్యుడు గొప్ప వాడా?” అని మరో ప్రశ్న వేసారు గురువుగారు.
”గొప్పవాడైన అగస్త్యుని నివాసం ఆకాశం కాబట్టి, ఆకా శమే గొప్పది” అని శిష్యుడు బదులిచ్చాడు.
”అంతటి విశిష్టమైన ఆకాశాన్ని, భగవంతుడు వామన రూపంలో ఒక్క పాదంతో ఆక్రమించేసాడు. మరి ఆకాశం గొప్పదా? భగవంతుని పాదం గొప్పదా?” అని మళ్ళీ ప్రశ్నిం చారు గురువుగారు.
భగవంతుని పాదమే గొప్పదన్నాడు శిష్యుడు.
”భగవంతుని పాదమే అంత గొప్పది అయినప్పుడు, భగవంతుడు ఎంతటి గొప్పవాడై ఉండాలో ఆలోచించు” అన్నారు గురువుగారు.
”అవును స్వామీ! భగవంతుడు నిజంగా చాలా
గొప్పవాడు” అన్నాడు శిష్యుడు.
అపుడు గురువుగారు శిష్యుడితో ”చూడు నాయనా! అంత గొప్పవాడైన భగవంతుడు భక్తుడి హృదయంలో ఉం టాడు కదా! అపుడు భగవంతుడు గొప్పవాడా? భక్తుడు గొప్ప వాడా? అని మళ్ళీ ప్రశ్నించారు గురువు గారు.
వెంటనే ”భగవంతుడు భక్తుని హృదయంలో బందీగా ఉంటాడు కాబట్టి భక్తుడే గొప్పవాడు” అని సమాధానమిచ్చా డు శిష్యుడు.
ఇదీ భక్తుడి విశిష్టతని ఉదాహరణ పూర్వకంగా, చాకచక్యంగా చమత్కారంతో చెప్పే కథ!
భగవంతుడ్ని ఒప్పించేది, మెప్పేంచేది, బంధించేది, బంధన చేసేది, చిక్కేంచేది, చిక్కేలా చేసేది, దక్కేంచేది, దక్కే లా చేసేది భక్తి ఒక్కటే. అంతటి మహోన్నతమైన శక్తి గలది భక్తి.
అంతటి శక్తివంతమైన భక్తి కోసం తపించాలి. తపన పడాలి. వేదన పడాలి. రోధించాలి. సాధన చేయాలి. శోధన చేయాలి. అలాంటి భక్తి తత్వాన్ని సంపాదించాలి. స్వంతం చేసుకోవాలి. సాఫల్యం చేసుకోవాలి. అసలు సిసలైన భక్తి తత్వాన్ని ఆకళింపు చేసుకోవాలి. అనుభవించాలి. అనుభవం లోనికీ తెచ్చుకోవాలి.
ఆ భగవంతుని అనుగ్రహానికి పాత్రులం కావాలి. పునీతులం కావాలి.