హంస- పరమహంస
తిరుమల శ్రీనివాసుడు సంకీర్తన ప్రియుడు. వేదాలకు, యాగాలకు ఎంత ప్రసన్నుడు అవుతాడో పదకవితలకూ అంతే పరవశిస్తాడు. కడు ఆనందకరమైన హరినామాన్ని సదా ఆలపిస్తూ ఎదిగిన అన్నమయ్య వేదాలు నుతించిన భగవానుడిని వేనవేల సంకీర్తనలతో అర్చించాడు. తిరుగిరులను కట్టెదుర నిలిచిన వైకుంఠంగా అభివర్ణించాడు. ‘అంటి అలివేల్మంగ అండనుండే స్వామిని కంటి’నంటూ కొసరికొసరి శ్రీహరిని కీర్తించాడు. ‘జో అచ్యుతానంద జోజో ముకుందా’ అంటూ రామగోవిందుడిని నిద్రపుచ్చిన తాళ్లపాక నందనుడి కీర్తన వటపత్ర శాయిని మాత్రమే కాదు, ప్రతి పసివాడినీ నిద్రపుచ్చుతుంది. ఈ సంకీర్తనాచార్యుడి ప్రతి కీర్తనా పరవశింపజేసేదే! జగమంతా జగన్నాథుడిగా భావించిన పదకవితా పితామహుడు పక్షులలోనూ పరమాత్ముడినే దర్శించుకున్నాడు.
హంస నీటి పక్షి. భారతీయ ఆధ్యాత్మిక చింతనలో హంసను జ్ఞానానికి ప్రతీకగా భావిస్తారు. వేదాల్లో హంస గాయత్రీ మంత్రం ప్రసిద్ధిచెందింది. పరమహంస, హంస ఉపనిషత్తులు కూడా ఉన్నాయి. సృష్టికర్త బ్రహ్మదేవుడు, చదువుల తల్లి సరస్వతీదేవికి వాహనంగా హంస అలరారుతున్నది. నీళ్లలో విహరిస్తున్నప్పటికీ హంస రెక్కలు తడవవు. సంసార సాగరంలో చిక్కుకున్నప్పటికీ, మనిషి దానికి అంటుకోకుండా జీవించాలనే దానికి హంస సంకేతంగా నిలుస్తుంది. యోగశాస్త్రం ప్రకారం హంస ఉచ్ఛాస(హం), నిశ్వాస (స)లకు ప్రతీక. అందుకే మనిషి ఊపిరి ఆగిపోయినప్పుడు ‘హంస ఎగిరిపోయింది’ అంటారు. ‘హంసో’ అనే పదాన్ని పదేపదే ఉచ్చరిస్తే ‘సోహం’గా మారిపోతుంది. సోహం అంటే ‘అది (పరమాత్మ) నేను’ అర్థం. అలా జీవాత్మే పరమాత్మ అనే అద్వైతసారాన్ని తెలిపే హంసను పరమాత్ముడికి గుర్తుగా కూడా పరిగణిస్తారు.
మనసే సరోవరం
పక్షి జాతికి చెందిన హంసకు భారతీయ ధర్మం పరమోన్నత స్థితిని కట్టబెట్టింది. హంస నీటిలో విహరిస్తూ, ఆహారాన్ని సేకరించుకునే క్రమంలో ఒక దగ్గర మునుగుతూ, ఇంకో దగ్గర తేలుతూ ఉంటుంది. హంస మునిగి, తేలే ప్రాంతాల్లో అది విహరించిన గుర్తుగా నీళ్లు కదిలిన ఆనవాళ్లు కనిపిస్తాయి. ఈ దృశ్యాన్నే పదకవితా పితామహుడు అన్నమాచార్యులు “దిబ్బలు వెట్టుచు తేలినదిదివో/ ఉబ్బునీటిపై నొక హంస” అని సంకీర్తనలో కండ్లకుకట్టాడు. అన్నమయ్య పాటలో నీటిమీద తేలుతున్నది మామూలు హంస కాదు… అది సాక్షాత్తూ తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామే. మామూలు హంస కొలనులో కమలం పువ్వుల మధ్య విహరిస్తూ ఉంటుంది. విష్ణుమూర్తి రూపమైన శ్రీవేంకటేశ్వరుడు పాలసముద్రంలో కమల (లక్ష్మీదేవి పద్మావతీదేవి)తో విహరిస్తూ ఉంటాడు. హంసలు టిబెట్‌లో కైలాస పర్వతం దగ్గర నెలవైన మానస సరోవరంలో సంచరిస్తాయని అంటారు. అవి మంచి ముత్యాలనే ఆహారంగా తీసుకుంటాయట. ఇలా హంసలకు పౌరాణిక గాథల్లో ఎన్నో విశిష్ట లక్షణాలను ఆపాదించారు. ఇక వేంకటాద్రి మీద వెలసిన హంస మాత్రం జీవుల మనసులనే సరోవరాల్లో విహరిస్తుందని అంటాడు అన్నమయ్య.
దిబ్బలు వెట్టుచు తేలిన దిదివో
ఉబ్బునీటిపై నొక హంసా॥
అనువున కమల విహారమె నెలవై
ఒనరి ఉన్నదిదె ఒక హంసా
మనియెడి జీవుల మానస సరసుల
ఉనికి నున్నదిదె ఒక హంసా॥
పాలునీరు వేర్పరిచి పాలలో
నోలలాడె నిదె ఒక హంసా
పాలుపడిన యీ పరమహంసముల
ఓలి నున్నదిదె ఒక హంసా॥
తడవి రోమ రంధ్రంబుల గ్రుడ్ల
నుడుగక పొదిగీ నొక హంసా
కడువేడుక వేంకటగిరి మీదట
నొడలు పెంచెనిదె యొక హంసా॥
హంసక్షీర న్యాయం
భారతీయ సాహిత్యంలో హంస అంటే గుర్తుకువచ్చేది… ‘హంసక్షీర’ న్యాయమే. అంటే పాలు, నీళ్లు వేరు చేస్తుందని అర్థం. ఇది కవుల ఊహ మాత్రమే. హంసకు ఆపాదించిన ఈ సుగుణాన్నే అన్నమయ్య తిరుమల శ్రీనివాసుడికి ముడిపెడుతున్నాడు. కాకపోతే, ఈ వేంకటాద్రి హంస పాలు నీరు వేరుచేయడం మాత్రమే కాదు, వేరుచేసిన ఆ పాలలో (పాలసముద్రంలో) ఓలలాడుతున్నదట. ఇక్కడ పాలు పాలసముద్రం అంటే స్వచ్ఛమైన, పవిత్రమైన మనసులకు సంకేతం. మంచిని గ్రహించి చెడును వదిలిపెట్టడం ఉత్తముల లక్షణం. అంతేకాదు పాలసముద్రంలో తేలియాడుతున్న ఆ హంస ఎలా ఉందీ అంటే… తన దగ్గరికి చేరుకున్న జ్ఞానోదయం పొందిన పరమహంసల వరుసలా ఉందట. భగవంతుడు పరమహంసలకే పరమహంస కదా!
హంస వాహన సేవ
ప్రతిక్షణం కదిలేదీ, అదే సమయంలో స్థిరంగా ఉన్నదీ అయిన స్థావర జంగమాత్మకమైన జగత్తు అంతాకూడా విష్ణుమయమే. చరాచర సృష్టికి మూలకారణం, దాన్ని లయం చేసుకునేది అన్నీ భగవంతుడే. విష్ణుమాయా విలాసం అంటే ఇదే. హంస ప్రేమతో గుడ్లను పొదిగి పిల్లలను కంటుంది. వేంకటాద్రి పరమహంస కూడా విరామం లేకుండా తన ఒక్కొక్క రోమ రంధ్రం నుంచి ఈ విశ్వాన్ని, సకల జీవరాశులనూ సృష్టిస్తున్నాడు. సర్వసృష్టికీ మూలకారణం అయిన పరమహంస వేంకటగిరుల మీద ఎంతో వేడుకగా, చూడముచ్చటగా శరీరాన్ని పెంచి నిల్చుందట. నీటిపక్షి హంసలోనూ పరమాత్ముడిని దర్శించి సంకీర్తన రచించడం అన్నమయ్య అనన్య భక్తికి నిదర్శనం. అంతేకాదు… తన జీవితంలో ప్రతీ సన్నివేశంలోనూ వేంకటేశ్వరుడినే దర్శించాడనడానికి ఈ సంకీర్తన ఒక ఉదాహరణ. ఒక్క తిరుమల మాత్రమే కాదు దక్షిణ భారతదేశంలోని వైష్ణవ, శైవ క్షేత్రాల్లో జరిగే బ్రహ్మోత్సవాలలో ఆయా దేవతలకు హంస వాహన సేవ జరిపిస్తారు. ఇది హంస భగవంతుడికి ప్రతీక అనే రహస్యాన్ని చాటే ప్రయత్నమే.
… చింతలపల్లి హర్షవర్ధన్.