భగవంతుణ్ణి ఏ పేరుతో పిలవాలన్నది’ చాలామంది సందేహం. ‘భగవంతుడు ఓంకార వాచ్యుడు కనుక, అతణ్ణి ఓమ్ అని పిలిస్తే చాలని’ పతంజలి మహాశయుడు ‘యోగదర్శనం’లో చెప్పాడు. వాసుదేవుడుకూడా ‘భగవద్గీత’లో ‘ఓమిత్యే కాక్షరం బ్రహ్మ’ అని, ‘భగవంతుణ్ణి ‘ఓం’కార నామస్మరణతో భజించాలని’ ఉపదేశించాడు. ‘ఓం’ భగవంతుని నిజమైన నామమే కాక ముఖ్యనామం కూడా. ‘ఓం’కారానికి ఉన్న ప్రశస్తి ఇతర నామాలకు లేదు. ‘ఓమ్'లో మూడు వర్ణాలున్నాయి. ‘అ, ఉ, మ్' అనేవి. అవి భగవంతుని ‘సృష్టి, స్థితి, లయ’లకు ప్రతీక. వ్యాసులవారు ‘వేదాంత దర్శనం’లో ‘భగవంతుడు ఎవరు?’ అన్న ప్రశ్నకు సమాధానంగా ‘జన్మాద్యస్యయతః’ అని సూత్రీకరించాడు. ‘ఎవరివల్ల జన్మ (సృష్టి), దానితోపాటు స్థితి లయలు సంభవిస్తున్నాయో వారే భగవంతుడని’ ఆయన సెలవిచ్చాడు. పతంజలి, వ్యాసుడు మొదలైన మహర్షుల ప్రతిపాదన వేదానుగుణమైంది. ‘యజుర్వేదం’లోని 40వ అధ్యాయంలో ‘ఓం క్రతో స్మర’ అనే వాక్కు గమనింపదగింది.
సర్వే వేదా యత్ పదమామనంతి
తపాంసి సర్వాణిచ యద్ వదంతి
యదిచ్ఛంతో బ్రహ్మచర్యం చరంతి
తత్తే పదం సంగ్రహేణ బ్రవీమి ఓమిత్యే తత్.
- కఠోపనిషత్తు (2-15)
‘తైత్తిరీయోపనిషత్తు’ మొదలుకొని అన్ని ఉపనిషత్తులూ మనకు శాంతి కలగాలని ‘ఓమ్ శాంతిః శాంతిః శాంతిః’ అనే మంత్రాన్ని ఉపదేశిస్తున్నాయి. నాలుగు వేదాలు దేన్ని పొందదగిందిగా వర్ణిస్తాయో, అన్ని తపస్సులు దేనిగురించి చెబుతున్నాయో, మోక్షార్థులు దేనికోసం ‘బ్రహ్మచర్య వ్రతాన్ని’ పాటిస్తారో ఆ పరబ్రహ్మ తత్తానికే ‘ఓమ్' అని పేరు. ‘ఓం’కారం భగవంతుని సహజనామం కాగా, ఇంకెన్నో పేర్లు భగవతత్తాన్ని తెలుపుతున్నాయి. భగవంతుడే సృష్టికర్త కనుక ‘సవిత’, విశ్వాన్నంతటినీ ప్రకాశింపజేస్తాడు కనుక ‘సూర్యుడు’. అంతటా వ్యాపకుడైన ‘పరమాత్మా’ ఆయనే. ప్రపంచాన్నే ఐశ్వర్యంగా కలిగినవాడు కనుక పరమేశ్వరుడు, జగత్తును క్రీడింపజేస్తూ, స్వయంగా ప్రకాశిస్తూ, ‘సచ్చిదానంద స్వరూపుడై’ ఉన్నాడు కాబట్టి, ‘దేవుడు’. సర్వజీవులలో అంతర్యామి అయినవాడు కనుక ‘నారాయణుడు’. ప్రాణికోటిని ఏడ్పించే ‘రుద్రుడు’, అన్నిటికంటే గొప్పవాడైన బ్రహ్మ ఆయనే. భగవంతుడు సకలైశ్వర్య సంపన్నుడై సేవింపదగినవాడు. అందువల్ల, ఏ పేరుతో పిలిచినా ఒక్కటే. ఐతే, ‘ఓం’కారమే అతని సహజనామం అన్న దానిని మాత్రం మరవరాదు.
భగవంతునిలో ఎన్నో సుగుణాలున్నాయి. కొన్ని పేర్లు వాటిని తెలియజేస్తాయి. ఆయన సర్వజ్ఞుడు, సర్వశక్తిమంతుడు, సర్వవ్యాపకుడే కాదు, అన్ని లోకాలకు ఈశుడతడు ఒక్కడే. అతనితో సమానులుగాని, మించినవారుగాని లేరు. అన్ని పదార్థాలలో, జీవులలో అతడున్నాడు. అలాగే, అన్ని పదార్థాలూ, జీవులూ అతనిలోనూ వున్నాయి. అతడే సృష్టికర్త కనుక ‘బ్రహ్మ’, పోషణకర్త కనుక ‘విష్ణువు’, లయకారుడు కనుక ‘రుద్రుడు’గా వ్యవహరిస్తున్నాం. ఆది-అంతం లేనివాడు కనుక ‘అనంతుడై’నాడు. అన్ని పేర్ల అర్థం ఒక్క ‘ఓం’కారంతోనే సిద్ధిస్తుంది. మన పూర్వికులు అన్నివేళలా భగవంతుణ్ణి స్మరిస్తూ, ‘ఓం శాంతిః శాంతిః శాంతిః’ అన్నారు. మూడు లోకాలను పాలించేవాడే మూడు దుఃఖాలను (ఆధ్యాత్మికం: శరీర సంబంధం, ఆధిభౌతికం: తోటిప్రాణులవల్ల కలిగేది, ఆధిదైవికం: ప్రకృతి విపత్తులద్వారా ఏర్పడేది) పోగొడతాడు. ‘ఓం’కారంలోని ‘అ+ఉ+మ్' అనే మూడు మాత్రలు భగవంతుని మూడు వంతుల మహిమను మాత్రమే తెలియజేస్తాయి. నాల్గవ వంతు మహిమ ఎవరికీ అందదు. అందుకే, అతణ్ణి ‘ఓంకారాతీతుడనీ’ పిలుస్తాం.
ఆచార్య మసన చెన్నప్ప
No comments:
Post a Comment