Tuesday, February 16, 2021

హారేకృష్ణ

సృష్టి ఎందుకు పరిపూర్ణంగా కనిపించదు, సమగ్రంగా ఉండదు అనేవి నిర్వేద భావనలు. వాటి గురించి మనిషి లోతుగా ఆలోచించాల్సి ఉంటుంది! 

పరిపూర్ణుడైన భగవంతుడు తన సృష్టిని దోషరహితంగా ఎందుకు మలచడం లేదు? అదే మన వాక్కుకు, మనసుకు ఇంకా అందని రహస్యం! 

లోపం అనేది, మనిషి మనిషికీ మారే విశేషణం. ఒకరు ద్వేషించింది మరొకరు ఇష్టపడతారు. ఒకరికి మేలు చేసేది మరొకరికి కీడు కలిగించవచ్చు. ఏది మంచి, ఏది చెడు అని నిర్ణయించుకోవాల్సింది ఎవరికి వారే! అడవుల్లో నివసిస్తూ తపోధ్యానాదులు ఆచరించే శుద్ధ సాత్వికులైన మునుల్ని రాక్షసులు వేధించేవారు. కారణం... అది వారి నైజం కావడమే! 

సాక్షాత్తు భగవంతుడే ఓ అవతార పురుషుడిగా ఆవిర్భవించినా ఆయనను ద్వేషించేవారూ పుట్టారు, పుడతారు. భార్యను అనుమానించిన ఓ వ్యక్తికి  మర్యాదాపురుషోత్తముడైన శ్రీరామచంద్రుడిలోనే లోపాలు కనిపించాయి! షోడశ కళాప్రపూర్ణుడైన శ్రీకృష్ణ పరమాత్మలో ద్వేషించదగిన అంశాలే ధార్తరాష్ట్రాదులకు గోచరించాయి. జరాసంధుడికి శ్రీకృష్ణుడిలో అల్పత్వమే కనిపించింది. లోక కల్యాణం అంటేనే ఓర్వలేని కొందరు మతం పేరిట ఉగ్రవాదులుగా మారి మారణకాండకు పాల్పడటం మనందరికీ తెలిసిన కిరాతకమే! 

‘పరిపూర్ణత’ సిద్ధాంతాన్ని నమ్మేవారు కొందరు ఉంటారు. వారు ప్రతి ఒక్కటీ దోషరహితంగా చేయాలని సంకల్పిస్తారు. చేసే పని, తినే తిండి, ఇతరుల మనస్తత్వాలు, ఆచరించే విధానాలు... అన్నీ పూర్తి పరిపూర్ణంగా ఉండాలనుకుంటారు. తాము ఆశించిన విధంగా లోకం లేనప్పుడు- శారీరక, మానసిక ఒత్తిళ్లకు లోనై బతుకును భారం చేసుకుంటారు మరికొందరు. పుడుతూ గిడుతూ తరచూ మార్పులకు లోనవుతుంటుంది జగత్తు. ఇది పరిపూర్ణం కాదు. పరిపూర్ణుడు ఒక్క భగవంతుడే! 

తోటివారిలోని లోపాలను వేలెత్తి చూపడమే మనిషి పని కాకూడదు. అవకాశం ఉన్నప్పుడు సంస్కరించాలి. తాను ఇతరుల్లో చూసే లోపాలు తనలో లేవని నిర్ధారణ చేసుకోవడం అతడికి, సమాజానికి మంచిది.
‘ఎవరూ పరిపూర్ణులు కారు... ఆ అంతర్యామి తప్ప! తప్పులు అందరూ చేస్తారు. క్షమించగల మనస్తత్వమే విలువైన సుగుణం’ అని మనిషి గ్రహించాలి. సర్దుకుపోవడంలోనే మానవత్వం దాగి ఉంది, విశ్వకల్యాణం ఉంది. సమాజం మారాలంటే మొదట మనం మారాలి. లోపాల్ని తొలగించుకుంటూ, మనల్ని మనం సంస్కరించుకొనే ప్రయత్నం చేయడమే అంతర్యామి హర్షించే నిజమైన పరిపూర్ణత! ఆ కోణంలో తన సాధనను సంపూర్ణం చేసుకున్న వ్యక్తే- మనీషి, పరిపూర్ణుడు!

No comments:

Post a Comment

శివోహం

ప్రతి ఒక్కరి బతుకులోనూ ఏదో ఒక వేదన ఉంటుంది… తేడా మాత్రం ఒక్కటే... కొందరు రోదిస్తూ చెప్పుకుంటారు… కొందరు నవ్వుతూ దాచుకుంటారు. నేను రెండో రకం.