Wednesday, February 3, 2021

శివోహం

ముక్తి సాధనకు నిజమైన భక్తి మార్గం ఏది? సాకార విగ్రహారాధనా? నిరాకార నిర్గుణ ఉపాసనా? నిజానికి నిరీశ్వర, నిరాకార, నిర్గుణ, నిర్వికార, సచ్చిదానంద స్వరూపమైన పర బ్రహ్మతత్వం ఒక్కటే. దాన్నే.. పరమ భక్తాగ్రగణ్యుడైన అన్నమయ్య ‘బ్రహ్మమొక్కటే, పరబ్రహ్మమొక్కటే’’ అని సులభమైన మాటలలో గానం చేశాడు. అటువంటి పరబ్రహ్మ సంకల్పానుసారం.. ఆయన నుండి విడివడిన శక్తే జీవాత్మ, పరమాత్మలుగా వ్యవహరింపబడుతోంది. ప్రకృతి ధర్మాన్ననుసరించి.. జీవాత్మ తనను పరమాత్మ నుంచి వేరుగా భావించడం వల్లనే ద్వంద్వం ఏర్పడింది. పంచభూతాలు, త్రిగుణాలు, అరిషడ్వర్గాలు, మనోబుధ్యహంకార చిత్తాల సృష్టి కూడా పరబ్రహ్మ లీలా వినోదంలో భాగమే. అజ్ఞానం చేత, అహంకార, మమకారాల చేత, రాగద్వేషాల చేత.. చెడుగా ప్రవర్తించే వారి నుంచిమంచి వారిని కాపాడటానికి భగవంతుని అవతార ఆవశ్యకత ఏర్పడింది. అందుకే గీతాచార్యుడు.. ‘‘పరిత్రాణాయ సాధూనాం వినాశాయచ దుష్కృతాం ధర్మసంస్థాపనార్థాయ సంభవామి యుగేయుగే’’ అని ప్రవచించాడు.
 
అంతే కాకుండా ‘‘యే యథామాం ప్రపద్యంతే తథైవ భజామ్యహం’’ ఎవరు నన్ను ఏవిధముగ పొందాలని కోరుకుంటారో నేను వారిని ఆ విధముగా సేవించగలను. అని గీతాచార్యుడు చెప్పినట్లుభక్తుల కోరికల మేరకు భగవంతుడు అవతారములెత్తడం జరిగినది. రావణాసురుని కోరిక మేరకు మానవరూపంలో రామావతారం, వైరభక్తిని కలిగియున్న హిరణ్యకశ్యపుని నియమాలకు లోబడి నరసింహస్వామి అవతారం ఈ కోవకు చెందినవే.
 
ఈ విధముగ అవతారములెత్తుటకు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో భక్తుల కోరికే కారణం. గుణాతీతుడైన పరమాత్మ.. సత్వరజస్తమో గుణాలనాశ్రయించి విష్ణు, బ్రహ్మ, శంకరులుగా విడిపోయి మరికొన్ని సగుణ రూపాలకు కారణమయ్యాడు. వైష్ణవం, శైవం, శాక్తేయం.. ఇలా అనేక సగుణ రూపాలేర్పడినా అదంతా ఆ భగవంతుని లీలలో భాగమే. ఒక బంగారపు ముద్ద నుంచి రకరకాల ఆభరణాలు తయారైనా.. అన్నింటిలో బంగారం ఒక్కటే అయినట్లు, ఒక జ్యోతి నుంచి వేరువేరుగా వెలిగింపబడిన అన్ని జ్యోతులలోని తేజోస్వరూపం ఒక్కటే అయినట్లు.. అన్ని దేవతామూర్తులలోని భగవత్తత్వం ఒక్కటే.
 
చంచలమైన మనసుకు నిలకడ శక్తిని చేకూర్చి నిరాకార నిర్గుణ, సచ్చిదానంద స్వరూపమైన భగవంతుని చేరుకోవడానికి, మాయామయమైన ప్రాపంచిక విషయ వాంఛల నుంచిభగవత్తత్వం నందు మనసు నిలపడానికి సాకారపూజ ప్రాథమిక విద్యలాంటిది. సాకారపూజ ద్వారా నిర్గుణోపాసనకు అవసరమైన మానసిక స్థైర్యము చేకూరుతుంది. సాకార పూజ మూడు విధాలు. ధ్వని రూప సేవ, లిపి రూప సేవ, విగ్రహారాధన. నారద, తుంబురుల వంటివారి గానం.. వ్యాస, వాల్మీకి మహర్షుల జపం, అన్నమయ్య, త్యాగరాజు, రామదాసు వంటివారి నాదోపాసన.. ఇవన్నీ ధ్వని రూప ఆరాధన కిందికివస్తాయి. శివకోటి, రామకోటి లాంటివి రాయడం, పుస్తకరచన, పురాణ రచన లాంటి వాటితో తరించడం లిపి రూప ఆరాధన.
 
ఇక విగ్రహ రూపంలో ఉన్న పరమాత్మను ఆరాధించడం మనందరికీ తెలిసిందే. భగవంతుని నామాన్ని నోటితో పలుకక, అక్షరరూపంలో రాయక, విగ్రహరూపంలో పూజించక దైవానుగ్రహాన్ని పొందలేం. ఈ మూడు మార్గాలూ సాకార సేవకే చెందగలవు. నిశ్చల సమాధి స్థితిలో ఉండి భగవంతుని నిరాకారంగా సేవించడం కొందరికే సాధ్యం. అది సాధించేవరకు సామాన్యులందరికీ విగ్రహారాధనయే తరుణోపాయం. సాకార సేవయే దిక్కు.

No comments:

Post a Comment

  బాహ్యంలో నా నేను ఊరేగుతూ... అంతరంలో నా నేను కు దూరమై... ఎటూ చేరలేని అవస్థలు, తీరని బాధలు... నన్ను ఓ దరికి చేర్చవా పరమేశ్వరా.. మహాదేవా శంభో...