శిష్యుడు: గురువు గారూ! ‘ఈశావాస్య మిదగ్‌ం సర్వమ్’ అంటారు కదా! మరి ఈశ్వరుడు ఎల్లెడలా ఎలా కొలువై ఉన్నాడో వివరిస్తారా?
గురువు: నాయనా! ఈశ్వరుడు ఎల్లెడలా ఎలా ఉన్నాడని తెలుసుకునే ముందు అసలు ఈశ్వరుడు అంటే ఎవరో అర్థం చేసుకోవాలి. ఈశ్వర పదానికి ఈట్/ ఈశ అనే పర్యాయపదాలు ఉన్నాయి. ఈశాన అంటే ఒక విషయాన్ని అదుపులో ఉంచుకోవడం, పెత్తనం చెలాయించడం! ఈ చరాచరసృష్టికి బాహ్యంగా, ఆంతర్యంగా చేరి దానిని తన వశంలో ఉంచుకొని నడుపుతున్నది ఈశ్వరుడే! అంతర్యామి అని కూడా ఆయనకే పేరు.
‘ఈశ్వరః సర్వభూతానాం హృద్దేశే’ అని భగవద్గీత చెబుతున్నది. తన మాయాశక్తిని ఆధీనంలో ఉంచుకొని సృష్టి, స్థితి, లయాదులు చేస్తున్న వాడే ఈశ్వరుడు. ఇదంతా ఈశ్వరుడి చేతే వాసితం అయి ఉన్నది. కాబట్టి ఈ విశ్వాన్ని ఈశ్వర భావనతోనే చూడమని ఈశావాస్య ఉపనిషత్తు చెబుతున్నది.
ఈశ్వరుడికి, పరమాత్మకు ప్రత్యేక లక్షణాల ద్వారా ఆయాపేర్లు సూచించారు మన ఉపనిషత్ కర్తలు. పరమాత్మ వేరు, ఈశ్వరుడు వేరు. నిర్గుణ తత్వాన్ని పరమాత్మగా, ఆత్మగా, బ్రహ్మగా పేర్కొనాలి. అదే ఆత్మ సగుణమై జగన్నాటకం నిర్వహిస్తే ఈశ్వరుడిగా చెప్పాలి. మనం అనుభవిస్తున్న మాయాశక్తి నిర్గుణంలో గుప్తమై ఉంటుంది. గుప్తమై ఉన్న శక్తి ఈశ్వరుడిలో ప్రకటనమై, అతనికి అధీనమై సృష్ట్యాదులు సాగిస్తున్నది. ఇది మనం గ్రహించవలసిన రహస్యం.
శిష్యుడు: గురువు గారూ! అంటే ఈశ్వరుడు, ఆత్మ ఒకటే అంటారా?
గురువు: అవును! ఆత్మ రూపంలో కనిపించకుండా ఉన్న అనంతమైన శక్తిలో కొంతభాగం మాయాశక్తిగా పరిణమించడంలోనే విభూతులన్నీ ఉనికిలోకి వస్తున్నాయి. ఈ విభూతులన్నీ మన కంటికి కనిపిస్తున్నా.. ఇవన్నీ మాయాశక్తితో రూపుదిద్దుకున్న మాయా రూపాలే!
శిష్యుడు: గురువు గారూ! ఈ మాయాశక్తి వివిధ విభూతులలో ఎలా నిక్షిప్తమై ఉంది? దానిని కనుగొనడం ఎలా?
గురువు: నాయనా! సూర్యరశ్మిలో ఉష్ణోగ్రత కనిపించదు. ఆ ఉష్ణాన్ని ఆవరించి ఉన్న రశ్మి మాయాశక్తే! అదే సూర్యుడిలో శక్తిని ప్రజ్వలింపజేసే సంలీనశక్తి కూడా మాయే! ఇంకా చెప్పాలంటే నీలో ఉత్పన్నమయ్యే ఉష్ణశక్తీ, కండరాలు కదిలించగలిగే శక్తీ, జీర్ణవ్యవస్థలో ఆహారాన్ని కరిగించే ఆమ్లశక్తీ, రక్తాన్ని పరుగులెత్తించే చోదకశక్తీ అన్నీ మాయాశక్తే! చివరికి మనలో చైతన్యాన్ని ప్రేరేపించే ప్రాణశక్తి కూడా మాయాశక్తే!!
శిష్యుడు: ఒక్క మాయాశక్తి ఇన్ని రూపాల్లో ఎలా ప్రకటితమవుతుంది గురువు గారూ!
గురువు: దానికి కారణం ఆత్మే! అంతరిక్షంలోకి సాలోచించి సుదీర్ఘంగా చూడు. ఈ విభూతులన్నీ ఆకాశంలో ఎంతో వేగంగా తిరుగుతున్నా ఒకదానితో మరొకటి ఢీకొనడం లేదు. అలా ఢీకొనకుండా ఉంచుతూ, వాటిని మన ఊహకు అందని వేగంతో తిప్పే శక్తే ఈ విభూతులుగా ప్రకటితమవుతుంది. అంటే ఆ అనంతశక్తి ఈశ్వర తత్వంలో ఏకకాలంలో ఇటు విభూతులుగానూ, అటు వీటన్నిటినీ అదుపులో ఉంచే శక్తిగానూ తన విద్యుక్తధర్మాన్ని నిర్వహిస్తూ వస్తున్నది. అదే మాయాశక్తి ఏకకాలంలో వివిధ శక్తులుగా అంతర్గతంగా ఉంటూ, అదేకాలంలో బహిర్గతమవుతూ తన వైచిత్రిని చాటుతున్నది. అందుకే అది మాయాశక్తి, ఇదంతా మాయా ప్రపంచం.
శిష్యుడు: గురువు గారూ! ఇదంతా వింటుంటే, అంతా అర్థమైనట్టుగానూ, ఏమీ అర్థంకానట్టుగానూ ఉంది. అందుకేనేమో ‘ఆశ్చర్యవత్ పశ్యతి కచ్చిదేనం..’ అని గీతాచార్యుడు ప్రకటించాడు. ఇదే విషయాన్ని ఆధునిక శాస్త్రవేత్తలు డార్క్ ఎనర్జీ, క్వాంటం ఫిజిక్స్ అనే శాస్ర్తాలుగా అధ్యయనం చేస్తూ ఆశ్చర్యపోతున్నారు!!
…రావుల నిరంజనాచారి
No comments:
Post a Comment