నీకోసం ...
ఎదురుచూస్తూ ఎరుపెక్కిన
నా కనుల అరుణవర్ణాన్ని ...
మించి ఉంటుందేమో నీ త్రినేత్ర నేత్రం ?
అందుకే అది నీ నుదుటిపై అక్కడుందేమో ??
నీ నామనాదంతో నినదిస్తూ
నర్తించే నా ఒంటి నాలుకను ...
మించి ఉంటుందేమో
నీ రెండునాలుకల నాగసర్పం?
అందుకే అది నిను పెనువేసిందేమో??
నీ రుద్రంతో రోమాంచితమయ్యే
వేనవేల రోమశూలాల శరీరాన్ని ...
మించి ఉంటుందేమో నీ చేతి త్రిశూలశూలం?
అందుకే అది నిను చేరవచ్చిందేమో ??
తనువులోని అణువణువు
ఆత్మలింగమై అర్చించే ఆర్తిని ...
మించి ఉంటుందేమో
నీ డమరుకనాద విన్యాసం?
అందుకే అది నీకు ఆలంబనమేమో??
నేను కూడా నీ ఆవేశాన్నే
ఆయువు ఉన్న ఆయుధాన్నే ...
అక్కున చేర్చుకుంటావో ?
ఆలింగనం చేసుకుంటావో ??
" నీ అభీష్టం తండ్రీ "
No comments:
Post a Comment