Wednesday, July 22, 2020

శివోహం

శివోహం

శివా!నామ రూప రహితమైన నిన్ను తెలియగ
నాకు మనసైన  నామముతో తెలుసుకొమ్మనీ
శత సహస్ర నామాలాకు రూపమిస్తివా
మహేశా. . . . . శరణు .

శివోహం

భక్తిప్రపత్తులు.. ఆధ్యాత్మిక పరిభాషలో ఎక్కువగా వినిపించే పదబంధం ఇది. భక్తి.. ప్రపత్తి.. ఈ రెండింటికీ చాలా తేడా ఉంది. అయితే, ఈ రెండూ భగవదనుగ్రహాన్ని పొందడానికి, మోక్షసాధనకు గల భిన్నమైన మార్గాలు. ‘భక్తి’ గురించి మనందరికీ తెలిసిందే. దైవాన్ని ఆరాధించడం, ప్రేమించడం, పూజించడం, ప్రార్థించడం, వేడుకోవడం, భగవన్నామస్మరణ చేయడం.. ఇలా ఎన్నో రకాలుగా మన భక్తిని చాటుకుంటాం. జనసామాన్యమంతటికీ అందుబాటులో ఉన్న ఆధ్యాత్మిక సాధన ఇదే. కానీ భక్తి చాలామందికి తాత్కాలిక అంశం మాత్రమే. భక్తి నేతి ధారవలె నిరంతరం కొనసాగుతుండాలని భగవాన్‌ రమణులు చెప్పారు. ఆపత్కాల భక్తి వల్ల అంత ప్రయోజనం ఉండదు. అలాగని సాధారణ ప్రజకు నిరంతరం భగవన్నామ స్మరణలో మునిగి ఉండడమూ సాధ్యం కాదు. పైగా భక్తిమార్గం నుంచి మనను పక్కకు తప్పించడానికి ‘మాయ’కు ప్రతిరూప మైన మనస్సు ఉండనే ఉంది. మనం సరైన దారిలో నడవకుండా చేయడమే దాని పని. అది సదా ఈ శరీరమే ‘నేను’ అనుకోవడం, దేహపోషణకు ఎక్కువ ప్రాధాన్యమివ్వడమనే దేహాభిమానాన్ని పెంచిపోషిస్తుంటుంది. వాస్తవానికి ‘నేను’ అంటే కనిపించే ఈ ‘దేహం’ కాదు. ‘ఇది నా కాలు.. ఇది నా చెయ్యి.. ఇది నా కడుపు.. నా గుండె.. నా తల’ అంటుంటాం. అలా మనం అనుకొనే ఆ ‘ఇది’ అంటే ఏమిటి? అని ఆలోచిస్తే అర్థం అవుతుంది. ‘నేను’అంటే ఆత్మ. మనందరం ఆత్మస్వరూపులమే. ఈ శరీరాన్ని చైతన్యవంతంగా ఉంచుతున్న చలనశక్తే అసలైన మనం. అదే ఆత్మచైతన్యం. ఆ విషయాన్ని అర్థం చేసుకుని గట్టిగా పట్టుకోవాలి. ఇది భక్తుడి బాధ్యతే. భగవంతుడి పనికాదు. అందుకే ఈ విధానాన్ని ‘మర్కట కిశోర న్యాయం’ అంటారు. భక్తిమార్గంలో సాధకుడు కూడా ఇలాగే ఎన్ని కష్టాలెదురైనా భగవంతుణ్ని పట్టుకునే ఉండాలి. ప్రహ్లాదుడు ఇందుకు ఉదాహరణ.

ఇక ప్రపత్తి.. భక్తి కంటే ఉన్నతమైనది. భారమంతా భగవంతునిపై వేసి సంపూర్ణ శరణాగతి వేడే విధానాన్నే ప్రపత్తి అంటారు. అది ‘మర్కట కిశోర న్యాయం’ వలె కాక.. ‘మార్జాల కిశోర న్యాయం’ వలె ఉంటుంది. మార్జాలం అంటే పిల్లి. అది ఒక ఇంట్లో మరుగు చూసుకుని పిల్లలను కంటుంది. కానీ, ఆ కూనలను పెద్దయ్యేవరకూ ఒకేచోట ఉంచదు. చాలాచోట్లకు తిప్పుతుంటుంది. వాటిని జాగ్రత్తగా తన నోట కరుచుకుని తీసుకెళ్తుంది. పిల్లికూనలు కోతిపిల్లల్లాగా కాక.. పూర్తిగా తల్లిపైనే ఆధారపడి ఉంటాయి. ప్రపత్తి మార్గం ఈ కోవలోనిదే. ‘నీట ముంచినా.. పాల ముంచినా నీవే స్వామి.. మంచిజరిగినా, చెడు జరిగినా నీవే దిక్కు’ అంటూ సాగిలపడే పద్ధతి ఇది. ఈ పద్ధతిలో పరమాత్మను కొలిచేవారు తమ గురించి తాము పట్టించుకోరు. తమ అవసరాల గురించి పట్టించుకోరు. దీంతో దేవుడే వారి భారం వహిస్తాడు. తన భవిష్యత్తు గురించి ఆలోచించకుండా.. అరుణాచలేశ్వరుణ్ని నమ్మి ఇల్లు వీడిన భగవాన్‌ రమణుల వంటివారు ఇందుకు ఉదాహరణ.

శివోహం

శివా! భిక్షమడుగ నిన్ను బయలుదేరెను
రక్ష నొసగగ నిన్ను రమ్మన్నాను
నీ కరుణ కాస్త  నాయందు చూపమన్నాను .
మహేశా ..... శరణు..

శివోహం

ఆత్మ అనే పదం జీవునికి, దేవునికీ వర్తిస్తుంది. జీవుడు జీవాత్మ అయితే.. దేవుడు పరమత్మ. దేహమునందున్నవాడు జీవుడు. శరీరంలో జీవుడున్నంతవరకూ శరీరం చైతన్యవంతంగా ఉంటుంది. శరీరాన్ని ధరించిన జీవుడే దాన్ని నడిపిస్తాడు. జీవుడు స్థూల శరీరాన్ని వదలి వెళ్తుండగా.. అతని సూక్ష్మశరీరంలో భాగమైన పంచప్రాణాలు, మనసుతోపాటు ఇంద్రియాలు అతడి వెంట పరుగులు తీస్తాయి. ఇలా శరీరంలో చైతన్యం జీవాత్మ అయితే.. విశ్వమంతటా నిండి ఉన్న చైతన్యం పరమాత్మ. అన్ని లోకాలయందూ వ్యాపించి ఉన్నది ఆ పరమాత్మ తత్వం. అదే బ్రహ్మం. జీవాత్మకంటే సూక్ష్మమైనది. అంతకంటే సూక్ష్మము వేరే లేనే లేదు. అది వ్యాపకతత్వం. శరీరంలో జీవాత్మతో పాటు పరమాత్మ ఉన్నా.. రెండూ భిన్నమైన తత్వాలు. నిత్యమైనవి, సత్యమైనవి. జీవాత్మ, పరమాత్మ తత్వం కాకుండా ఈ జగత్తులో మనకు కనిపించే పదార్థమంతా జడం. ఇది మార్పు చెందుతుంది. లయమౌతుంది. పరమేశ్వరునిచే ప్రళయకాలం తదుపరి మరల సృష్టించబడుతుంది.
 
ప్రకృతి అంతా జడపదార్థం. పరమాణువుల సముదాయం. ప్రాణం లేనిది. ప్రాణం లేనప్పుడు చర్యలు జరగవు. శరీరం నుండి చైతన్య స్వరూపమైన ఆత్మ వెళ్లిన తర్వాత శరీరం క్రియాహీనమవుతుంది. ప్రకృతి రూపాన్ని ధరిస్తుంది. అంతటా వ్యాపించి ఉన్న అచలుడైన పరమేశ్వరుడే.. శరీరం అనే జడప్రకృతికి చైతన్యాన్ని అందిస్తున్నాడు. జీవాత్మ, పరమాత్మల చైతన్యం కంటికి కనిపించదు. ఎందుకంటే చైతన్యం రూపం కాదు. అన్ని వస్తువులయందు, రూపాలయందు వ్యాపించియుండి వాటిచేత క్రియలు జరిపించేది ఆ బ్రహ్మ తత్వమే. గ్రహసంచారం, సూర్యోదయ, సూర్యాస్తమయాలు, కాలములు ఏర్పడటం వంటి క్రియలన్నీ జరగడానికి హేతువు పరమాత్మ. అన్ని భూతముల యందూ తాను చైతన్యమై, ప్రాణమై వెలుగొందుట వల్లనే ప్రపంచంలో చర్యలన్నీ జరుగుతున్నాయి. వెలుగునిచ్చే వస్తువులన్నీ పరమాత్మ చైతన్యంతోనే వెలుగులీనుతున్నాయి.
 
‘తస్యభాసా సర్వమిదం విభూతి’
 
అని ముండకోపనిషత్తు చెబుతుంది. ‘అతని ప్రకాశం చేతనే ఈ ప్రపంచమంతా వెలుగుతుంది’ అని దీని అర్థం. సూర్యుడుగానీ., చంద్రుడుగానీ, చుక్కలుగానీ.. సమస్త ప్రపంచం పరమాత్మ ప్రకాశంలోనే వెలిగిపోతుందన్న ఉపనిషత్తు వాక్యం మనకు శిరోధార్యం.

శివా

శంభో...
నాజీవిత లోలక కంపన పరిమితిని స్థిరపరచి...
ఊపిరి ఊయలలో నీ నామం స్మరించేలా చేయవా...
పాడు మనసు ఒకే చోట నిలవడం లేదయ్యా...
మహాదేవా శంభో శరణు...

Tuesday, July 21, 2020

శివోహం

నీకు వినబడే అంత గట్టిగా స్మరించలేను...
కానీ మౌనంగానే మాట్లాడతాను...
నా మనసులో ఉండి అంతా విను
వరం ఇచ్చినా ఇవ్వకపోయినా
నీతో చెప్పి ఉంచితే సమయం వచ్చినప్పుడు నీవే రక్షిస్తావు కదా

మహాదేవా శంభో శరణు...

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u శివా! మళ్ళీ జన్మలు ఉన్నా కానీ… మనిషిగ పుట్టే యోగ్యత కలదో లేదో… మళ్లీ నీ సన్నిధి ముంగి...