ఆత్మ అనే పదం జీవునికి, దేవునికీ వర్తిస్తుంది. జీవుడు జీవాత్మ అయితే.. దేవుడు పరమత్మ. దేహమునందున్నవాడు జీవుడు. శరీరంలో జీవుడున్నంతవరకూ శరీరం చైతన్యవంతంగా ఉంటుంది. శరీరాన్ని ధరించిన జీవుడే దాన్ని నడిపిస్తాడు. జీవుడు స్థూల శరీరాన్ని వదలి వెళ్తుండగా.. అతని సూక్ష్మశరీరంలో భాగమైన పంచప్రాణాలు, మనసుతోపాటు ఇంద్రియాలు అతడి వెంట పరుగులు తీస్తాయి. ఇలా శరీరంలో చైతన్యం జీవాత్మ అయితే.. విశ్వమంతటా నిండి ఉన్న చైతన్యం పరమాత్మ. అన్ని లోకాలయందూ వ్యాపించి ఉన్నది ఆ పరమాత్మ తత్వం. అదే బ్రహ్మం. జీవాత్మకంటే సూక్ష్మమైనది. అంతకంటే సూక్ష్మము వేరే లేనే లేదు. అది వ్యాపకతత్వం. శరీరంలో జీవాత్మతో పాటు పరమాత్మ ఉన్నా.. రెండూ భిన్నమైన తత్వాలు. నిత్యమైనవి, సత్యమైనవి. జీవాత్మ, పరమాత్మ తత్వం కాకుండా ఈ జగత్తులో మనకు కనిపించే పదార్థమంతా జడం. ఇది మార్పు చెందుతుంది. లయమౌతుంది. పరమేశ్వరునిచే ప్రళయకాలం తదుపరి మరల సృష్టించబడుతుంది.
ప్రకృతి అంతా జడపదార్థం. పరమాణువుల సముదాయం. ప్రాణం లేనిది. ప్రాణం లేనప్పుడు చర్యలు జరగవు. శరీరం నుండి చైతన్య స్వరూపమైన ఆత్మ వెళ్లిన తర్వాత శరీరం క్రియాహీనమవుతుంది. ప్రకృతి రూపాన్ని ధరిస్తుంది. అంతటా వ్యాపించి ఉన్న అచలుడైన పరమేశ్వరుడే.. శరీరం అనే జడప్రకృతికి చైతన్యాన్ని అందిస్తున్నాడు. జీవాత్మ, పరమాత్మల చైతన్యం కంటికి కనిపించదు. ఎందుకంటే చైతన్యం రూపం కాదు. అన్ని వస్తువులయందు, రూపాలయందు వ్యాపించియుండి వాటిచేత క్రియలు జరిపించేది ఆ బ్రహ్మ తత్వమే. గ్రహసంచారం, సూర్యోదయ, సూర్యాస్తమయాలు, కాలములు ఏర్పడటం వంటి క్రియలన్నీ జరగడానికి హేతువు పరమాత్మ. అన్ని భూతముల యందూ తాను చైతన్యమై, ప్రాణమై వెలుగొందుట వల్లనే ప్రపంచంలో చర్యలన్నీ జరుగుతున్నాయి. వెలుగునిచ్చే వస్తువులన్నీ పరమాత్మ చైతన్యంతోనే వెలుగులీనుతున్నాయి.
‘తస్యభాసా సర్వమిదం విభూతి’
No comments:
Post a Comment