విశ్వాసమే భక్తికి పునాది
ప్రారబ్దవశాత్తు లభించిన దానితో తృప్తి చెందాలి. జీవ్ఞడు గతంలో నాటిన కర్మబీజాలే వర్తమానంలో ఫలిస్తూ ఉన్నాయి. సంచితకర్మలే ఈ జన్మలే ప్రారబ్ద ఫలాలుగా అందుతూ ఉన్నాయి. లేనిది రాదు. ఉన్నది పోదు. ఈరోజు చూస్తూ ఉన్నదంతా గతంలో చేసినదే. ఈరోజు పురుషార్థంతో ఏదైతే చేస్తూ ఉన్నామో దానిని ఆగామిగా భవిష్యత్తులో చూడబోతాము.
కర్మఫలప్రదాత పరమాత్మ కనుక కర్మఫలాలు ప్రసాదాలు. ప్రసన్నతను కలిగించేదే ప్రసాదం కనుక కర్మఫలాలను అందుకోవడంలో ప్రసన్నత నిండాలే కానీ పరితాపం ఉండకూడదు. జీవితంలో ఏది అందినా అది కర్మఫలమే. భుజించే ఆహారం కూడా కర్మఫలమే కనుక యాదృచ్ఛికంగా, ప్రారబ్దవశాత్తు ఏది లభించినా మనిషి దానితో సంతృప్తి చెందే సదలవాటును పెంపొందించు కోవాలి. ఆకలి వ్యాధిగా సంక్రమించిందే కాని సుఖాను భవానికి ద్వారము కాదు. వ్యాధికి కావలసింది మందు కాని విందు కాదు. కాబట్టి ఆకలి అనే వ్యాధికి ప్రారబ్దవశాత్తు ప్రతిదినము లభించిన భిక్షను పరమాత్మకు నైవేద్యంగా సమర్పించి ప్రసాదంగా స్వీకరించాలి.
ఈవిధంగా దేహానికి ఆకలిబాధ తీరుతుంది. చిత్తానికి ప్రసన్నత చేకూరుతుంది. ఆశించినవన్నీ రావ్ఞ. అర్హత ఉన్నవే వస్తాయి. స్వల్పమైన, అల్పమైన కర్మలకు అనంతమైన ఫలం రాదు. కర్మకు ఫలితం వస్తుందే కాని ఆశకు ఫలితం రాదు. ఆశలు పెంచుకుంటే ఆశలతో పాటు ఆవేదనలు పెరుగుతాయి కాని ఆనందం చేజిక్కే అవకాశం లేదు. ఎప్పుడు, ఎవరికి, ఏది, ఎలా అందివ్వాలో సర్వజ్ఞుడైన భగవంతుడికి తెలుసు. పక్షిపిల్ల పడుకోవడానికి మెత్తని గూడు కావాలని తల్లిపక్షికి తెలుసు.
అందుకే కట్టెపుల్లలతో కాక గడ్డిపరకలతో, కొబ్బరిపీచుతో మెత్తని గూడు తయారుచేస్తుంది. పక్షికే ఇంత జ్ఞానమున్నప్పుడు అనంతుడైన భగవంతుని విషయం ఏమని చెప్పాలి? అన్నీ ఉండి, అందరూ ఉండి, రేపు ఎలా జరుగుతుందో అని బెంగపడేవారే అందరూ. కానీ, అందరినీ వదలి, అన్నిటినీ వదలి, వట్టి చేతులతో ఒక జోలెను తగిలించుకొని ప్రపంచంలోకి ప్రవేశించిన సాధువ్ఞకు ఏ భయమూ లేదు. ఎందుకని? అతనికి ఒక్క విషయం క్షుణ్ణంగా తెలుసు.
తాను ఇంటికి దూరంగా పోతూ ఉన్నాడే కాని భగవంతుడికి దూరంగా పోవడం లేదు. తాను ఎక్కడ కదిలినా ఆకాశంలోనే కదులుతూ ఉన్నాడు. ఆకాశానికి ఆధారమైనవాడు అచ్యుతుడు. తన ఇంటికి తాను దూరంగా ఉన్నా అచ్యుతుడు తన వెంటే ఉన్నాడు. ఉన్నది అచ్యుతుడే. కనుక తాను ఇంట్లో ఉన్నా ఆయనే పోషిస్తాడు. ఎక్కడకు వెళ్ళినా ఆయనే పోషిస్తాడు. ఇది సాధువ్ఞకు ఉండే అందమైన అవగాహన. ఇద్దరు సాధువ్ఞలు ఉండే వారు. మొదటి సాధువ్ఞ అందరి యోగక్షేమాలు వహించేది భగవంతుడే అనే దృఢమైన భక్తి కలవాడు. కనుక అతని దగ్గర డబ్బు ఉంచుకునేవాడు కాదు. రెండవ సాధువ్ఞ డబ్బు అవసరం ఎరిగినవాడు.
ఒకనాడు ఇద్దరూ గంగానదిని దాటవలసి వచ్చింది. మొదటి సాధువ్ఞ వద్ద డబ్బు ఉండదు కనుక రెండవ సాధువ్ఞ ఇద్దరికి పడవ టిక్కెట్లు తానే కొన్నాడు. ఆవలితీరం చేరిన తరువాత రెండవ సాధువ్ఞ మొదటి సాధువ్ఞకు డబ్బు అవసరాన్ని సహేతుకంగా వివరించి ఇప్పటికైనా తన భావాలను మార్చుకోమని సలహా ఇచ్చాడు. అందుకు మొదటి సాధువ్ఞ ఒప్పుకోలేదు. టిక్కెట్టు కొన్నది రెండవ సాధువే అయినా అందుకు కావలసిన మొత్తాన్ని అతని వద్ద ఉంచింది భగవంతుడే. భగవంతుడి ఆజ్ఞలేనిదే ఈ ప్రపంచంలో ఎవరు ఎవరికీ ఏ సహాయమూ చెయ్యలేరు అంటాడు. అదే పరమేశ్వరునిపై అతనికి ఉన్న దృఢభక్తి. రక్షస్యతీతి విశ్వాసః. భగవంతుడు నన్ను రక్షిస్తాడు అనే విశ్వాసమే భక్తికి పునాది. ఈ భావన ఒక గృహస్థుడికి వస్తే అతను కూడా సాధువే. ఒకసారి గంగానదిలో ఒక గృహస్థుడు స్నానం చేస్తున్నాడు.
తాను వేసుకున్న ఖరీదైన సూటును గట్టు మీద ఉంచాడు. దారినపోయే ఒక వ్యక్తి అంత ఖరీదైన సూటు గట్టుమీద ఉంది, దరిదాపుల్లో ఎవరూ లేరే అని చుట్టూ చూడగా దూరంగా నదిలో స్నానం చేస్తున్న గృహస్థుడు కనిపించాడు. తాను కూడా వెళ్ళిపోతే దానినెవరైనా తీసుకొనిపోతారేమో అని ఆ గృహస్థుడు స్నానం ముగించి గట్టుమీదకు వచ్చే వరకు ఓపికగా వేచి ఉండి, ‘ఏమండీ! మీ వస్తువ్ఞను మీరు జాగ్రత్త చేసుకోవాలి కదా! మీరు స్నానం చేస్తున్న సమయంలో మీ బట్టలను ఎవరైనా కాజేస్తే ఏం చేస్తారు? నేనుండబట్టి సరిపోయింది. ఎవ్వరూ కాజెయ్యకుండా మీరు వచ్చేంతవరకు కాపలా ఉన్నాను అన్నాడు. అందుకు గృహస్థుడు, ‘నాకు తెలుసు మీరు ఉంటారని. ఎప్పుడైతే భగవంతుడే నాకు రక్ష అని నేను విశ్వసించానో, ఆయన ఏవిధంగానైనా రక్షిస్తాడు అని నాకు తెలుసు.
ఆయన మీ ద్వారా నన్ను రక్షిస్తాడు అన్నాడు. గృహస్థుడికైనా, సన్యాసికైనా ఉండవలసింది ఈ భావనే. కాబట్టి ప్రారబ్దవశాత్తు ఉండేదంతా ప్రసాదంగా భావించి తృప్తి చెందాలి (విధివశాత్ ప్రాప్తేన సంతుష్యతాం).