Wednesday, March 30, 2022

ఆత్మానందమే ధ్యానయోగం

ఆత్మానందమే ధ్యానయోగం

‘ఉన్నది నీవే అని తెలుసుకోవడం జ్ఞానం. నీవు నీవుగా ఉండేందుకు చేసే ప్రయత్నం ధ్యానం. మనసుతో మనం కలిసి నడిస్తే అది వ్యవహారం. మనతో మనసు కలిసి ఉండటం ధ్యానం. మనం నడిచినా, కూర్చున్నా, కర్మ లాచరించినా, ఆచరించకపోయినా మనసు మనతో కలిసి ఉండటం, ఏ వ్యాపారాలు లేకుండా మనసు ఉండటమే ధ్యానంలో ప్రధానమైన విషయం. అందుకే ధ్యానం నిర్విషయం మనః అన్నారు. అయితే, మనసులో ఏ వృత్తులూ కదలకుండా ఉండటం సాధ్యమా? ధ్యానం మానసవ్యాపారమే కనుక ధ్యానం కూడా కర్మే. కర్మలో స్వేచ్ఛ ఉన్నట్లే, ధ్యానంలోనూ మనసుకు స్వేచ్ఛ ఉంది. ఆలోచించే స్వేచ్ఛ, ఆలోచనలను ఆపి ధ్యానం చేసే స్వేచ్ఛ మనసుకు ఉన్నాయి.

ఇంతకీ ధ్యానం చేసే ‘నేను ఎవరు? సత్యాత్మా? లేక మిథ్యాత్మా? సత్యాత్మా లేక స్వరూపానికి ధ్యానం అవసరం లేదు కనుక థ్యాత మిథ్యాత్మ అనేది సత్యం. కర్తగా ఉండి చేసేది సగుణధ్యానం (సగుణబ్రహ్మ విషయ మానస వ్యాపారః). కర్త మీదనే చేసే ధ్యానం నిర్గుణధ్యానం. దీనిని నిర్గుణధ్యానంగా వాడుకలో పిలుచుకున్నా వేదాంత పరిభాషలో దీనిని ‘నిధిధ్యాసనం అని అంటారు. ధ్యాత అధ్యాసలో ఉన్నవాడు. ఏ కర్మయినా అధ్యాసలోనే జరుగుతూ ఉంది. కనుక ధ్యానం కూడా అధ్యాసలోనే జరుగుతూ ఉంది ఎన్నో జన్మలు గడిచాయి. అన్ని జన్మలలోనూ ఎక్కువగా చెడు ఆలోచనలే నడిచాయి. వీటిమధ్య ఆచరించిన కర్మలు ఎన్నో! ఈ కర్మల ఫలితాలు ఎన్నో! ఇవి పర్వతాల రూపంలో పాపాలై పండి ఉన్నాయి. ప్రవాహరూపంలో దోషాలై ప్రవహిస్తూ ఉన్నాయి. ఇన్ని జన్మల్లో ఇన్ని విధాలుగా నలిగిపోయిన ఒక వ్యక్తి ఈరోజు ధ్యానానికై కూర్చున్నాడు. ఇది ధ్యాత పరిస్థితి. ధ్యాతకు అనేకమైన గాయాలు ఉన్నాయి. విపరీతమైన ఆలోచనలు ఉన్నాయి.

ఆంతర్యం భయాలతో, ద్వేషాలతో నిండి ఉంది. ధ్యాత నేపథ్యాన్ని వదలి మనం ముందుకు పోలేము. ఇదంతా అతని దురదృష్టం. కానీ ఇంత దురదృష్టం లోనూ ఒక అదృష్టం ఉంది. అదే నేను ధ్యానం చేయాలి అనే సంకల్పం. మహాత్ముల ద్వారా విన్న ఆప్తవాక్యాల వల్లనో, లేక ఏ కొద్దిపాటి పుణ్యం మిగిలి ఉండటం వల్లనో ధ్యానం చేయాలి అనే సత్సంకల్పం అతనికి ఈరోజు కలిగింది. ఏ మనసైతే చేయగూడని ఆలోచనలు చేస్తూ, లేనివాటిని చూపిస్తూ వచ్చిందో, ఏ మనసైతే చేయవలసిన ఆలోచనలు చేయకుండా ముందుకుపోయే మార్గాన్ని వెనుకకు మళ్లిస్తూ వచ్చిందో, ఆ మనసే నేడు ధ్యానం చెయ్యాలి. అన్నిచోట్లా ఆటంకాలను కలిగించిన మనసు, అవరోధాలను సృష్టించిన మనసు, విఘ్నాలను కల్పించిన మనసు, బ్రతుకును చిందరవందరగా తయారుచేసిన మనసే ఈ ధ్యానంలోనూ ఉంది కనుక చిన్నపిల్లవాడిని ఏవిధంగా లాలించి, పాలిస్తామో ఆ విధంగానే మనసులో గూడుకట్టుకుని ఉన్న భయాలను, సంశయాలను తొలగించి మనసుకు ధైర్యాన్ని, ఉత్సాహాన్ని కల్పించాలి.

మనసున్నందుకు ఆలోచనలు వస్తాయి. మనసులో వృత్తులు ఉంటాయి కనుకనే ధ్యానం చేస్తున్నాం. ఇదం వృత్తులు విపరీతంగా వస్తూ ఉంటే వాటి నుండి విడిపడి అహం వృత్తిని చూడటం, ఇదం వృత్తులు అదృశ్యమై అహం వృత్తి మాత్రమే మిగిలినపుడు అహం వృత్తిని అహం స్వరూపంగా భావించడమే నిర్గుణ ధ్యానంలోని కేంద్రవిషయం. ఏ అల కూడా సముద్రం కన్నా దూరంగా లేదు. ఏవృత్తి కూడా చైతన్యం కన్నా వేరుగా లేదు. అలసముద్రాన్ని పరిమితం చేయలేదు. మార్పుచేయలేదు. అదేవిధంగా మనమీద ఆధారపడి ఉన్న వృత్తి మన స్వరూపాన్ని పరిమితం చేయడం గాని, మార్పు చేయడం గాని చేయలేదు. ఇక దేనికి అలజడి? అవి వస్తే రానీ. నీవు వాటి వెంట పోకు. సాక్షిగా ఉండు. లేచిన అలలు పడుతూ ఉంటాయి. వచ్చిన సంకల్పాలు పోతూ ఉంటాయి. అవి వచ్చినపుడు నీవ్ఞ ఉన్నావ్ఞ. అవి పోయినా నీవు ఉంటావు. నీవు సాక్షివి. నిన్ను ఏవీ స్పృశించలేవు. ధ్యానంలో నీవ్ఞ చేరాలి అనుకున్నది మనస్సు లేనిచోటికి. ఇప్పుడు నీవ్ఞ ఉన్నది ప్రశాంతమైన మనస్సు ఉన్నచోట. ఈ తేడాను జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. చేసుకోగలిగితే ధారణ సిద్ధించి నట్లే. ధారణ సిద్ధిస్తే ధ్యానం సునాయాసంగా సాగుతుంది. వృత్తి ఉంది. చైతన్యం. వృత్తి లేదు, చైతన్యం ఉంది. గాఢనిద్రలో ఈ వృత్తి రహితస్థితి మన అందరి అనుభవంలోనూ ఉంది. అలలు సముద్రా నికి అలంకారం.

అలలు లేని నిస్తరంగ జలధి కూడా ఒక అందం. మనసులో వృత్తులు ఉంటే ఉండనీ. వాటి ప్రభావం మనమీద లేకపోతే చాలు. ఆటంకాలు రావడం, వాటిని తొలగించే ప్రయత్నం చేయడం ధ్యానంలో ముఖ్యవిషయం కాదు. ఆత్మ ఎప్పుడూ అసంగమే అనేభావనలో ఉండటమే ధ్యానం. ఆత్మ ఏ వృత్తి నుండి కూడా విడిపడి ఉంటే అవకాశం లేదు. కలిసి ఉంటే నష్టం లేదు. వచ్చిపోయే వృత్తుల్ని నేను చూస్తున్నాను. ‘నేను అనే మహాసాగరంలో, చైతన్య సాగరంలో, వృత్తులు అనే అలలు అలా అలా కదలిపోతూ ఉన్నాయి. వాటివల్ల భయముగాని, రాగముగాని, ద్వేషముగాని కలగకుండా నిస్సంగుడిగా ఎవడైతే ఉండగలడో అతడే ధ్యానయోగి. ఏదో ఏదో ఊహించుకొనేవాడు ధ్యానయోగి కాలేడు. ఏ పరిస్థితులలోనూ దుఃఖం దరిచేరనివాడే నిర్గుణ ధ్యానయోగి. ఆత్మన్యే వాత్మనా తుష్టః. ఆత్మ యందు ఆత్మచేత సంతృప్తిని పొందువాడు ధ్యానయోగి. అతని ఆనందాన్ని భగ్నం చేయగల శక్తి ఈ ప్రపంచంలో దేనికీ లేదు. ఇదే నిర్గుణ ధ్యానయోగి అభయస్థితి, అఖండానందస్థితి.

– స్వామి సుందర చైతన్యానంద

No comments:

Post a Comment

  బాహ్యంలో నా నేను ఊరేగుతూ... అంతరంలో నా నేను కు దూరమై... ఎటూ చేరలేని అవస్థలు, తీరని బాధలు... నన్ను ఓ దరికి చేర్చవా పరమేశ్వరా.. మహాదేవా శంభో...