Tuesday, April 26, 2022

శివోహం

మనసు విరిగితేనే అహము పోయేది...
అహము పోతేనే అజ్ఞానం పోయేది...
అజ్ఞానం పోతేనే ఆత్మజ్ఞానం వెలిగేది...
ఆత్మజ్ఞానం వెలిగితేనే భ్రాంతి పోయేది...
భ్రాంతి పోతేనే బ్రహ్మము దరిచేరేది...
బ్రహ్మము దరిచేరితేనే బట్ట బయలయ్యేది...
బట్ట బయలైతేనే కదా బయటపడేది.

ఓం శివోహం... సర్వం శివమయం.

శివోహం

మాయ వదలదు...
ఎరుక వీడదు...
ఆశ ఆగదు...
వాసన పోదు...
వైరాగ్యం నిలవదు..
చింత చెదరదు...
నీ పై ధ్యానం కుదరదు.

మహాదేవా శంభో శరణు.

Monday, April 25, 2022

శివోహం

కష్టాలు ఎదురౌతున్నాయని కుమిలిపోకు. జన్మజన్మల దుష్కర్మల వలన వచ్చిన ఈ కష్టాలు మన పాపాల ప్రారబ్ధం నుండి విముక్తిని చేస్తున్నాయి. అలానే సుఖాలు దరి చేరాయని పొంగిపోకు. జన్మజన్మల సత్కర్మల పుణ్యం తరిగిపోతుందని గ్రహించు.  పుణ్యంను హరించే సుఖం కన్నా పాపాలను హరించే దుఃఖమే శ్రేయోదాయకమంటారు 

*శ్రీ  సుందర చైతన్యానందులవారు*

శివోహం

చిన్న పిల్లవాడు బొమ్మలతో ఆటలాడుకుంటు బొమ్మలే తన ప్రపంచంగా బ్రతుకుతాడు...

బొమ్మని ఎవరైనా లాక్కుంటే ఏడుస్తాడు ఎందుకంటే బొమ్మల ద్వారా పొందే ఆనందం విషయానందం...

పెద్దయ్యాక బొమ్మల మీద ఆసక్తి ఆకర్షణ ఉండదు ఎందుకంటే బుద్ధి వస్తుంది కాబట్టి బొమ్మలు శాశ్వతం కాదని తెలుస్తుంది...

మాయ బొమ్మవంటి ఆట ఇది...
నాటకమిది
నాల్గు ఘడియల వెలుగిది...

ఓం శివోహం... సర్వం శివమయం.

Sunday, April 24, 2022

శివోహం

సంపద లెరుగను సొంపైన 
నీ నామంబుతప్ప....

ధనమును కాంచను ఘనమైన 
నీ రూపంబు తప్ప....

భవనములు ఎరుగను భవ్యమైన 
నీ చరణారవిందములు తప్ప....

కనకపురాసులు ఎరుగను కోమలమైన 
నీ కృపా కటాక్ష వీక్షణములు తప్ప....

మహాదేవా శంభో శరణు.....

శివోహం

శివా!నీ నామం నేను ఒకసారి పలుకుతుంటే
నా గుండెలో పలుమార్లు ప్రతిధ్వనిస్తోంది
రాయి అనుకున్న నా గుండె పలుకురాయైనేమో
మహేశా . . . . . శరణు .

Saturday, April 23, 2022

శివోహం

మనసనేది ఎప్పుడు అంతమౌతుందో...ఆధ్యాత్మికత అప్పుడు ఆరంభం ఆవుతుంది. మన జీవిత ప్రయాణంతోబాటు ఆధ్యాత్మిక జ్ఞానం కొనసాగాలి. అంతేగానీ వృద్దాప్యంలో
నేర్చుకునేది కాదు. భక్తిలో ఉంటూనే
ధ్యానయోగం నిరంతరం కొనసాగిస్తూ ఉండాలి. అందుకు మన లక్ష్యం పెద్దదిగా
వుండాలి. భౌతిక ప్రపంచంలో ఉంటూనే
ఆధ్యాత్మిక జీవనాన్ని కొనసాగించవచ్చు. 
శివోహం

మానవుని దేహానికి శివం అని పేరు.
శివం అనగా మంగళకరం అని మరో అర్థం. సదాలోచనలు, సచ్చింతనలతో దేహాన్ని శివంగా మార్చుకోవాలే తప్ప దుర్భావాలు,దుశ్చింతనలతో దానిని శవంగా మార్చుకోకూడదు.
దేహనికి సార్థకతను చేకూర్చే కర్మలనే చేయాలి. అపుడే భగవంతుని అనుగ్రహం పుస్కలంగా పొందవీలవుతుంది.

ఓం శివోహం...సర్వం శివమయం.

  బాహ్యంలో నా నేను ఊరేగుతూ... అంతరంలో నా నేను కు దూరమై... ఎటూ చేరలేని అవస్థలు, తీరని బాధలు... నన్ను ఓ దరికి చేర్చవా పరమేశ్వరా.. మహాదేవా శంభో...