Wednesday, April 19, 2023

శివోహం

ఈ చరాచర సృష్టిని లయం చేసేవాడు శివుడు. ఆ మహాదేవుడు కరుణాంతరంగుడు. కోరిన వారికి లేదనకుండా వరాలిచ్చేవాడు. అందుకే భోళా శంకరుడిగా ప్రసిద్ధుడు. శివదర్శనం ముక్తిదాయకం. శివనామం కళ్యాణ కారకం. ‘శం’అంటే మేలు అని అర్థం. ‘కర’అంటే కూర్చువాడని అర్థం. ఎల్లరకూ మేలుచేయువాడు కాబట్టి ‘శంకరుడయ్యాడు’. ఆ స్వామి సర్వాంతర్యామి. భక్తితో ఆర్తిగా పిలిస్తే వచ్చి ఆదుకుంటాడు. అభీష్టాలన్నీ నెరవేర్చి అక్కున చేర్చుకుంటాడు. శివుడు అభిషేక ప్రియుడు.
భక్తితో రెండు చుక్కలు నీటిని విదిలిస్తే, అమితంగా సంతోషపడిపోతాడు. ఆ కారణంగానే ‘అభిషేక ప్రియ శివః’ అంటారు. శివుని శిరస్సుపై కాసిని నీళ్లు చల్లి, కొంత పత్రిని వేసినంత మాత్రాన కామధేనువు వారి ఇళ్ళల్లో గాటకట్టిన పశువవుతుందని, దేవతా వృక్షమైన కల్పతరువు వారి ఇళ్ళల్లోని పెరటిలో మల్లె చెట్టు అవుతుందని పురాణోక్తి.
ఆ దేవాది దేవునికి వివిధ ద్రవ్యాలతో చేసే అభిషేకం వివిధ ఫలితాలనిస్తుందని శాస్త్ర వచనం. లయకారుడైన పరమేశ్వరుడ్ని ఆవు పాలతో అభిషేకం చేస్తే, సర్వసౌఖ్యాలు సిద్ధిస్తాయంటారు. అలాగే ఆవు పెరుగుతో చేసే అభిషేకం కీర్తిని, ఆరోగ్యాన్ని, బలాన్నిస్తుంది. ఆవు నెయ్యితో అభిషేకంచేస్తే ఐశ్వర్యవృద్ధి జరుగుతుంది. తేనెతో చేసే అభిషేకం తేజస్సును వృద్ధి చేస్తుంది. పంచదారతో చేస్తే దుఃఖాలు నశిస్తాయి. ఈ పూజావిధులవల్ల ఇన్ని విశేషాలుండడంవల్లే ‘పంచామృతాభిషేకం’ విశిష్టమైన ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. ధనం వృద్ధి పొందాలనుకునేవారు
స్వామిని చెరకు రసంతో అభిషేకించాలట. అలాగే సర్వసంపదలు వృద్ధిపొందడానికి కొబ్బరి నీళ్ళతో అభిషేకించాలని శాస్త్రాలు చెబుతున్నాయి. భస్మజలంలో అంటే విభూతిని నీటిలో కలిపి అభిషేకం చేస్తే మహాపాపాలు సైతం పటాపంచలైపోతాయట. పుష్పాలతో చేసే అభిషేకార్చన భూ లాభాన్ని, బిల్వ జలాభిషేకం భోగభాగ్యాలనిస్తుందంటారు.
అలాగే అపమృత్యుభయంతో బాధపడేవారు శివుని నువ్వుల నూనెతో అభిషేకం చేయాలట. రోజూ ప్రాతఃకాలంలోనే నిద్ర లేచి, శుచి శుభ్రతలను పాటించి, పరిశుభ్రమైన నువ్వుల నూనెను శివలింగంపై పోసి, మృత్యుంజయ జపాన్ని చేస్తే, సంతుష్టాంగుడైన ఆ పరమశివుడు అపమృత్యువునుంచి కాపాడతాడని శివపురాణం ద్వారా అవగతమవుతోంది. వైరాగ్యంతో జ్ఞానసిద్ధిని పొందాలనుకునేవారు నేరేడు పండ్లతో శివుని అభిషేకించాలి. శివుడు ఆదియోగి... ఆ స్వామి కరుణాకటాక్ష వీక్షణాలకు, జ్ఞాన సముపార్జనకు పాత్రులు కావడానికి నేరేడుపండ్ల రసంతో అభిషేకం ఉపయుక్తమవుతుందంటారు. స్వామిని పసుపునీళ్ళతో అభిషేకిస్తే సకల శుభాలు కలుగుతాయట. పసుపు శుభ సూచకం.
అలాగే శివుడు కూడా శుభప్రదుడు కావడంవల్ల పసుపు నీళ్ళతో చేసే అభిషేకం ఆ దేవాదిదేవుని సంతుష్టాంగుడ్ని చేస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. చర్మ వ్యాధులు, రోగాలు కలవారు శివుని మామిడి పండ్లతో అభిషేకిస్తే చర్మవ్యాధులు మటుమాయమై, శరీరకాంతి ఇనుమడిస్తుంది. చర్మరుగ్మతలన్నీ పోయి, శాంతి సౌఖ్యాలు లభిస్తాయి. నవరత్న జలాభిషేకం ధన ధాన్య పశు పుత్ర లాభాన్ని, కస్తూరికా జలాభిషేకం చక్రవర్తిత్వాన్ని, ద్రాక్షపండ్లతో అభిషేకం కార్యక్రమ విజయాలను చేకూర్చి పెడుతుందట. అలాగే అన్నంతో అభిషేకం ఆయుష్షు పెరిగి, సుఖవంతమైన జీవనం సంప్రాప్తిస్తుంది.
సువర్ణోదకాభిషేకంవల్ల దారిద్య్రం పటాపంచలై, ఐశ్వర్య వృద్ధి కలుగుతుంది. రుద్రాక్షోదకంతో చేసే అభిషేకం ఐశ్వర్యాన్ని, గరిక నీటితో చేసే అభిషేకంవల్ల వస్తువాహన వృద్ధి కలుగుతుందని శాస్త్రాల ద్వారా అవగతమవుతోంది. అయితే ఆయా వస్తువులు, ఫలాలు, పుష్పాలు, రసాలతో చేసే అభిషేకం వల్లనే శివుడు సంతుష్టి చెందుతాడా? అనే ప్రశ్నకు సమాధానం ప్రశ్నలోనే దొరుకుతుంది. శివుడు మనోకారకుడు. ధర్మప్రబోదాత. ఎక్కడ ధర్మం నాలుగు పాదాల నడుస్తుందో అక్కడ కొలువై వుంటాడు. ఆత్మకారకుడైన ఆ స్వామిని, పాలంత స్వచ్ఛమైన మనస్సుతో అభిషేకిస్తూ, కోరినవన్నీ అనుగ్రహిస్తాడు. ఆత్మే అన్నింటికీ మూలం. ఆత్మతో చేసే పూజ సాక్షాత్తు ఆ పరమేశ్వరుణ్ణి చేరుతుందని పురాణ వచనం.
అందువల్ల మనోకారకుడైన ఆ మహాదేవుడ్ని నిశ్చల నిర్మలమైన మనస్సుతో అభిషేకించి పూజిస్తే సద్గతులు ప్రసాదిస్తాడు. జగద్గురువు ఆదిశంకరాచార్యుడు, భక్తకన్నప్ప, భక్త మార్కండేయుడు లాంటి ఎందరో భక్తులు శివుని నిర్మలమైన మనస్సుతో పూజించి, శివ కైవల్యాన్ని పొందినవారే. చివరికి శ్రీరాముడు సైతం శివుడ్ని భక్తితో పూజించి తరించాడు.
శివనామస్మరణం సర్వపాప హరణం... భక్తిముక్తిదాయకం... పవిత్రమైన మనస్సుతో శివనామస్మరణంతో చేసే పూజలన్నీ శివునికి చేరి ఆత్మబలం ఆత్మసిద్ధి కలుగుతుంది. ఆ మహాదేవుని కరుణకు పాత్రమవుతుంది.

శివోహం

ఈ ప్రపంచాన్ని పాలించేవారు ఒకరు వున్నారు.
ఆయనే భగవంతుడు.
పాలించడమే కాదు, భరిస్తున్నది కూడా ఆయనే.
మనం భరిస్తున్నామనుకోవడం వెర్రితనం.
పరమేశ్వరుడే సకల భారాలను భరిస్తున్నాడు.
కానీ, నీవు 'నేను భరిస్తున్నాను' అని అనుకుంటున్నావు.
నీ బాధ్యతలు, భారాలూ భగవంతునిపై వుంచి
నీవు నిశ్చింతగా వుండు...

ఓం శివోహం... సర్వం శివమయం

శివోహం

దేవా నీవు కల్పించిన ధర్మాలివి   
కార్మా కర్త క్రియా చెయు ధర్మాలివి     

శాంతి కలవానికి పాపము రాదు   
విరక్తి కలవానికి భయం లేదు
గురుసేవ చేసేప్పుడు కోపం రాదు 
సత్య బోధకులకు దోషం ఉండదు...

పుట్టు బ్రహ్మచారికి బుద్ధి చెడదు 
ఆశ లేని వానికి అలుపు రాదు  
జ్ఞాన మున్నవానికి దుఃఖము లేదు 
మౌనం పాటిస్తె ఏది కలహం కాదు...

సమదృష్టికి చలించటం ఉండదు
నిర్మల మనస్సుకు లోపం తెల్వదు   
వేంకటేశా అనిన మాయ ఉండదు 
జీవితంలో సుఖమే భారం తెల్వదు...

ఓం శివోహం...సర్వం శివమయం.

Tuesday, April 18, 2023

శివోహం

శివా!ఈ ఉపవాస వాసము ఎన్నాళ్ళు
నిజ వాసమును చేర నాకు ఇంక ఎన్నాళ్ళు
బదులు చెప్పగ నీవుకాక ఇంకెవరు .
మహేశా . . . . . శరణు .

Monday, April 17, 2023

శివోహం

శివా!నీ నామమె మననము
అదే తారక మంత్రము
చేయునిమ్ము భవ బంధ నాశము
మహేశా . . . . . శరణు .

Sunday, April 16, 2023

శివోహం

శివా!ఫలాపేక్షలు నాలో పటాపంచలవనీ
ఆపేక్షలు నాలో అంతమవనీ
నిటలాక్షా నేను నీలో లయమైపోనీ
మహేశా . . . . . శరణు .

Saturday, April 15, 2023

శివోహం

హనుమంతుడు మహా బలశాలి
మనసును మించి పయనించు ధీశాలి

జ్ఞానములోన జగతిని మిన్న
సంగీతమున సర్వులకు మిన్న
వాక్కులలోన వాగ్ధేవి సుతుడు
చేష్టలందున చెలిమికి హితుడు

కార్యశూరుడు కర్మ వీరుడు
కామ్యములన్నవి ఎరుగని వాడు
నిర్మల చిత్తుడు నిష్టా గరిష్టుడు
నింగిని నేలకు తేగల ధీరుడు

బ్రహ్మ వరమును పొందినవాడు
బ్రహ్మచర్యమున ఘనుడితడు
అందరి మన్నలందిన వాడు
ఆత్మ విశ్వాసమున అధికుడు ఇతడు

స్థిర చిత్తముతో మసలెడి వాడు
చిరంజీవిగా స్థిరమయినాడు
పూజలు చేసిన పూజ్యనీయుడు
రాగల యుగమున కాగల బ్రహ్మ

  బాహ్యంలో నా నేను ఊరేగుతూ... అంతరంలో నా నేను కు దూరమై... ఎటూ చేరలేని అవస్థలు, తీరని బాధలు... నన్ను ఓ దరికి చేర్చవా పరమేశ్వరా.. మహాదేవా శంభో...