Thursday, September 24, 2020

శివోహం

భగవంతుడి నామస్మరణే భక్తులను రక్షిస్తుంది

భగవంతుడు అనే మాటే పలకడానికీ ... వినడానికి ఎంతో బాగుంటుంది. కష్టాల్లోను ... నష్టాల్లోను భగవంతుడా ఏమిటీ ఈ పరీక్ష! అని ఆయనని తలచుకోవడం జరుగుతూ వుంటుంది. భగవంతుడా అని ఆయనని అనుకోవడంతోనే మనసు తేలికపడుతుంది. అలాంటి భగవంతుడు అనేక నామాలతో పిలవబడుతుంటాడు ... కోట్లాది భక్తులతో కొలవబడుతుంటాడు.

అనంతమైన ఈ విశ్వమంతా వ్యాపించి వున్న భగవంతుడికి రూపాన్ని ఏర్పాటు చేసుకుని, ఆయనకిగల శక్తులనుబట్టి వివిధ నామాలతో పూజిస్తూ వుంటారు. అందువల్లనే భగవంతుడి ప్రతినామం శక్తిమంతమైనదే ... మహిమగలదేనని అంటారు. అలాంటి నామాలలో ఎవరికి ఇష్టమైన నామాన్ని వాళ్లు పదేపదే స్మరించుకుంటూ వుంటారు. ఈశ్వర ... పరమేశ్వర .. ఉమామహేశ్వర అనీ, కేశవా .. నారాయణ .. మాధవ .. వాసుదేవా అని తలచుకుంటూ వుంటారు.

ఎవరికి ఇష్టమైన నామాన్ని వాళ్లు సదా స్మరిస్తూ వుండటం వలన, ఏదైనా ఆపద ఎదురైనప్పుడు అసహజంగానే ఆ నామం నోటివెంట వస్తుంది. భగవంతుడిని కదిలించడానికీ ... ఆయన కదిలిరావడానికి ఆ మాత్రం అవకాశం చాలు. కష్టాల్లో పడినప్పుడు ... ఆపదలో చిక్కుకున్నప్పుడు ఏ నామమైతే బయటికి వస్తుందో అది తప్పకుండా ఆ గండం నుంచి బయటపడేస్తుంది. ఒక రక్షణ కవచమై నిలిచి కాపాడుతుంది. 

భగవంతుడి ప్రతినామం భక్తుడిని రక్షించే శక్తిని కలిగివుంటుంది. ఇందుకు ఎన్నో ఉదాహరణలు వినిపిస్తుంటాయి ... కనిపిస్తుంటాయి. భగవంతుడి నామస్మరణ ఆయనపైగల అపార విశ్వాసాన్ని ఆవిష్కరిస్తుంది. అనంతమైన ఆయన అనుగ్రహాన్ని అందిస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

No comments:

Post a Comment

  బాహ్యంలో నా నేను ఊరేగుతూ... అంతరంలో నా నేను కు దూరమై... ఎటూ చేరలేని అవస్థలు, తీరని బాధలు... నన్ను ఓ దరికి చేర్చవా పరమేశ్వరా.. మహాదేవా శంభో...