Tuesday, March 30, 2021

శివోహం

సనాతన ధర్మమే సమున్నతం!

భారతీయ సనాతన ధర్మం భగవంతుణ్ణి సర్వరూపాలలో దర్శిస్తున్నది. మానవునికి అన్ని జీవులపట్లా భక్తిశ్రద్ధలను బోధిస్తూ ఈ భూమండలంపై తన పాత్రను, బాధ్యతను ఉపదేశిస్తున్నది. దీనిని అర్థం చేసుకున్నవారు సకల జీవావళికి ఉపయోగపడే ధార్మికులుగా జీవిస్తూ, తమ జీవితాలే మనకు సందేశాలుగా మలచి మన స్మృతిపథాలలో మిగిలిపోయారు. అర్థం చేసుకోలేనివారు ఇంకెందరో వున్నారు. సనాతన ధర్మం మత్స్యాన్ని, కూర్మాన్ని, వరాహాన్ని, నరసింహున్ని దశావతారాల్లో చేర్చింది. అలాగే, శునకాన్ని భైరవుడిగా పేర్కొన్నది. సర్పాన్ని నాగదేవుడని కొలుస్తూ పండుగలను కూడా జరుపుకొంటున్నాం. సనాతన ధర్మంలో చీమలు మొదలుకొని ఏనుగుల వరకు అన్ని జీవాలకూ అత్యంత ప్రాధాన్యమిచ్చి భక్తిప్రపత్తులను చూపమని బోధిస్తుంది. అలాగే, వృక్షజాతులలో అనేక వృక్షాలను, మొక్కలను భక్తి ప్రపంచంలో భాగం చేసింది. చివరకు నిర్జీవాలైన రాళ్ళూరప్పలూ దైవానికి ప్రతీకలే. వేదాలలో తొలిమంత్రమే ‘అగ్ని’దేవుని ప్రార్థనా శ్లోకం. ఈ క్రమంలోనే వరుణున్ని, వాయువును, అష్టదిక్పాలకులనూ పూజిస్తున్నాం.

సర్వాంతర్యామిని సనాతన ధర్మం సాహిత్యరూపాలలో అనేక విధాలుగా వివరించింది. భగవంతుణ్ణి అంతటా, అన్నిటా చూడటమే అనుష్ఠానం. అదే సమున్నత ధర్మం! నిజానికి హేతువాదంపైనే ఉపనిషత్తుల జ్ఞానం ఆధారపడి ఉంది. సృష్టి రహస్యాన్ని ఛేదించిన జ్ఞానమే ఉపనిషత్తుల సారం. ఈ విశ్వమంతా ఒకటే వ్యవస్థ అన్న దానిని ఆధారాలతో సహా ఉపనిషత్తులు నిరూపించాయి. వేల ఏండ్ల కిందటే ఋషులు ‘పూర్ణమదః పూర్ణమిదం’ అని, ‘విశ్వాన్ని ఒక సంపూర్ణ వ్యవస్థ’గా ప్రకటించారు. ఆధునిక శాస్త్రవేత్తలుకూడా ఈ విశ్వాన్ని ఒక బ్రహ్మాండ వ్యవస్థగానే గుర్తించారు. విశ్వం పట్ల సర్వదా కృతజ్ఞతలు ప్రదర్శించడం సనాతన ధర్మంలోని అసలైన మౌలికత. ఈ కృతజ్ఞతాభావం నుండే ప్రతి జీవిని, నిర్జీవిని ప్రార్థించడం ప్రారంభమైంది. సర్వాంతర్యామిని సర్వేసర్వత్రా చూడటమే సనాతన ధార్మికతలోని ఉత్కృష్టమైన ఆధ్యాత్మికత. ఈ సువిశాల దృష్టిలోనే అత్యున్నత జ్ఞానం ఇమిడి ఉంది. దానినే ఆధునిక పాశ్చాత్య తత్తవేత్తలు ‘పాంథీయిజం’ అన్నారు. ప్రసిద్ధ భౌతిక శాస్త్రవేత్త ఐన్‌స్టీన్‌ నమ్మిన తత్త్వమూ ఇదే.

‘యస్తు సర్వాణి భూతాని ఆత్మన్యేవానుపష్యతి’, ‘యస్మిన్‌ సర్వాణి భూతాని ఆత్మైవా’ అంటూ, ఆత్మజ్ఞాని అన్ని భూతాలలో భగవంతుణ్ణి సందర్శిస్తాడని ‘ఈశావాస్యం’ చెప్పింది. ‘ముండకోపనిషత్తు’కూడా ‘బ్రహ్మ వేదం విశ్వమిదం వరిష్ఠం’, ‘విశ్వమే బ్రహ్మం’ అన్నది. ఉపనిషత్తులను అర్థం చేసుకోవడం అంత సులభం కాదు కాబట్టి, వ్యాసుడు ‘భగవద్గీత’లో శ్రీకృష్ణునిచే అనేక రీతుల్లో వివరింపజేశాడు. ఆత్మజ్ఞాని అయిన శ్రీకృష్ణుడు ‘అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయ స్థిత’ అన్ని భూతాలలో స్థిరమై ఉన్నవాడినని చెబుతూ, తానే వృక్షాలలో రావిచెట్టునని, గుర్రాలలో ఉచ్చైశ్రవాన్నని, ఏనుగులలో ఐరావతాన్నని, ఆవులలో కామధేనువునని, సర్పాలలో వాసుకినని, నాగులలో అనంతుడనని, ఆయుధాలలో వజ్రాన్ని అని, పరిశుద్ధ పరిచేవాటిలో గాలిని అని, చేపలలో మొసలిని అని, నదులలో జాహ్నవిని అని, పనిముట్లలో తానే దండాన్ని అని పలు విధాలుగా ఆత్మతత్త్వాన్ని విశదీకరించాడు.

ఈ విధంగా పేర్కొనడంలో ఆత్మజ్ఞాని అయిన శ్రీకృష్ణుని వేరుగా చూపడమే వ్యాసుని లక్ష్యం. ఈ మౌలికత సనాతన ధర్మంలో సమ్మిళితమైనందుకే అన్ని జీవులపట్లా ఒకే భావన కనపడుతుంది. అందువల్లే ప్రతి జీవి, వృక్షం, రాయి పట్లా ఆరాధనా భావం వెల్లివిరుస్తున్నది. ప్రతి భారతీయుడు ప్రతిచోటా భగవంతుని చూడగలుగుతున్నాడు. అది తులసిమొక్కే కావచ్చు, రావిచెట్టే కావచ్చు, నాగుపామే కావచ్చు, చివరకు రాయిరప్పా ఏదైనా కావచ్చు. ఇంతటి విశాల, విస్తృత దృక్పథం కాబట్టే, మన సనాతనత్వం ఒక మతంగా కాకుండా ధర్మమై విరాజిల్లుతున్నది.

-రావుల నిరంజనాచారి

No comments:

Post a Comment

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u శివా! మళ్ళీ జన్మలు ఉన్నా కానీ… మనిషిగ పుట్టే యోగ్యత కలదో లేదో… మళ్లీ నీ సన్నిధి ముంగి...