హస్తినాపురంలో కౌరవులు, పాండవులు కొలువుదీరి ఉన్నారు. అదే సమయంలో ఒక మహర్షి కొలువుకు వచ్చాడు. అందరూ సాదరంగా ఆహ్వానించారు. అక్కడివారికి తనకు తెలిసిన నాలుగు మంచి మాటలు చెప్పసాగాడు మహర్షి. ఏది మంచో, ఏది చెడో, ఎవరు మంచివాళ్లో, ఎలాంటి వాళ్లు చెడ్డవాళ్లో వివరించాడు. ఆయన మాటలతో ఏకీభవించలేనట్టు ముఖం పెట్టాడు దుర్యోధనుడు. అప్పుడు మహర్షి ధర్మరాజుతో ‘నాయనా! నువ్వు ఈ నగరమంతా పర్యటించి ఒక చెడ్డవాణ్ని పట్టుకుని.. ఈ సభకు తీసుకురా!’ అన్నాడు.
దుర్యోధనుడితో ‘నువ్వు నగరంలో పర్యటించి ఒక మంచివాణ్నయినా తీసుకురా!’ అని చెప్పాడు. ఇద్దరూ సభ నుంచి బయల్దేరారు. సాయంత్రానికి ఇద్దరూ తిరిగి సభా సదనానికి చేరుకున్నారు. ‘ఇద్దరూ ఒంటరిగా వచ్చారేం?’ అని ప్రశ్నించాడు మహర్షి. అప్పుడు ధర్మరాజు ‘మహర్షీ! ఈ నగరంలో నాకు ఒక్క చెడ్డవాడూ కనిపించలేదు. అందరూ మంచివాళ్లే’ అన్నాడు. ‘నాకైతే ఒక్క మంచివాడూ తారసపడలేదు. అందరూ దుష్టులే!’ అన్నాడు దుర్యోధనుడు. మహర్షి చిన్నగా నవ్వి ‘మీ దృష్టిని బట్టి లోకం ఉంటుంది. ధర్మరాజు లోకమంతా మంచిదే అని భావించాడు. అందరిలో మంచినే చూశాడు. అందుకే
అతనికి చెడ్డవాడు కనిపించలేదు’ అన్నాడు. ఇంకా చెబుతూ ‘దుర్యోధనా! నీ దృష్టిలో ఈ లోకమంతా చెడ్డదే! అందుకే ఎంత వెతికినా నీకు మంచివాడు కనిపించలేదు’ అన్నాడు. మనం నల్లని కండ్లద్దాలు పెట్టుకుంటే మన పరిసరాలు నల్లగానే కనిపిస్తాయి. తెల్లని సులోచనాలు ధరిస్తే.. లోకమంతా తెల్లగా కనిపిస్తుంది. మన దృష్టిని బట్టి ఈ లోకం ఉంటుంది. ప్రతీ వ్యక్తిలో మంచి-చెడు రెండూ ఉంటాయి. మనలోని చెడును జయించి మంచిగా మారడమే మనిషి కర్తవ్యం. అదే సమయంలో ఎదుటి వ్యక్తిలోని మంచిని గుర్తించడం సమదృష్టికి సోపానం.
… శ్రీ
No comments:
Post a Comment