Thursday, October 17, 2024

 శివా!నీ స్మరణలో అనుక్షణం

నీ స్పురణకై నిరీక్షణం
కురియనిమ్ము నీ కటాక్ష వీక్షణం
మహేశా ..... శరణు .

శివా!గతమేమొ తెలియ గతి నెరుగలేను
భవిష్యత్ ఏమవునో ఊహించలేను
వర్తమానమున మెటులో వివరించుమా
మహేశా . . . . . శరణు .

శివా!నీ స్మరణలో అనుక్షణం
నీ స్పురణకై నిరీక్షణం
ప్రసరించు నీ వీక్షణం
మహేశా ..... శరణు .

శివా!నా గుండె బండరాయి అనుకున్నా
నీ నామం పలుకుతుంటె తెలిసింది
అది బండరాయి కాదు పలుకురాయని .
మహేశా . . . . . శరణు.

శివా!నా కృతుములన్నీ కలచి వేస్తున్నాయి
గతమునంతా నాకు గుర్తు చేస్తున్నాయి
నమ్మి కొలిచితి నిన్ను హితము చేయి
మహేశా .....శరణు..

శివా!కీలుకో వాత రోగానికో మందు
ఇలా ఎన్నెన్నో మరెన్నో మారుతువున్నా
సర్వ దుఃఖ హరణము నీ నామ స్మరణమే
మహేశా . . . . . శరణు .

శివా!శూలాన్ని దరియించి చక్రాన్ని తిప్పేవు
నాదాన్ని పూరించ శంకాన్ని కూడేవు
వాదాలు తొలగంగ వేదాన తెలిసేవు
మహేశా . . . . . శరణు .

శివా!ఏమి అనుకుంటున్నావో
అది నాకు వినిపించు
అది నాతో అనిపించు
మహేశా . . . . . శరణు .

శివా!చిత్తంలో చిరు జ్యోతివై
బాహ్యంలో బ్రహ్మాండ తేజానివై
అంతటా అన్నిటా అమరివున్నావు
మహేశా ..... శరణు.

శివా!ఏకోన్మఖముగ ఎదగాలి
ఏకాక్షితొ నిన్ను చూడాలి
అందుకు నీ కరుణందాలి
మహేశా . . . . . శరణు .

తెలియాలి తెలియాలి
నీవెవరో నీకు తెలియాలి
తెలియగ చేయాలి సాధన
తెలిసిన తీరిపోవు వేదన
భ్రమలన్నీ తీరగ
భగవానులు తెలిపిన
పంచాక్షరి మంత్రం
ఇది సత్యం యిదె తత్వం
బాహ్యమైన నీ చూపు
బంధాలను కూర్చేను
చేతనైతె లోచూపు
బుద్దునిగా మార్చేను
అనేకమైన బంధాలు
ఆశ పెంచుతున్నాయి
నిత్యమైన బంధాన్ని
దూరం చేస్తున్నాయి
మార్గమెరిగి పయనించు
తీరమెరిగి దర్శించు
దరి జేరదు ఏ జన్మ
కడతేరగ ఈ జన్మ

శివా!భక్తికే గాని బహుమతులకు అందవు
అనుభూతికే గాని అక్షులకు అందవు
ఆద్యంతములయిన నీకు ఆద్యంతములు లేవు
మహేశా . . . . . శరణు .

శివా!భ్రాంతిలో బ్రతికేను శాంతికై వెదికేను
వెలుగైన నీవు నా వెంటరావయ్యా
గతి నెరిగి గమ్యాన్ని చేరువరకు
మహేశా ..... శరణు.

శివా!నీ పదమునె నా పదములు వడివడిగా వేస్తున్నా
ఎదయెదలో నీవంటే ఎద తెలియగ చూస్తున్నా
తిరగలేదు నా చూపు తెలియలేదు లోచూపు.
మహేశా . . . . . శ‌రణు .

శివా!నిన్ను నాలో నిలుపుకున్నాను
నన్ను నీలో చేర్చుకోమన్నాను
తనువులు ముగిసేలా చూసుకోమన్నాను
మహేశా . . . . . శరణు .

శివా!అవినాభావ సంబంధానికి ఆనవాలు నీవు
నేను కైలాసం చేరటం కష్టసాధ్యమని
కైలాసాన్ని నాలోకి జొప్పించి కాపుకాసావా
మహేశా . . . . . శరణు .

శివా!ఈ పయనంలో ముగిసిందో మజిలి
తెలియని మజిలీకి తరలి వెళ్తున్నా
మజిలీలు ముగియనీ కథ కంచికెళ్ళనీ
మహేశా . . . . . శరణు .

శివా!నా స్పురణ లోకి రాకుండా
నా స్మరణలో సాగకుండా
ఎందు యేగుతున్నావు ఏలికా
మహేశా . . . . . శరణు .

శివా!ఆలోచనకు అందేవు
లక్షణాలు తెలిపేవు
అక్షరాన విరిసేవు
మహేశా.....శరణు .

శివా!శోధనకు సాధన తోడు
సాధనకు సహనం తోడు
సహనానికి నీవే తోడు.
మహేశా . . . . . శరణు

శివా!ద్వందమును దాటలేకున్నాను
అద్వైతమును ఎరుగలేకున్నాను
ఆచరణ సాగగా అనుభూతిగ అందించు
మహేశా . . . . . శరణు .

శివా!ఒక ఆకారాన్ని చుట్టబెట్టి
దానికి పలు వికారాలు కట్టబెట్టి
నిరాకారాన నీవు వేడుక చేసావు
మహేశా . . . . . శరణు .

శివా!కొండలు గుండెలు బండలు
వాటితో చేసావు సహవాసము
ఎలా మలచుకున్నావు వాసయోగ్యము
మహేశా . . . . . శరణు .

శివా! విశ్వ దర్పణాన తిలకించ
అసలు నీవు నకలు నేను
నకలు తొలగించు అసలు నెరిగించు
మహేశా. . . . . శరణు.

శివా!కంటబడకున్నా వెంటనీవుండ
ఒంటరి వారెవరు ఈ విశ్వమందు
నమ్మి పలికేను నేను నిటలాక్షా
మహేశా . . . . . శరణు .

శివా!తెలియ చూచుచుండ తెలియరావు
కలియ తిరుగుచుండ కానరావు
యుక్తి నెరిగించు యుక్తమవగ
మహేశా . . . . . శరణు .

శివా!ఏ కట్టె కాలినా మరే కట్ట కూలినా
నీ నామాల నిచ్చెనకు నిప్పంటునా
ఆ ఆలంబనమున నినుచేర తిప్పలుండునా
మహేశా . . . . . శరణు .

శివా!కరుణ కోరగ నిన్ను స్పురణగా వచ్చేవు
ఆ స్పురణలో నీ కరుణ తెలియజేసావు
తెలిసేవయా ఇలా విరిసేవయా
మహేశా . . . . . శరణు .

శివా!ఎదురెదురుగ ఎన్నాళ్ళు
ఎడబాటుకు ఎన్నేళ్ళు
ఏదో ఒకటి అవనీ నీలో నన్ను చేరనీ
మహేశా . . . . . శరణు .

శివా!నీవు ఎక్కడ వుంటావో తెలుసు
నేను ఎక్కడ వున్నానో తెలుసు
గణపతి తోడవనీ గమ్యం చేరేవరకు
మహేశా . . . . . శరణు .

శివా! నీ ఆస్థానం నాకు లయస్థానం
అందు అడుగిడనీ నేను విడివడనీ
దేహ బంధాలు ఇంక తెగి పడనీ
మహేశా . . . . . శరణు .

శివా!నా నుదిట మెరిసేది నీ నామమే
నా నోట నలిగేది నీ నామమే
నా మాట,నా బాట నీ నామమే
మహేశా . . . . . శరణు .

శివా!స్పురణగా తెలిపించు
వరముగా వినిపించు
ఫలముగా పలికించు
మహేశా . . . . . శరణు .

శివా! కోపతాపాలను కాల్చివేయి
లోపాలు శాపాలు తుడిచివేయి
నీటినైనా నిప్పునైనా నన్ను శుద్ధిచేయి
మహేశా . . . . . శరణు.

శివా!లింగమూర్తిగ నిన్ను ధ్యానించగా
ఆలింగనమున నన్ను అనుగ్రహించేవా
భక్త సులభుడవు అనిన నీవే కదా
మహేశా . . . . . శరణు .

శివా!తొలి దైవమై నీవు ఒప్పి వున్నావు
తొల్లింటి వానిగా తెలిసి యున్నావు
తొలి పూజ కెందుకో తరలిరావు.
మహేశా . . . . . శరణు .

శివా!సాధన చేయగ దేహాన్ని యిచ్చావు
సందేహాలు తీరగ గురుతత్వాన తెలిసావు
నా కన్ను చూడగా కానరావా
మహేశా . . . . . శరణు .

No comments:

Post a Comment

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u శివా! మళ్ళీ జన్మలు ఉన్నా కానీ… మనిషిగ పుట్టే యోగ్యత కలదో లేదో… మళ్లీ నీ సన్నిధి ముంగి...