శివా! "నేను"
శవంగా మారక మునుపే నను
జీవమున్న మనిషిగా తీర్చిదిద్దు
జీవాత్మ తల్లడిల్లి పోతుంది బాధగా
శివా! "నేను"
నిను చేరక ముందే నను మేలుకొలుపు
నిను నిత్యం ఆరాధించు దారి చూపించు
నా నడకలు నీవైపు నడిచే విధం బోధించు
శివా! "నేను"
ఏ జన్మలలో చేసుకున్న పుణ్యమో
ఈ జన్మమున మానవునిగ పుట్టాను
నిజానికి నేనే నాడైనా మనిషిగ నడిచానా
శివా! "నేను"
దాన ధర్మములు ఏమి చేయలేదు
నను సాయమడిగిన వారిని ఆదరించ లేదు
నేను నేనను అహము నాలో చావడం లేదు
శివా! "నేను"
నలుగురిలో పుట్టి పెరిగి పెద్దవాడినై, ఆ
నలుగురి కోసం ఏనాడు ఆలోచించ లేదు,
కలిమి లేముల తేడాలతో దూరం చేసుకున్నాను
శివా! "నేను"
మారిపోయాను, నన్ను మన్నించి మంచి
దారి చూపించు నిజమైన మనిషిగా మసలేలా
కరుణించి నిను చేరే లోపు నను మానవునిగా మార్చు