శివా!కాస్త సురగంగలో తడపమంటే
ఏకంగా సంసార సాగరం లో ముంచేసావు
బయట పడేదెలా ? బదులు పలుక వేల ?
మహేశా ..... శరణు .
శివా!నీ కలలో నేనుంటూ
కలనైనా నిన్ను చూడాలనుకుంటూ
కలలు కంటున్నాను కాలకంఠా
మహేశా . . . . . శరణు .
శివా!శుద్ధ జలమునకు సరితూగు
నా భాష్ప జలధారల నిన్ను
అభిషేకించితి కాస్త అనుగ్రహించు
మహేశా . . . . . శరణు .
శివా!వెలుగులోన వెలుగు చూడ వీలుకాదని
చీకట్లో చూస్తున్నా నీ వెలుగు కోసమై
వెలుగు చూడనీవా ఆ వెలుగు నీవు కాగా
మహేశా . . . . . శరణు .
శివా!ఏ మాటను చెప్పను నీ మాటగ నేను
నా మాటకు మౌనాన్ని ఎలా అన్వయించను
అనుభవించ చెప్పనా అన్వయించలేనని
మహేశా . . . . . శరణు .
శివా!నా పాట్లునెరిగి నిను నేను మరిగి
మనపుచున్నానయ్య నీ స్మరణతో
మసలుచున్నానయ్య నీ కరుణతో
మహేశా . . . . . శరణు .
శివా!నీ పాద దూళి నన్ను తాకి
నా దేహము దూళిగా మారి
నిన్ను చేరనీ నేను మాయనీ
మహేశా . . . . . శరణు .
శివా!నన్ను బాణముగ సంధించి
నీవన్న లక్ష్యాన్నికి విడిచిపెట్టు
నీ గురికి తిరుగేది నాకింక చింతలేదు
మహేశా.....శరణు.
శివా!నా మనుగడ సాగించగ
మూడవ కన్ను నెరిగించు
నన్ను నీవు గెలిపించు
మహేశా . . . . . శరణు .
శివా!నేను నాకు తెలిస్తే
నీవె తెలియ వస్తావు
తెలిసేది ఇంక లేదు పొమ్మంటావు
మహేశా . . . . . శరణు .
శివా!మౌనాస్వాధన మధురమెరిగి
మౌన బాష మీద మనసు పెరిగి
మౌనిగా ఉన్నాను ఆ రుచి మరిగి
మహేశా . . . . . శరణు .
శివా!కాయాన్ని మోసేవు కానకుండా
కష్టాలు మోసేవు చెప్పకుండా
ఇష్టాలు తీర్చావు నొచ్చకుండా
మహేశా . . . . . శరణు .
శివా!విషమ పరిస్థితి చూసి వణుకు పుట్టె
బ్రతుకు తీరు తెలిసి భయము పుట్టె
ఉద్దరింతువన్న విశ్వాసం నా వీపు తట్టె
మహేశా . . . . . శరణు .
శివా!నాలో ఉంటూ నాకెందుకు అనిపించవు
నాతోనే ఉంటూ నాకెందుకు కనిపించవు
ఇది దృష్టి దోషమా , సృష్టి దోషమా... ?
మహేశా ..... శరణు.
శివా!ఈ మరణ మృదంగం ఆపవయ్యా
ఉత్తుంగ గంగా తరంగాలు పంపవయ్యా
కొట్టుకొని పోవగ ఈ విషమ పరిస్థితి .
మహేశా . . . . . శరణు .
శివా!శవాల జాతర చాలయ్యా
భయాలు మాపగవేమయ్యా
బిరాన బ్రోవగ రావయ్యా
మహేశా . . . . . శరణు .
శివా!ఇచ్చి పుచ్చుకొనుట తప్ప కాదుగా
ములుగుతున్న మనసు నీకు ముట్ట చెబుతాను
మనసుపడ్ఢ మౌనాన్ని నాకు అప్పజెప్పు
మహేశా . . . . . శరణు .
శివా! రేయి పగలూ నీకు లేవుగాన
నిత్య పూజలు నీకు లెస్సగాన
దోషమెంచకు నా పూజ ఎప్పుడైనా
మహేశా ..... శరణు.
శివా!నా ధ్యానం లో ఉన్నావు
నా గానంలో ఉన్నావు
తన్మయత్వమునె నీవు తెలియుచున్నావు
మహేశా . . . . . శరణు .
శివా!చెప్పగా నీవు చుట్టి ముట్టి వున్నావు
చూడగా మరి చూపుకు అందకున్నావు
చూడనివ్వు....ఆ చూపునివ్వు .
మహేశా . . . . . శరణు .
శివా!కాల్చవేమయ్య కాస్త కన్ను తెరచి
ముంచవేమయ్య ఓ జడపాయ విడచి
నిలువ సాధ్యమా ఏ విపత్తు నిన్ను తెలిసి
మహేశా . . . . . శరణు .