Friday, July 30, 2021

శివోహం

శివా!కంటి చూపుతో కాముడు చిత్తు
జడ పాయతో దక్షుడు చిత్తు
సర్వ జగములందు నీవే సత్తు
మహేశా . . . . . శరణు .

శివా!నాభి బంధము నాడు నీ ఎఱుక ఉండి
నాభి బంధము వీడ  నా ఎఱుక పెరిగె
నా ఎఱుక తొలగనీ నీ ఎఱుక పెరగనీ
మహేశా ..... శరణు.

శివా!పంచాక్షరి స్మరణం చేస్తూ
ప్రణవాన్ని శ్రవణం చేస్తూ
నీ కోసం తపిస్తున్నా
మహేశా ..... శరణు.

శివా!మన్నన పొందిన మౌనం
మనసుకి నచ్చిన మౌనం
మెచ్చగ నీవిచ్చిన  వరం
మహేశా . . . . . శరణు .

శివా!అంతటా అన్నిటా అరూపి గాను
గుడిలోని మాకొరకు అరూపరూపి గాను
అమరి వున్నావయ్య అద్భుతంగాను
మహేశా . . . . . శరణు .

శివా!నా చేతలు పట్టించుకోకు 
నా గోడు పట్టించుకో
నీ ఇంటికి రప్పించుకో
మహేశా . . . . . శరణు .

శివా!ఎరగని దూరంలో ఎదలోనే వున్నావు
తెలిసిన రూపంతో తెలియరాకున్నావు
తెలిసివచ్చేదెలా తెలియవచ్చేదెలా
మహేశా . . . . . శరణు .

శివా!నీవు నేను అనుకుంటె ద్వైత్వం
నీవే నేను అనుకుంటే అద్వైతం
ఆ భావన  పెరగనీ నా జ్ఞానం విరియనీ
మహేశా.....శరణు..

శివా!శ్వాసగా సాగనీ నీ నామ జపం
ఆవిరైపోనీ ఆశలన్నీ ప్రతిక్షణం
కుంభవృష్టి కానీ నీ కటాక్ష వీక్షణం
మహేశా . . . . . శరణు .

శివా!మోజు పడి చేస్తున్నా మౌనం
యోగిరాజువని చెపుతున్నా నా వైనం
రివాజుగా సాగనీ నా పయనం.
మహేశా ..... శరణు .

శివా!నా చూపు నీవైపు తిరగాలి
నీ రూపు నాకంట మెరవాలి
ఆ మెరుపున నేను మురియాలి
మహేశా . . . . . శరణు .


శివా! బుద్ది ఒక తీరు మనసు ఒక తీరు
ఆ రెంటి నడుమా నిత్యమూ పోరు
ఎద్దు,ఎనుబోతులా ఈ బండికి
మహేశా.....శరణు.

శివా! సంసారాన్ని పోల్చగ సాగరం సృష్టించావో
సాగరాన్ని పోలిన సంసారాన్ని కూర్చావో..గానీ
సంసార ,సాగరాలు దాట కష్టసాధ్యమాయె.
మహేశా . . . . . శరణు .

శివా!పరశుతో నా బంధాలు తెంచివేయి
కైలాసాన ఏ కొయ్యకో కట్టివేయి
ఇంకేమైనా అడిగినచో ఒట్టువేయి
మహేశా . . . . . శరణు .

శివా!స్వల్పకాలిక లయానికి నీ స్మరణ తోడయింది
మరణ మెరుగ జేసి మరునాడు నిదుర లేపింది
జనన మరణ చక్ర జ్ఞానాన్ని తెలియ జేసింది
మహేశా . . . . . శరణు .

శివా!కడలిలో ఉన్నావో కొండపై ఉన్నావో ...
ఎద్దుపై వస్తావో ఎగిరెగిరి వస్తావొ...
కరుణించి కట్టెదుట కనిపించు చాలు
మహేశా ..... శరణు.

శివా!నీ కరపాత్ర కావాలని కలలు కంటున్నా
కలలు నిజమౌనట్టు కరుణించమంటున్నా
కినుక ఇక చాలు కూడ రమ్మంటున్నా
మహేశా . . . . . శరణు .

శివా!నా కర్మ నిశ్శేషమవ్వాలని
నీ చేతి కరపాత్ర కావాలని
కర్మించుచున్నాను కనుచూడవా
మహేశా . . . . . శరణు .

శివా! నా జీవిత గానానికి  శృతి నీవే
నా జీవితయానానికి గతి నీవే
నా గతిలోన గతి చూపే జ్యోతివి నీవే
మహేశా ..... శరణు.

శివా!ఆకృతి లేని నీ ఘనత కృతులుగా
పెక్కు స్వరములు ఒకటిగా ఆలపించినా
పారవశ్యమందితి నేను నేనుగా
మహేశా . . . . . శరణు .

శివా! వెంటబడి వస్తున్నాయ్ వాసనలన్నీ
కనబడకనే తరుముతున్నాయ్ కర్మలు అన్నీ
క్షయము చేయి ఆ రెంటిని క్షంతవ్యుడ నేను
మహేశా ..... శరణు.

శివా!కాలగర్భంలో కలసినన్ను
కాలానికి మరల అందనీయకు
అంతులేని వ్యధలపాలు కానీయకు
మహేశా . . . . . శరణు .

శివా!ఇద్దరికీ చెరి సగము పంచి
నీ సగము కూడగ ఇద్దరినీ పెంచి
ఇనుమడించినావు ఇద్దరియందు
మహేశా . . . . . శరణు.

శివా!నామాటను మలుపు తిప్పావు
నాకు మౌనాన్ని మప్పావు
నీ కరుణ ప్రసరించి మనో వాంఛ సిద్దించనీ
మహేశా . . . . .  శరణు .

శివా!ఓనమాలు ఒడిసి పట్టి దిద్ది
నీ నామాలను  ఎదనిండా అద్ది
స్మరణ చేస్తుంటే మనసాయెను శుద్ధి
మహేశా . . . . . శరణు

శివా!ఎదుట నీవు కానరావు
ఎదను నేను కానలేను
ఎదుట పడేదెలా నీవు నేను
మహేశా . . . . . శరణు .

No comments:

Post a Comment

  బాహ్యంలో నా నేను ఊరేగుతూ... అంతరంలో నా నేను కు దూరమై... ఎటూ చేరలేని అవస్థలు, తీరని బాధలు... నన్ను ఓ దరికి చేర్చవా పరమేశ్వరా.. మహాదేవా శంభో...