శివా!ఎదుట నీవు కానరావు
ఎదను నేను కానలేను
ఎదుట పడేదెలా నీవు నేను
మహేశా . . . . . శరణు .
శివా!"నేను "నేనని అంటున్నది ఒక మేను
"నేను" ను తెలుసుకో అంటున్నది ఒక నేను
"నేను" తెలిసేదెలా ఈ మేను మరిచేదెలా
మహేశా . . . . శరణు .
ఎఱుక కలిగెను నాకు ఎదను నేడు
తృప్తి నొందితి నేను తెలియగాను
నమఃశివాయ నమః హరాయ
ఒక్కటైన జగతిలో ఒక్కడే శివుడు
రెండుగా రూపించు రేడు ఈ శివుడు
మూడు లోకములేలు ముక్కంటి శివుడు
నాలుగు వేదాలు కలగలుపు శివుడు
ఐదు అక్షరముల మంత్రమే శివుడు
ఆరు చక్రాల పైవెలుగు శివుడు
ఏడు ఏడు లోకాల ఏలిక ఈ శివుడు
ఎనిమిది మూర్తుల ఏకమే శివుడు
తొమ్మిది గ్రహాలకు తలకట్టు శివుడు
పది దిక్కులందు ప్రభవించు శివుడు
పది నొకటి రుధ్ర స్వరూపమే శివుడు
పది రెండు లింగాల వెలిగేది శివుడు
శివుడే శివుడు శివుడే శివుడు
మహేశా.....శరణు.....
శివా!నీ మౌనం మాకు జ్ఞాన దీపిక
జ్ఞాన గమ్యాన అది మాకు దివ్య సూచిక
ఆ సూచిక ఎదకందించె ఆనంద గీతిక
మహేశా . . . . . శరణు .
శివా!"నేను"కానిది ఒకటి కాలి బూడిద అయింది
ఆ బూడిద నీ అభిషేకానికి సిద్ధమయ్యింది
"నేను" దేహమును వీడి నీలో ఐక్యమయ్యింది
మహేశా ..... శరణు .
శివా!ఈ దేహంలోకి ఎలా వస్తావో
ఈ దేహం విడిచి ఎలా వెళ్తావో
తెలియనీయవు ఆ తెలివినీయవు
మహేశా . . . . . శరణు .
శివా!ఆది అన్నది నీకే చెల్లు
ఆధ్యంతములు లేని ఆదిదేవా
ఆది నుండి నిన్నే నమ్మితి ఆదుకోవయ్యా
మహేశా . . . . . శరణు .
శివా!హరి పాదాన అంత మక్కువేమిటి?
హరి పాదాన పుట్టిన గంగ నీ నెత్తినేమిటి?
ఎంత అడిగినా చెప్పవేమిటి పెదవి విప్పవేమిటి ?
మహేశా. . . . . శరణు.
శివా! కొలవలేని నిన్ను ,కొలిచి మురుస్తున్నా
తెలియలేని నిన్ను, తెలియ తపిస్తున్నా
తెలియవయ్యా నాకు తెలివి నొసగి.
మహేశా.....శరణు.
శివా!చెట్టుకింద చేరి చప్పున కూచున్నావు
చూపులతోనే జ్ఞాన బోధ చేస్తున్నావు
మౌనంలో నీ మాట నా మనసున విరియనీ
మహేశా . . . . . శరణు .
శివా! నీకూ నాకూ ఎడబాటే లేదు
ఇందులో తడబాటే లేదు
నీవు నాలో....లేదా.....నేను నీలో...
మహేశా.....శరణు.
శివా!ఆరాధనతో భక్తి ,నామంతో శక్తి ,
జ్ఞానంతో ముక్తి ,సాధించుట యుక్తి ,
ఇవి నేనెరుగ కలిగించు అనురక్తి
మహేశా . . . . . శరణు
శివా! బదిలీలు ఎన్ని జరిగినా
మజిలీలు ఎన్ని చేసినా
మారలేదు గమ్యం నీవే శరణ్యం
మహేశా ..... శరణు.
శివా!ప్రసాదానికి పదార్ధ నామం లేదుగా
ఈ దేహం నీ ప్రసాదమే కదా
మరుగవనీ నామం మెరుగవనీ జీవితం
మహేశా . . . . . శరణు .
శివా! వంక జాబిలి నీ సిగ పూవుగా
నిండు జాబిలి నీ శుభ నేత్రంగా
గగనమంత మెరిసేను నీ రూపంగా
మహేశా ..... శరణు.
శివా!కాస్త సురగంగలో తడపమంటే
ఏకంగా సంసార సాగరం లో ముంచేసావు
బయట పడేదెలా ? బదులు పలుక వేల ?
మహేశా ..... శరణు .
No comments:
Post a Comment