శివా!వెలుగు వేల్పుకు వెలుగిచ్చు వాడా
జ్ఞాన మూలమై జగతిని భాసించు వాడా
నాలోన జ్ఞానాన్ని ప్రభవించనీయి
మహేశా . . . . . శరణు .
శివా!నా నోట నా నుదుట నీ నామమే
రేయి పగలూ నాకు నీ ధ్యానమే
జన్మ మరణములు రెండూ నీ అనుగ్రహమే
మహేశా . . . . . శరణు .
శివా!నీ పదమంటే చాలు పదమంటినట్టే
నీ పదమందితే చాలు కైవల్యమందినట్టే
నీ పదమందనీ నన్ను తరియించనీ
మహేశా . . . . . శరణు .
శివా!దూరాన ఉంటె దర్శించలేనని
కంటికి జానడు దూరాన నీవున్నా
దర్శించలేకున్న దయచూడవయ్య
మహేశా ..... శరణు.
శివా!నీ పాద దూళినైతే పరవసించేను
నే భస్మమైతే నీ దేహాన మెరిసేను
నీవాడనైతే జన్మలే ముగిసేను
మహేశా . . . . . శరణు .
శివా!ఉన్మత్తుల కూడి ఊసులాడేవు
అఘోరీల కూడి ఆటలాడేవు
నాబోటి వారితో ఎటుల మసలేవు
మహేశా . . . . . శరణు .