Sunday, December 19, 2021

శివోహం

 శివా!ఆద్యంతములు లేని నీతో
ఆద్యంతములు తెలియని మాకు
ఏనాటిదో ఈ అవినాభావ సంబంధం
మహేశా . . . . . శరణు .


 శివా!ఆరు వర్గాలు నన్ను అంటకుండా
వైరి వర్గాలు నన్ను అడ్డకుండా
నా వెంటనే ఉండు నన్ను బ్రోవ .
మహేశా . . . . . శరణు .


 శివా!ఈ రేయి గడిచి తెల్లారునా ?
లేక  .....  ఈ బ్రతుకు తెల్లారునా..?
నిత్య సందేహమే మాకు నిటలాక్షా.
మహేశా . . . . . శరణు.


 శివా! ఒక చిన్న మాట...
అన్ని నామాలూ నీకే ఎలా ? 
ఈ రెండు రూపాలు ఒకటిగా ఎలా ?
మహేశా ..... శరణు.


 శివా! కూడా పంపేవు కదా చావును కూడా
కాసుకొనే ఉంటోంది రాసుకొనే తిరుగుతోంది
అగుపించకున్నా అంగరక్షకుడిలా....
మహేశా ..... శరణు.


శివా!లోకాల నేలేటి ముక్కంటిరేడా
వాసాలు లేనట్టి ఓ ఇంటివాడా
మాకెట్టా తెలిసేది నీ ఇంటి జాడ
మహేశా . . . . . శరణు.


శివా!వేదాలలోవే వల్లించుతున్నాను
వాదాలు లేవని వాదించు చున్నాను
నీ పాద పూజకే ప్రార్ధించు చున్నాను
మహేశా . . . . . శరణు.

No comments:

Post a Comment

  బాహ్యంలో నా నేను ఊరేగుతూ... అంతరంలో నా నేను కు దూరమై... ఎటూ చేరలేని అవస్థలు, తీరని బాధలు... నన్ను ఓ దరికి చేర్చవా పరమేశ్వరా.. మహాదేవా శంభో...