Tuesday, March 7, 2023

భగవంతుణ్ణి మనస్సులో స్థిరంగా నిలుపుకోవడం ఎలా



ఇదే ప్రశ్నను పరీక్షన్మహారాజు శుకమహర్షిని అడిగాడు. 

భగవన్మూర్తి హృదయంలో నిలకడగా నిలుపుకోవడాన్నే ధారణ అంటారు. 

భగవత్ స్వరూపం స్థూలం, సూక్ష్మం అని రెండు విధాలు, వీటిలో స్థూలంగా వుండే విరాట్స్వరూపాన్నే ధారణను అభ్యసిస్తున్నపుడు మనసులో నిలుపుకోవాలి. మనం నిత్యం ప్రత్యక్షంగా దర్శించే ప్రపంచమంతా భగవత్  శరీరంలో చేరినదే. 

బృహదారణ్యక, సుబాల, తైత్తరీయాది ఉపనిషత్తులు, స్మృతులు ఇతిహాసాలు, పురాణాలు ఈ విషయాన్ని నిరూపిస్తున్నాయి. "జగత్సర్వం శరీరం తే" "తత్సర్వం వై హరే స్త ను?" అన్నట్లు ఈ విరాట్ మూర్తిని ధారణ ప్రారంభంలో అలవరచుకోవాలి. 

విష్ణు సహస్ర నామ స్తోత్రారంభంలో వున్న "భూః పాదౌ య స్స నాభిః" అనే ధ్యాన శ్లోకం గూడ ఈ విరాట్ పురుష స్వరూప వర్ణనమే. హృదయంలో ఈ స్థూల స్వరూప ధారణ ద్వారా ధ్యానం స్థిరపడి సర్వదోషాలు తొలిగిపోతాయి. 

ఇటువంటి ధారణ సిద్ధించిన తర్వాత సాధకుడు, తన ఉపాసనకు శుభాశ్రయమైన అంగుష్ట పరిమితిలో నుండు తన హృదయకోశంలో భగవంతుని దివ్యమంగళ విగ్రహాన్ని ఆ పాదకేశాంతం దర్శించి ధ్యానించాలి. 

భగవానుని దివ్యావయములను, ఆభరణాలను, ఆయుధాలను, శ్రీహరి దివ్య అవతారాలను, లీలలను దర్శించాలి. భగవత్ సౌందర్యాన్ని, సౌలభ్యాన్ని, వాత్సల్యాన్ని, మందహాసాన్ని, వేయి వెలుగులను క్రమంగా ఉపాసించి, తరించాలి

No comments:

Post a Comment

  బాహ్యంలో నా నేను ఊరేగుతూ... అంతరంలో నా నేను కు దూరమై... ఎటూ చేరలేని అవస్థలు, తీరని బాధలు... నన్ను ఓ దరికి చేర్చవా పరమేశ్వరా.. మహాదేవా శంభో...