శివా!నీ కేశపాశములు నిండి నింగినంత
జాలువారిన గంగను పట్టేను ఏమి వింత
చిత్రాలకు చిరునామా నీవే తెలిసినంత
మహేశా . . . . . శరణు .
శివా!నీ నేత్ర కళశాల ఒలికిన కారుణ్యమే
ఇల పుణ్య తీర్థాలై పుడమి నెరిగె
ఏ పూజ ఫలమో ఈ రీతి మాకు దక్కె
మహేశా . . . . . శరణు .
శివా!జన్మలకు మరణమందించు
మరణానికి జన్మలు తొలగించు
ఒక్కసారికి నా మాట మన్నించు
మహేశా . . . . . శరణు .
శివా!ఈ దేహంతో ధ్యానం చేస్తూ
సోహంతో శ్వాసను చూస్తూ
కనలేని దారిలో కదిలి వెళ్తున్నా
మహేశా . . . . . శరణు .
శివా!నిజ తేజమంతా నిలువు కంట నింపి
అటు ఇటుగా వున్న అడ్డు కన్నుల పంచి
రేయి పగలుగ జగతికి అందజేసావు
మహేశా . . . . . శరణు .
శివా!సత్యం నీవుగ తెలిసేవు
శివమే తత్వంగా విరిసేవు
సుందర రూపున మెరిసేవు
మహేశా . . . . . శరణు .
శివా!ఓంకారానికీ ఆకారంగా నీవు
అరూపరూపిగా అగుపించు చున్నావు
అనుభూతికేలనో అందకున్నావు
మహేశా . . . . . శరణు .
శివా!నేను ,నీవు అంటూ పూజ చేసి
నేను, నీవేనంటు ధ్యానాన తెలిసి
దరి చేర తలచాను దయ నీది కాగా
మహేశా . . . . . శరణు .
శివా!ఈ లింగమున నిన్ను తెలుసుకున్నాను
ఆలింగనముగ నిన్ను హత్తుకున్నాను
ఆనంద డోలికల అవధి దాటేను.
మహేశా . . . . . శరణు .
శివా!మట్టితో అనుబంధ మెంత గొప్పదో
పుట్టి గిట్టుటలోన నేను మట్టినే కూడి
మట్టి బొమ్మను నిను తెలిసి మురిసినాను
మహేశా . . ... . శరణు .