శివా!తల త్రెంచుటలో తలపండినావు
ఏరి కూర్చి తలను ఎఱుక నొసగేవు
నా తలను త్రెంచు ఆపైన కరుణించు .
మహేశా . . . . . శరణు .
శివా!లెక్కలేని నామాల ఒప్పియున్నావు
ఎక్కలేని శిఖరాల వసియించియున్నావు
పిలిచేదెలా నిన్ను కలిసేదెలా
మహేశా . . . . . శరణు .
శివా!బాధలను బాగించ
గుణములను గుణియించ
చేకొంటి నీ స్మరణమే
మహేశా....శరణు.
శివా!నా అపచారము మన్నించు
ఈ ఉప వాసము తప్పించు
నిజ వాసమున నిలువనుంచు
మహేశా . . . . . శరణు .
శివా!సిరివెన్నెల మాయమై నేడు
నీ సిగను చేర నేలను విడిచె
మా ఎదను మాత్రము వీడక నిలిచె
మహేశా . . . . . శరణు .
సిరివెన్నెలను సిగ పూవును చేయ
ఏకాదశ నందులు కూడి వచ్చి
ఏకాదశ రుదృని ఎదుట నిలిపె
ఏకమైపోవగ ఎదను తెరిచె
శివార్పణం
శివా!చినుకల్లె నీ నామం చిత్తాన్ని తడపగా
వెలుగాయెను నీ నామం అజ్ఞానం తొలగించగా
మెరుగాయెను నా గమనం గమ్యాన్ని చేరగా
మహేశా ..... శరణు.
శివా!నీ పయనం ఎప్పుడు ఎక్కడికో
నందికైనా చెప్పవేమో నాకు తెలిసి..
నంది వాహనా నీకు స్వాగతమెలా..?
మహేశా ..... శరణు.