Thursday, March 31, 2022

శివోహం

గుణవంతుడు, సజ్జనుడు ఎవరయినా జ్ఞానబోధచేస్తే దన్ని విధిగా ఆచరించాలి...
దాని వలన జ్ఞానోదయమవుతుంది...
పెద్దలు చేసిన హితబోధ ఆచరించటమే శరణ్యం.

ఓం శివోహం... సర్వం శివమయం.

శివోహం

శివా!రాగాలు నాలోన రగులుకుంటున్నాయి
భోగాలు నన్ను చేరి బాధించుతున్నాయి
భాగించు భోగ రాగములు నిశ్శేషమవగా
మహేశా . . . . . శరణు.

శివోహం

కనిపించకుండా తప్పించుకొని తిరిగేవు...
మాటలతో మాయేదో చేస్తావు...
ఉన్నానంటూనే అస్సలు లేనట్లుగా ప్రవర్తిస్తావు...
అన్ని చూస్తూనే ఏమి విననట్లుగా నటించేవు...
నిన్ను మించిన నటుడున్నాడ ఈ లోకంలో...
నటన చేతకాని నాతో నటింప తగునా శివ...

మహాదేవా శంభో శరణు.

Wednesday, March 30, 2022

విశ్వాసమే భక్తికి పునాది

విశ్వాసమే భక్తికి పునాది
ప్రారబ్దవశాత్తు లభించిన దానితో తృప్తి చెందాలి. జీవ్ఞడు గతంలో నాటిన కర్మబీజాలే వర్తమానంలో ఫలిస్తూ ఉన్నాయి. సంచితకర్మలే ఈ జన్మలే ప్రారబ్ద ఫలాలుగా అందుతూ ఉన్నాయి. లేనిది రాదు. ఉన్నది పోదు. ఈరోజు చూస్తూ ఉన్నదంతా గతంలో చేసినదే. ఈరోజు పురుషార్థంతో ఏదైతే చేస్తూ ఉన్నామో దానిని ఆగామిగా భవిష్యత్తులో చూడబోతాము.

కర్మఫలప్రదాత పరమాత్మ కనుక కర్మఫలాలు ప్రసాదాలు. ప్రసన్నతను కలిగించేదే ప్రసాదం కనుక కర్మఫలాలను అందుకోవడంలో ప్రసన్నత నిండాలే కానీ పరితాపం ఉండకూడదు. జీవితంలో ఏది అందినా అది కర్మఫలమే. భుజించే ఆహారం కూడా కర్మఫలమే కనుక యాదృచ్ఛికంగా, ప్రారబ్దవశాత్తు ఏది లభించినా మనిషి దానితో సంతృప్తి చెందే సదలవాటును పెంపొందించు కోవాలి. ఆకలి వ్యాధిగా సంక్రమించిందే కాని సుఖాను భవానికి ద్వారము కాదు. వ్యాధికి కావలసింది మందు కాని విందు కాదు. కాబట్టి ఆకలి అనే వ్యాధికి ప్రారబ్దవశాత్తు ప్రతిదినము లభించిన భిక్షను పరమాత్మకు నైవేద్యంగా సమర్పించి ప్రసాదంగా స్వీకరించాలి.

ఈవిధంగా దేహానికి ఆకలిబాధ తీరుతుంది. చిత్తానికి ప్రసన్నత చేకూరుతుంది. ఆశించినవన్నీ రావ్ఞ. అర్హత ఉన్నవే వస్తాయి. స్వల్పమైన, అల్పమైన కర్మలకు అనంతమైన ఫలం రాదు. కర్మకు ఫలితం వస్తుందే కాని ఆశకు ఫలితం రాదు. ఆశలు పెంచుకుంటే ఆశలతో పాటు ఆవేదనలు పెరుగుతాయి కాని ఆనందం చేజిక్కే అవకాశం లేదు. ఎప్పుడు, ఎవరికి, ఏది, ఎలా అందివ్వాలో సర్వజ్ఞుడైన భగవంతుడికి తెలుసు. పక్షిపిల్ల పడుకోవడానికి మెత్తని గూడు కావాలని తల్లిపక్షికి తెలుసు.

అందుకే కట్టెపుల్లలతో కాక గడ్డిపరకలతో, కొబ్బరిపీచుతో మెత్తని గూడు తయారుచేస్తుంది. పక్షికే ఇంత జ్ఞానమున్నప్పుడు అనంతుడైన భగవంతుని విషయం ఏమని చెప్పాలి? అన్నీ ఉండి, అందరూ ఉండి, రేపు ఎలా జరుగుతుందో అని బెంగపడేవారే అందరూ. కానీ, అందరినీ వదలి, అన్నిటినీ వదలి, వట్టి చేతులతో ఒక జోలెను తగిలించుకొని ప్రపంచంలోకి ప్రవేశించిన సాధువ్ఞకు ఏ భయమూ లేదు. ఎందుకని? అతనికి ఒక్క విషయం క్షుణ్ణంగా తెలుసు.

తాను ఇంటికి దూరంగా పోతూ ఉన్నాడే కాని భగవంతుడికి దూరంగా పోవడం లేదు. తాను ఎక్కడ కదిలినా ఆకాశంలోనే కదులుతూ ఉన్నాడు. ఆకాశానికి ఆధారమైనవాడు అచ్యుతుడు. తన ఇంటికి తాను దూరంగా ఉన్నా అచ్యుతుడు తన వెంటే ఉన్నాడు. ఉన్నది అచ్యుతుడే. కనుక తాను ఇంట్లో ఉన్నా ఆయనే పోషిస్తాడు. ఎక్కడకు వెళ్ళినా ఆయనే పోషిస్తాడు. ఇది సాధువ్ఞకు ఉండే అందమైన అవగాహన. ఇద్దరు సాధువ్ఞలు ఉండే వారు. మొదటి సాధువ్ఞ అందరి యోగక్షేమాలు వహించేది భగవంతుడే అనే దృఢమైన భక్తి కలవాడు. కనుక అతని దగ్గర డబ్బు ఉంచుకునేవాడు కాదు. రెండవ సాధువ్ఞ డబ్బు అవసరం ఎరిగినవాడు.

ఒకనాడు ఇద్దరూ గంగానదిని దాటవలసి వచ్చింది. మొదటి సాధువ్ఞ వద్ద డబ్బు ఉండదు కనుక రెండవ సాధువ్ఞ ఇద్దరికి పడవ టిక్కెట్లు తానే కొన్నాడు. ఆవలితీరం చేరిన తరువాత రెండవ సాధువ్ఞ మొదటి సాధువ్ఞకు డబ్బు అవసరాన్ని సహేతుకంగా వివరించి ఇప్పటికైనా తన భావాలను మార్చుకోమని సలహా ఇచ్చాడు. అందుకు మొదటి సాధువ్ఞ ఒప్పుకోలేదు. టిక్కెట్టు కొన్నది రెండవ సాధువే అయినా అందుకు కావలసిన మొత్తాన్ని అతని వద్ద ఉంచింది భగవంతుడే. భగవంతుడి ఆజ్ఞలేనిదే ఈ ప్రపంచంలో ఎవరు ఎవరికీ ఏ సహాయమూ చెయ్యలేరు అంటాడు. అదే పరమేశ్వరునిపై అతనికి ఉన్న దృఢభక్తి. రక్షస్యతీతి విశ్వాసః. భగవంతుడు నన్ను రక్షిస్తాడు అనే విశ్వాసమే భక్తికి పునాది. ఈ భావన ఒక గృహస్థుడికి వస్తే అతను కూడా సాధువే. ఒకసారి గంగానదిలో ఒక గృహస్థుడు స్నానం చేస్తున్నాడు.

తాను వేసుకున్న ఖరీదైన సూటును గట్టు మీద ఉంచాడు. దారినపోయే ఒక వ్యక్తి అంత ఖరీదైన సూటు గట్టుమీద ఉంది, దరిదాపుల్లో ఎవరూ లేరే అని చుట్టూ చూడగా దూరంగా నదిలో స్నానం చేస్తున్న గృహస్థుడు కనిపించాడు. తాను కూడా వెళ్ళిపోతే దానినెవరైనా తీసుకొనిపోతారేమో అని ఆ గృహస్థుడు స్నానం ముగించి గట్టుమీదకు వచ్చే వరకు ఓపికగా వేచి ఉండి, ‘ఏమండీ! మీ వస్తువ్ఞను మీరు జాగ్రత్త చేసుకోవాలి కదా! మీరు స్నానం చేస్తున్న సమయంలో మీ బట్టలను ఎవరైనా కాజేస్తే ఏం చేస్తారు? నేనుండబట్టి సరిపోయింది. ఎవ్వరూ కాజెయ్యకుండా మీరు వచ్చేంతవరకు కాపలా ఉన్నాను అన్నాడు. అందుకు గృహస్థుడు, ‘నాకు తెలుసు మీరు ఉంటారని. ఎప్పుడైతే భగవంతుడే నాకు రక్ష అని నేను విశ్వసించానో, ఆయన ఏవిధంగానైనా రక్షిస్తాడు అని నాకు తెలుసు.

ఆయన మీ ద్వారా నన్ను రక్షిస్తాడు అన్నాడు. గృహస్థుడికైనా, సన్యాసికైనా ఉండవలసింది ఈ భావనే. కాబట్టి ప్రారబ్దవశాత్తు ఉండేదంతా ప్రసాదంగా భావించి తృప్తి చెందాలి (విధివశాత్‌ ప్రాప్తేన సంతుష్యతాం).

– చైతన్యానంద

అర్థమైతే శాంతి-లేకుంటే అశాంతి

అర్థమైతే శాంతి-లేకుంటే అశాంతి

సత్పురుషులు శాంతిని కోరుతారు. విషయలోలురు తాము కోరుకున్నది జరిగితేనే శాంతిస్తారు. మొదటి వారికి అశాంతి అర్థం కాదు. రెండవవారికి శాంతి అంతుపట్టదు. ఆమెకున్నది ఉండాలి అని కాకుండా ఉన్నదానిని అనుకోవాలి అనే మనసుండే వారికి శాంతి దూరంగాదు, అశాంతి సమీపించదు. ‘ఎంతో శ్రమించాను. ఎంతెంతో చేశాను. నన్నెవ్వరూ అర్థం చేసుకోరు-ఈ వాక్యాలు చాలా మంది నుండి వినిపిస్తూ ఉంటాయి. ఇలాంటి వారందరూ అశాంతిని ఆహ్వానించేవారే. ఈ విషయాన్ని సునిశితంగా విశ్లేషిద్దాం. మనల్ని ఇతరులు అర్థం చేసుకోలేదని మనం చెప్పే మాట నిజమే. కాని వాళ్లు 1. అసలు మనల్ని ఎందుకు అర్థం చేసుకోవాలి? మనం బ్రహ్మపదార్థమా? మనల్ని అర్థం చేసుకుని వాళ్లేమీ బావ్ఞంటారు? శోభనాధ్యాసలో గోచరించే వాటిలో మనమూ బొమ్మలమే. పగిలిపోయే మట్టిబొమ్మలం.

మనల్ని వాళ్లెందుకు అ ర్థం చేసుకోవాలి? వాళ్లకు ఉపయోగం లేదు కనుకనే మనల్ని వాళ్లు అర్థం చేసుకోరు. ఒకవేళ ‘నాకు ఉపయుక్తం కనుక వారు నన్ను అర్థంచేసుకోవాలి అంటావా? ముందు అది వాస్తవమో కాదో యోచించుకోవాలి. 2. మనల్ని ఇతరులు అర్థం చేసుకోవడం వల్ల మనకేమీ ఒరగదు. ఎదుటివారు నిన్ను అర్థం చేసుకున్నారా? లేదా? అని తెలుసుకోవడానికి నీ దగ్గర కొలతబద్ధ ఏమిటి? నీకు, వారికి ఎలాంటి మానసిక చుట్టరికమూ లేదు. నిన్ను ఆంతర్యంలో నచ్చకనే, బయటికి నచ్చినట్లు నటిస్తే నీకు అర్థమయ్యేదేముంటుంది? 3. ఒకవేళ బాహ్యాభ్యంతరాలలో ఒకేవిధంగా ఉన్నారు అనుకున్నా, నీవ్ఞ వారిని అర్థం చేసుకొనేలోగా ఎదుటివాడు మారడని నమ్మకమేమిటి? మార్పు అతనిలో జరిగినపుడు, నీ తీర్పుకు ఒరిగేదేమిటి? నేడు ఒక వ్యక్తి నిన్ను అర్థం చేసుకోవడం వల్ల నీకు సుఖం కలిగేటట్లయితే,

ఆ సుఖం నీకు సుఖంగా నిలుస్తుందా? ఆలోచించు. అతను మారినా, దూరమేగినా, మరణించినా నీ సుఖం కూడా గతిస్తుంది. ఇప్పుడు చెప్పు, ఇతరులు అర్థం చేసుకోలేదని వ్యధ చెందడం ఎంత సమంజసం? 4. అదలా ఉంచు. నిన్ను ఇతరులు అర్థం చేసుకోలేదని నీవ్ఞ ఏదో అవ్ఞతున్నావ్ఞ. ఎదను పగులగొట్టుకొంటున్నావ్ఞ. ఇంతకీ, నీ మనస్సు నిన్ను అర్థం చేసుకుంటున్నదా? నీవ్ఞ చెప్పినట్లు వింటూ ఉందా? అదే కనుక వినేటట్లయితే ”ఇతరులు నిన్ను అర్థం చేసుకోకపోతే, ఒకవేళ అది సమస్యగా పరిణమిస్తే, ఎదుటివాడికి కావాలే గాని నీకు మాత్రము కాదు. ఎందుకో తెలుసా! నీ మనస్సు నిశ్చింతగా ఉంది కనుక. 5. నా మనసు నా మాట వినడం లేదు కనుకనే ఎదుటివాడు నన్ను అర్థం చేసుకోవాలని కోరుతున్నాను అంటావా? సరే. మంచిది. కాని ఒక్క విషయం. నీ మాట నీ మనసు వినదు. ఇతరుల మనస్సులు వాళ్ల మాటల్ని విని విధేయతతో ఆచరణలో పెడుతున్నాయని తమ అభిప్రాయమా? నీ మాట నీ మనసు ఎలా వినదో, వాళ్ల మనసులు కూడా వాళ్ల మాటల్ని వినవ్ఞ. పాపం! ఇప్పుడు వాళ్లేం చేయాలి? నీ మాట వినాలని వారికున్నా వాళ్ల మనసులు సహకరించనపుడు వాళ్లేం చేస్తారు? నీలాగే వాళ్లు కూడా నిస్సహాయంగానే ఉన్నారు. 6. స్వామీజీ! మీరు కూడా కాస్త ఆలోచించి అర్థం చేసుకోండి. మీరు ఇప్పటివరకు చేసిన వాదమంతా బాగానే ఉంది.

కాని, ఒక్క విషయాన్ని మీరు మరచిపోతున్నారు. నన్ను అర్థం చేసుకోవాలని నేను ఎవరినో ప్రాధేయపడడం లేదు. నేను అడిగేది నా వారిని, నన్ను కట్టుకున్న వారిని, నన్ను చుట్టుకున్నవారిని. నావాళ్లు నన్ను అర్థం చేసుకోకపోవడమేమిటి? నా మాట వినకపోవడమేమిటి? ఇదెక్కడి న్యాయం? ఇదే కదూ మీ పూర్వపక్షం? నాయనా! దీనికి న్యాయాలు, చట్టాలు అనే పెద్దపెద్ద పదాలు ఎందుకులే! చూడు! కట్టుకోవడం, చుట్టుకోవడం ఏం మాటలయ్యా ఇవన్నీ? కట్టుకున్న పంచె, చుట్టుకున్న ఈగలు కూడా అర్థం చేసుకోవాలటయ్యా? కట్లు ఊడిపోతాయని, చుట్లు విడిపోతాయని కూడా నీకు తెలియకపోతే నేను ఏమి చేసేది? నీ వారు కనుక వారు నిన్ను అర్థం చేసుకోవాలా? వారు నీవారైనపుడు నీవ్ఞ వాళ్ల వాడివి కావా? వాళ్లని నీవ్ఞ అర్థం చేసుకోవాలని వాళ్లు కూడా భావించవచ్చు కదా? నా భావాల్లో వాళ్లెందుకు కలిసిపోకూడదు పాలలో పంచదారలా, అంటావా? వాళ్లూ అదే అంటున్నారు.

మేము అతనికి సంబంధించిన వాళ్లమే కదా. పెట్రోలులో కిరసనాయిలులా అతనెందుకు కలిసోకూడదు? అంటున్నారు. ఇప్పుడేం చేస్తావ్ఞ? ఇంకేమీ చెప్పనవసరం లేదు. చెప్పేందుకు కూడా ఏమీ లేదు. ఎవరో అర్థం చేసుకోలేదని వేడుకతో గడుపవలసిన బ్రతుకును ఏడుపులో ఈడ్చుకుంటున్నాం. అవి ఎంత అహేతుకమో సహేతుకంగా నిర్ణయించడం. దానికి సశాస్త్రీయ అవగాహనను అందించడం జరిగింది. ఈ విషయాలను పదేపదే మననం చేయండి. ఈ సత్యాలు జీర్ణమై వంటబడితే బ్రతుకులో పెద్ద ప్రతిబంధకాన్ని ఛేదించినట్లే.

– స్వామి సుందర చైతన్యానంద

ఆత్మానందమే ధ్యానయోగం

ఆత్మానందమే ధ్యానయోగం

‘ఉన్నది నీవే అని తెలుసుకోవడం జ్ఞానం. నీవు నీవుగా ఉండేందుకు చేసే ప్రయత్నం ధ్యానం. మనసుతో మనం కలిసి నడిస్తే అది వ్యవహారం. మనతో మనసు కలిసి ఉండటం ధ్యానం. మనం నడిచినా, కూర్చున్నా, కర్మ లాచరించినా, ఆచరించకపోయినా మనసు మనతో కలిసి ఉండటం, ఏ వ్యాపారాలు లేకుండా మనసు ఉండటమే ధ్యానంలో ప్రధానమైన విషయం. అందుకే ధ్యానం నిర్విషయం మనః అన్నారు. అయితే, మనసులో ఏ వృత్తులూ కదలకుండా ఉండటం సాధ్యమా? ధ్యానం మానసవ్యాపారమే కనుక ధ్యానం కూడా కర్మే. కర్మలో స్వేచ్ఛ ఉన్నట్లే, ధ్యానంలోనూ మనసుకు స్వేచ్ఛ ఉంది. ఆలోచించే స్వేచ్ఛ, ఆలోచనలను ఆపి ధ్యానం చేసే స్వేచ్ఛ మనసుకు ఉన్నాయి.

ఇంతకీ ధ్యానం చేసే ‘నేను ఎవరు? సత్యాత్మా? లేక మిథ్యాత్మా? సత్యాత్మా లేక స్వరూపానికి ధ్యానం అవసరం లేదు కనుక థ్యాత మిథ్యాత్మ అనేది సత్యం. కర్తగా ఉండి చేసేది సగుణధ్యానం (సగుణబ్రహ్మ విషయ మానస వ్యాపారః). కర్త మీదనే చేసే ధ్యానం నిర్గుణధ్యానం. దీనిని నిర్గుణధ్యానంగా వాడుకలో పిలుచుకున్నా వేదాంత పరిభాషలో దీనిని ‘నిధిధ్యాసనం అని అంటారు. ధ్యాత అధ్యాసలో ఉన్నవాడు. ఏ కర్మయినా అధ్యాసలోనే జరుగుతూ ఉంది. కనుక ధ్యానం కూడా అధ్యాసలోనే జరుగుతూ ఉంది ఎన్నో జన్మలు గడిచాయి. అన్ని జన్మలలోనూ ఎక్కువగా చెడు ఆలోచనలే నడిచాయి. వీటిమధ్య ఆచరించిన కర్మలు ఎన్నో! ఈ కర్మల ఫలితాలు ఎన్నో! ఇవి పర్వతాల రూపంలో పాపాలై పండి ఉన్నాయి. ప్రవాహరూపంలో దోషాలై ప్రవహిస్తూ ఉన్నాయి. ఇన్ని జన్మల్లో ఇన్ని విధాలుగా నలిగిపోయిన ఒక వ్యక్తి ఈరోజు ధ్యానానికై కూర్చున్నాడు. ఇది ధ్యాత పరిస్థితి. ధ్యాతకు అనేకమైన గాయాలు ఉన్నాయి. విపరీతమైన ఆలోచనలు ఉన్నాయి.

ఆంతర్యం భయాలతో, ద్వేషాలతో నిండి ఉంది. ధ్యాత నేపథ్యాన్ని వదలి మనం ముందుకు పోలేము. ఇదంతా అతని దురదృష్టం. కానీ ఇంత దురదృష్టం లోనూ ఒక అదృష్టం ఉంది. అదే నేను ధ్యానం చేయాలి అనే సంకల్పం. మహాత్ముల ద్వారా విన్న ఆప్తవాక్యాల వల్లనో, లేక ఏ కొద్దిపాటి పుణ్యం మిగిలి ఉండటం వల్లనో ధ్యానం చేయాలి అనే సత్సంకల్పం అతనికి ఈరోజు కలిగింది. ఏ మనసైతే చేయగూడని ఆలోచనలు చేస్తూ, లేనివాటిని చూపిస్తూ వచ్చిందో, ఏ మనసైతే చేయవలసిన ఆలోచనలు చేయకుండా ముందుకుపోయే మార్గాన్ని వెనుకకు మళ్లిస్తూ వచ్చిందో, ఆ మనసే నేడు ధ్యానం చెయ్యాలి. అన్నిచోట్లా ఆటంకాలను కలిగించిన మనసు, అవరోధాలను సృష్టించిన మనసు, విఘ్నాలను కల్పించిన మనసు, బ్రతుకును చిందరవందరగా తయారుచేసిన మనసే ఈ ధ్యానంలోనూ ఉంది కనుక చిన్నపిల్లవాడిని ఏవిధంగా లాలించి, పాలిస్తామో ఆ విధంగానే మనసులో గూడుకట్టుకుని ఉన్న భయాలను, సంశయాలను తొలగించి మనసుకు ధైర్యాన్ని, ఉత్సాహాన్ని కల్పించాలి.

మనసున్నందుకు ఆలోచనలు వస్తాయి. మనసులో వృత్తులు ఉంటాయి కనుకనే ధ్యానం చేస్తున్నాం. ఇదం వృత్తులు విపరీతంగా వస్తూ ఉంటే వాటి నుండి విడిపడి అహం వృత్తిని చూడటం, ఇదం వృత్తులు అదృశ్యమై అహం వృత్తి మాత్రమే మిగిలినపుడు అహం వృత్తిని అహం స్వరూపంగా భావించడమే నిర్గుణ ధ్యానంలోని కేంద్రవిషయం. ఏ అల కూడా సముద్రం కన్నా దూరంగా లేదు. ఏవృత్తి కూడా చైతన్యం కన్నా వేరుగా లేదు. అలసముద్రాన్ని పరిమితం చేయలేదు. మార్పుచేయలేదు. అదేవిధంగా మనమీద ఆధారపడి ఉన్న వృత్తి మన స్వరూపాన్ని పరిమితం చేయడం గాని, మార్పు చేయడం గాని చేయలేదు. ఇక దేనికి అలజడి? అవి వస్తే రానీ. నీవు వాటి వెంట పోకు. సాక్షిగా ఉండు. లేచిన అలలు పడుతూ ఉంటాయి. వచ్చిన సంకల్పాలు పోతూ ఉంటాయి. అవి వచ్చినపుడు నీవ్ఞ ఉన్నావ్ఞ. అవి పోయినా నీవు ఉంటావు. నీవు సాక్షివి. నిన్ను ఏవీ స్పృశించలేవు. ధ్యానంలో నీవ్ఞ చేరాలి అనుకున్నది మనస్సు లేనిచోటికి. ఇప్పుడు నీవ్ఞ ఉన్నది ప్రశాంతమైన మనస్సు ఉన్నచోట. ఈ తేడాను జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. చేసుకోగలిగితే ధారణ సిద్ధించి నట్లే. ధారణ సిద్ధిస్తే ధ్యానం సునాయాసంగా సాగుతుంది. వృత్తి ఉంది. చైతన్యం. వృత్తి లేదు, చైతన్యం ఉంది. గాఢనిద్రలో ఈ వృత్తి రహితస్థితి మన అందరి అనుభవంలోనూ ఉంది. అలలు సముద్రా నికి అలంకారం.

అలలు లేని నిస్తరంగ జలధి కూడా ఒక అందం. మనసులో వృత్తులు ఉంటే ఉండనీ. వాటి ప్రభావం మనమీద లేకపోతే చాలు. ఆటంకాలు రావడం, వాటిని తొలగించే ప్రయత్నం చేయడం ధ్యానంలో ముఖ్యవిషయం కాదు. ఆత్మ ఎప్పుడూ అసంగమే అనేభావనలో ఉండటమే ధ్యానం. ఆత్మ ఏ వృత్తి నుండి కూడా విడిపడి ఉంటే అవకాశం లేదు. కలిసి ఉంటే నష్టం లేదు. వచ్చిపోయే వృత్తుల్ని నేను చూస్తున్నాను. ‘నేను అనే మహాసాగరంలో, చైతన్య సాగరంలో, వృత్తులు అనే అలలు అలా అలా కదలిపోతూ ఉన్నాయి. వాటివల్ల భయముగాని, రాగముగాని, ద్వేషముగాని కలగకుండా నిస్సంగుడిగా ఎవడైతే ఉండగలడో అతడే ధ్యానయోగి. ఏదో ఏదో ఊహించుకొనేవాడు ధ్యానయోగి కాలేడు. ఏ పరిస్థితులలోనూ దుఃఖం దరిచేరనివాడే నిర్గుణ ధ్యానయోగి. ఆత్మన్యే వాత్మనా తుష్టః. ఆత్మ యందు ఆత్మచేత సంతృప్తిని పొందువాడు ధ్యానయోగి. అతని ఆనందాన్ని భగ్నం చేయగల శక్తి ఈ ప్రపంచంలో దేనికీ లేదు. ఇదే నిర్గుణ ధ్యానయోగి అభయస్థితి, అఖండానందస్థితి.

– స్వామి సుందర చైతన్యానంద

శివోహం

నిమిత్తమాత్రం భవ!
కొబ్బరి చెట్టు ఎక్కేవాడు చెట్టుకు నమస్కరించి ఎక్కుతాడు. అంటే, ఎక్కే శక్తి తనకు లేక కాదు. పైకి పోయినవాడు కాలు జారి క్రిందపడే అవకాశాన్ని కొట్టిపారేయలేక. అంతేకాదు. చెట్టు నెక్కే శక్తి తనకు ఉన్నా, ఆ శక్తి వాస్తవానికి పరమాత్మదే అనే సత్యం గుర్తించటం వలన. డ్రైవరు స్టీరింగు పట్టుకునే ముందు రెండు చేతులు జోడిస్తాడు. నదికి నమస్కరించి ఈతగాడు నదిలో దూకుతాడు. బావిలో పడిన పాత్రను తీయటానికి బావిలో దిగేవాడు ముందుగా బావికి నమస్కరిస్తాడు. వంట చేసే ముందు తల్లులు పొయ్యికి నమస్కరిస్తారు. తనకు నైపుణ్యమున్నా ప్రమాదాన్ని డ్రైవరు మనసు నుండి తీసివేయలేడు. తనకు ఈత తెలిసినా తెలియని సుడులుంటాయనే సత్యాన్ని ఈతగాడు విస్మరించలేడు.

పాత్ర కొరకే బావిలో దిగుతున్నా, పాములుంటాయేమో అనే సంశయాన్ని దిగేవాడు తొలగించుకోలేడు. వంట అనేది మంటతో కూడుకున్న పని. చేయి కాలుతుందేమో; గ్యాసు లీక్‌ అవ్ఞతుందేమో-ఏమో! జీవితంలో ఎప్పుడు ఏది జరుగుతుందో ఎవరికి తెలుసు? అందుకే, నిమిత్త మాత్రం భవ సవ్యసాచిన్‌ ”అర్జునా! నీవ్ఞ నిమిత్తమాత్రంగా ఉండు అన్నాడు గీతలో శ్రీకృష్ణుడు. నిమిత్తమాత్రంగా ఉండు అంటే, అహంకారం లేకుండా ఉండమని అర్థం. ఇది కేవలం అర్జునునికి చేసిన ఉపదేశం కాదు. మనందరికీ ఉపకరించే సందేశము. సమరంలో అర్జునుడు నిమిత్తమాత్రుడు. సంసారంలో అందరూ నిమిత్తంగా ఉండాలని పరమాత్మ అభిప్రాయము. సన్యాసంలో అయితే మరీను.

మనం నిమిత్తం కాగలిగితే సర్వానికి పరమేశ్వరుడే సమాయత్తమవ్ఞతాడు. నీకు ఎంత శక్తి ఉన్నా, పరమాత్మ అనుగ్రహం లేకుండా నిన్ను నీవ్ఞ రక్షించుకోలేవ్ఞ. అశక్తులైనవారు కూడా పరమాత్మ కృపను పొంది శోభిస్తూ ఉండటం చూస్తూనే ఉన్నాం. మనం భక్తులమైతే మన వద్ద భక్తే ఉంటుంది. నిమిత్త మాత్రులం కాగలిగితే మన కార్యాలలో నారాయణుని పాదముద్రలే కదుల్తూ ఉంటాయి. పరమాత్మను విస్మరిస్తే మనలో అహంకారమే ఉంటుంది. భగవంతుని కార్యంలో నిమిత్తంగా చరించే భాగ్యం అందరికీ రాదు. భక్తి చేస్తేనే భక్తి కలుగుతుంది. మరేదో చేస్తే మరేదైనా రావచ్చు. చేసేది భక్తి కాకపోతే వచ్చేది ముక్తి కాలేదు. భక్తిని భారంగా కాకుండా బలంగా చేయాలి.

పాలకడలిని చిలికి అమృతాన్ని వెలికి తీసినట్లు, బ్రతుకును చిలికి భక్త్యామృతాన్ని సాధించాలి. మరి, విషం పుడితేనో! పుట్టనివ్వండి. మ్రింగేందుకు మహేశ్వరుడు మనతోనే ఉన్నాడు. ప్రతిబంధకాలన్నీ పరమాత్మ కృపతో పలచబడిపోతాయి. భక్తి పవిత్రము. భక్తి సాధన పవిత్రము. భక్తిలో అహంకారం చేరితే భక్తి మలినపడుతుంది. అపవిత్రమవ్ఞతుంది. అహంకారిలో ఉండేది భక్తి కాదని చెప్పలేము. అది భక్తే కావచ్చు. కాని, ముక్తికి ఉపకరించదు. పాలు పవిత్రమైన ఆహారము. విషం కలిస్తే? అప్పుడు కూడా అవి పాలే. కానీ, పాపయోగ్యం కావ్ఞ. విషం కలిసిన పాలలాగా అహంకారం కలిసిన భక్తి నిష్ప్రయోజనం. న వైరాగ్యా త్పరం భాగ్యం న బోధా త్వరమం సుఖం వైరాగ్యానికి మించిన భాగ్యము లేదు. జ్ఞానాన్ని మించిన సుఖం లేదు. వైరాగ్యముంటే భక్తి, భక్తి ఉంటే జ్ఞానము ఒకదానినొకటి అంటిపెట్టుకొని వస్తాయి.

అందుకనే శ్రీ ఆదిశంకరాచార్య స్వామి జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతి ‘అమ్మా! జ్ఞాన వైరాగ్యముల కొరకు భిక్షమడుగుతున్నాను అన్నారు అన్నపూర్ణాష్టకంలో. పరమాత్మ ముందు జ్ఞానులే భిక్షగాళ్ళూ నిలబడ్డారు. రెండు చేతుల్తో సమానంగా శరప్రయోగం చేయగల వీరుడైన అర్జునుని (సవ్యసాచి) నిమిత్తంగా ఉండమన్నాడు శ్రీకృష్ణుడు. ఇక మనమేపాటివారము? పెంచుకొంటే తోక పెరుగుతుంది. తెగిన రోజు బాధనంతా మనమే భరించాలి. రాలేందుకు బ్రతుకు రాలేదు. కాని రాలిపోవటమనేది కాయానికి తప్పదు.

లేచిపోయేందుకే ప్రాణాలున్నాయి. రాలిపోయేందుకే దేహాలున్నాయి. తెలియక, తెలివిలేక జీవితంలో కొంతకాలం వృధా అవ్ఞతుంది. తెలిసిన తరువాత, తగిలించుకున్న బంధాలను తొలగించుకోలేక బ్రతుకు అనుక్షణం అలమటిస్తూ ఉంటుంది. ఎవరి కొరకు ఎవరూ లేరనే సత్యం ఏనాడైనా వంటబట్టవలసిందే. ఆ రోజేదో, ఈ రోజైతే ఈ క్షణం నుండే స్వేచ్ఛాగాలులు పీల్చుకోవచ్చు. పరిస్థితుల్ని చక్కబరచగలమేమో గాని ప్రారబ్దాలను సరిచేయలేము. జరిగేవి జరిగిపోనీ! నిమిత్తమాత్రం భవ!

– స్వామి సుందర చైతన్యానంద

శివోహం

సర్వ దేవతాస్వరూపా......
ఓం నమో సర్వేశ్వరా....
సర్వాంతర్యామి....
సర్వ జగద్రక్షకా....
సర్వ జగన్నాధా...
పాహిమాం రక్షమాం ప్రభో....

ఓం శ్రీ స్వామియే శరణం ఆయ్యప్ప

శివోహం

శివా!"ఓంకారం"నాదం అంటున్నా
"ఓంకారం" నాదం వింటున్నా
"ఓంకార"తేజం చూడాలనుకుంటున్నా
మహేశా . . . . . శరణు .

శివోహం

శివుడు అంటే శుభాలని కలిగించే శుభకరుడు....
శివుడు వేరు శక్తి వేరు కాదు .....
శివశక్తుల సమాగమం ఈ సకల సృష్టి....

ఓం శివోహం...సర్వం శివమయం....

Tuesday, March 29, 2022

శివోహం

ఓ మనసా...
నా చిత్తాన్ని...
శాశ్వతము...
ఆనందకరము...
భుక్తి ముక్తిదాయకము...
సకల పాప దుఃఖహరణము...
దురిత నివారణము అయిన పరమేశ్వరుడిపై ఉంచు...
నామరూప గుణ వైభవ స్మరణ లో నా జీవితాన్ని ధన్యత చేయవే ఓ మంచి మనసా...
మహాదేవుడి కమలాలదివ్య దర్శన వైభవాన్ని అనుభవిస్తూ అక్కడే ముక్తిని పొందే భక్తి మార్గాన్ని దివ్యమైన ఆ యోగాన్ని అనుగ్రహించు...

ఓం శివోహం... సర్వం శివమయం.

Monday, March 28, 2022

శివోహం

ఈశ్వరుడు సాక్షి...
ఒక కర్మకు ఒక ఫలితం నిర్దేశించిన వాడు ఈశ్వరుడు..
ఈశ్వరుడు నిర్దేశించిన ఫలితం మనం చేసిన కర్మలకు వస్తున్నది...
అది "ఈశ్వరేచ్ఛ...
ఎవరు ఏ కర్మ చేస్తే వారికి ఆ ఫలితం వస్తుంది... ఆయన ఎవరి యందూ ప్రత్యేక బుద్ధి కలిగి ఉండడు...
ఆయన సాక్షి కాబట్టే ఈ కర్మలు నమోదై , ఆయా ఫలితాలు పొందుతున్నాం...
ఈ కర్మకి ఇది ఫలితం వస్తుంది అని నిర్దేశించాడు.

ఓం శివోహం... సర్వం శివమయం.

శివోహం

శివా!నా మౌనం అంకురించే మాట చాటున
ఆ మౌనం మొగ్గ తొడిగె నీ చెట్టు నీడన
మౌనం నిగ్గు తేలనీ పూవై వికసించనీ.
మహేశా . . . . . శరణు .

Sunday, March 27, 2022

శివోహం

క్షీరసాగరమధన సమయాన లోకాల కాపాడనెంచి
గరళాన్ని పాయసమువలె తీసుకుని గొంతున ఉంచి
హరా...
నీకొరకై అమ్మ గంగమ్మ-సతి పార్వతి
నిరంతరం అభిషేకించినా, చల్లారని నీగొంతున వేడి
క్షీర, మధుర రసాలతో అందరూ చేసే చిరు అభిషేకాలకు
పొంగిపోయి, గుండెలనిండుగ మము దీవించ నీగణ
సమేతముగ వచ్చి దీవించు చుంటివి గండర గండా...

నిను ప్రార్ధించిన నీపరీవారమంతా ఒక్కటై నను
దీవించు చున్నారు...
అందరూ - అగణిత ఆశీర్వచనములందించు చున్నారు...

నేనేమి చేయగలను పూజలు-పుణ్యకార్యాలు
శివనామస్మరణం తప్ప....

మహాదేవా శంభో శరణు

శివోహం

నేనూ నేను అనే అహము...
నాది నాది అనే స్వార్థము...
కలుషితం బయ్యో ఈ జీవితం...
ఇక చాలునయ్యా ఈ నాటకం...

మహాదేవా శంభో శరణు.

Saturday, March 26, 2022

శివోహం

శివా!భావనలో తపిస్తున్నాను
సాధనలో శ్రమిస్తున్నాను
గమ్యానికై  పయనిస్తున్నాను
మహేశా . . . . . శరణు

శివోహం

గమ్యం చేరడానికి ఎంత దూరమైన
నడవాలని ఉండాలే గాని ఈ కాళ్ళు చాలు ...

బాద అయినా సంతోషం అయినా 
భరించేందుకుగుప్పెడు గుండె చాలు ...

నా జీవితం సంతోషంగా ఉండాలంటే...
నీ చల్లని కారుణకటాక్షాలు చాలు.....

మహాదేవా శంభో శరణు...

Friday, March 25, 2022

శివోహం

ఎవరికి అర్థం కాని  ఈ  అనంత విశ్వంలో.

మా మనుగడకు మూలాధారం నీవే కదా తండ్రీ.
*ఓం నమః శివాయ*

శివోహం

శివా!చతుర్ధశి నాడు జాగరముంటా
చతురావస్థకి నన్ను చేరువ చేయమంటా
చక్ర బంధము నుండి విముక్తి నీయమంటా
మహేశా . . . . . శరణు.

Thursday, March 24, 2022

శివోహం

ఓం కారేశ్వర...
ఉమామహేశ్వర...
రామేశ్వర...
త్రయంబకేశ్వర...
మహాబలేశ్వర...
మహాకాళేశ్వర...
ముక్తేశ్వరయా
నమః శివాయ నమః

శివోహం

శివా!రెండు కళ్ళు నాకు లెక్క కాదు
మూసి వున్నదైన మూడవ కన్నే ఎక్కువ
నీ కన్ను తెలిపించు ఆ కన్ను తెరిపించు
మహేశా . . . . . శరణు .

శివోహం

ఈ లోకంలో సుఖంగా సంతోషంగా జీవించాలి అనుకోవడం కేవలం ఒక భ్రమ మాత్రమే...
నిజంగా ఈ లోకంలో ఎవ్వరునూ పరిపూర్ణమైన సుఖ సంతోషాలతో జీవించలేరు...
తమ మనసులో పరమాత్మ సామ్రాజ్యాన్ని నిర్మించుకొని అందులోనే జీవించే వారు మాత్రమే సుఖ సంతోషాలను అనుభవించగలరు.

ఓం శివోహం... సర్వం శివమయం.

Wednesday, March 23, 2022

శివోహం

మంచి చెడు, కష్టం సుఖం, రాత్రి పగలు, చీకటి వెలుతురు...
ఇలా ద్వంద్వాలతోనే జగత్తు ముడిపడి ఉంది...
కొన్ని బంధాలు బాగా బాధపేట్టేవిగా ఉంటాయి... రెచ్చగొట్టేవారు, చిచ్చు పెట్టేవారూ ఉంటారు...
వారికి కాస్త దూరంగా ఉంటేనే మంచిది...
అవే గుణాలు మనలో ఉంటే మార్చుకోవడం మంచిది...
అహం, సంకుచిత్వం, స్వార్ధం ఉన్నవారితో కాస్త దూరంగా ఉండవచ్చు...
అవే లక్షణాలు మనలో ఉంటే వదిలించుకుంటేనే ఆనందం...
ఒకోసారి ఒకొకరికి వారితో వున్నవారి వలన చితికిపోయే స్థితి కలుగుతుంది...
అప్పుడు వారు, వారివారి అనుభవాల బట్టి వారి బంధాలను నిర్ణయించుకుంటారు.

ఓం శివోహం... సర్వం శివమయం.

శివోహం

జీతభత్యాలెరుగని కాపలా దారుడు న శివుడు....
పగటేల సూర్యుడిలా.........
రాతిరేల చంద్రుడిలా.....
లోకాన్ని కావలికాస్తూ ఉంటాడు...

ఓం శివోహం.... సర్వం శివమయం.......

Tuesday, March 22, 2022

ఓశివోహం

భక్తి అనేది  తెచ్చి పెట్టుకునే వస్తువేం  కాదు
అది జన్మతహా  ఆత్మలో నిక్షిప్తమై నీవు ఎదిగే
కొలది అదీ ఎదిగి వృక్షమై నిను రక్షించి సేద
తీర్చి శివ సాయుజ్యమౌవ్వాలి...

ఒకరి  భక్తిని  హేళన  చేసినా వాని  మనసును  
నొప్పించినా వాని ఆత్మలో కూడా నీ ఆరాధ్య   
దైవమే నివసించునని  యెరుగు...

నా మాట వినక నీ ధోరణే  నీదైతే ముక్తి కై పోరాడు  నీ శ్రమను  పరమాత్మ  స్వీకరించడు...
అధోగతి  పాలగుదువు...
తెలుసుకుని మసలి   మనుగడ  సాగించవే  
మతిలేని  నా  మనసా....

ఓం శివోహం... సర్వం శివమయం.

శివోహం

నిన్నటిరోజు నీ ఆఙ్ఞతోనే గడిచింధి...
నేడు కూడా నీ అనుఙ్నతోనే నడుస్తుంధి...
రేపటిరోజు నీ ఆధీనంలోనే ఉంది...
ఋతువులు మారిన , గడియలు గడిచినా, మీ స్మరణను విడువని సంకల్పాన్ని స్థిరము చేయు భాద్యత నిదే...

మహాదేవా శంభో శరణు...

Monday, March 21, 2022

శివోహం

కేవలం నీకు మాత్రమే తెలుసు...
నా మనసులో జరిగే అలజడి ఏంటో...
నా మనసులో బాధ ఏంటో...
అప్పటికి ఇప్పటికి మారింది పరిస్థితిలు, పరిసరాలు మాత్రమే...
నేను కాదు శివ...
ఎన్ని కష్టాలు పెట్టిన ఎన్ని దుఃఖాలు నాకు కలిగిన...
నేను ఉచ్చరించే నామం నిదే 'శివ'...

మహాదేవా శంభో శరణు...

శివోహం

ఇకచాలయ్యా ఈ ఆట...
చాలాకాలం ఆడాను...
పాత్రోచిత ధర్మాలు..
ఈ ఆట ఎంతోకాలం ఆడాను...
ఎన్నో లక్షల జన్మల్లో ఆడాను....
నాకంటవు ఇక...
నేను ఎదిగాను...
పాత్రచేత నేను ప్రభావితం కావడం లేదు...
ఇక ముగింపు పలుకు...

మహాదేవా శంభో శరణు.

Sunday, March 20, 2022

శివోహం

శంభో...
ఎప్పటి నుంచో తెలియదు కానీ...
ఈ హృదయంలో  *ఆశ* అనే అజ్ఞానాంధకారం వ్యాపించింది...
కామ, క్రోధ, లోభాది గుడ్లగూబలు ఆ చీకట్లో గూళ్ళు కట్టుకొని కాపురం చేస్తున్నాయి...
ఇంట్లోకి ఎలుక ప్రవేశించి నూతన వస్త్రాలను కొరికి పాడుచేసినట్లు, ఇది మంచి ప్రయత్నాలను, సత్ర్పవర్తనలను పాడు చేస్తోంది.

మహాదేవా శంభో శరణు.

శివోహం

నీ ప్రణవమై ప్రస్తుతించనీ
నీ ప్రళయమై లయము చెందనీ
నీ కోసమై జననమెత్తనీ
నీ తోడుగా మరణమొందనీ ...

నీ జపముకై జీవమవ్వనీ
నీ తపముకై తనువునవ్వనీ 
నీ మంత్రమై మదిని చేరనీ 
నీ భావమై బంధమవ్వనీ ...

నీ గుర్తునై గుడిని చేరనీ 
నీ తలపునై తలుపు తట్టనీ 
నీ గానమై గుండె చేరనీ 
నీ పాటనై పదము కోరనీ ...

నీ శ్లోకమై శోధనవ్వనీ 
నీ శోకమై శరణమవ్వనీ 
నీ ధ్యాసనై ధ్యానమవ్వనీ
నీ మాటనై మవునమవ్వనీ ...

నీ కరుణకై కాటి చేరనీ 
నీ చెలిమికై చితిని చేరనీ 
నీ ప్రాణమై ప్రమిదనవ్వనీ 
నీ దేహమై దగ్ధమవ్వనీ ...

హరహర మహాదేవ
శివోహం  శివోహం

శివోహం

మీ ప్రేమను మరింతగా విస్తరించండి...

మీరు మొత్తం విశ్వంతోనే ప్రేమలో పడగలిగినప్పుడు ఒక్కరినే ప్రేమించడమెందుకు?
#సద్గురు

శివోహం

పరిచయం అయినా ప్రతి వ్యక్తి కి మన నిజాయితీని చుపించాల్సిన అవసరం లేదు మిత్రమా.

ఓం నమః శివాయ.

శివోహం

శివా!జోల పాట నీకెవరు పాడేను
లాల పోయ వేరెవరు వచ్చేను
మేలుకొల్ప నేనొచ్చేను మేలుకో, నన్నేలుకో
మహెశా . . . . . శరణు .

శివోహం

రాక్షసస్వభావం కలవారిని గుర్తుపట్టాలంటే...
మరొకడి దుఃఖంవల్ల ఆనందం పొందేవాడే..

ఓం నమః శివాయ.

శివోహం

ఆడించేది నువ్వు..
ఆడేది మేము...
నీకు తెలియని మాయలు లేవు...
నీవు ఆడని ఆటలు లేవు...
సర్వం నీ మహిమలోనే దాగుంది...
ఏ లెక్కలు సరిచేయాలి అన్న నీవే...
నా లెక్కనీ సరి చేసి..
నన్ను ని భక్తి తాడుతో నీ సన్నిధి కట్టివుంచు...

మహాదేవా శంభో శరణు.

Saturday, March 19, 2022

శివోహం

ఎవరి వద్ద ఏమి ఉంటుందో వారు దానినే పంచుకోగలరు...
మీ వద్ద ఏం వుంది?...
సదా గమనించుకోండి.

ఓం గం గణపతియే నమః
ఓం శివోహం సర్వం శివమయం

శివోహం

శివా!ఈ బ్రతుకు ముగిస్తే బూడిద కుప్పే
అది నీ దేహాన మెరిస్తే బ్రతుక్కి మెప్పే
ఈ కుప్ప చెల్లనీ నీ మెప్పు పొందనీ 
మహేశా ..... శరణు.

శివోహం

మాయ వదలదు...
ఎరుక వీడదు...
ఆశ ఆగదు...
వాసన పోదు...
వైరాగ్యం నిలవదు...
చింత చెదరదు...
నీ పై ధ్యానం కుదరదు...

మహాదేవా శంభో శరణు.

Friday, March 18, 2022

శివోహం

మనం బయట ప్రపంచాన్ని...
పరమాత్మ జ్ఞానాన్ని వెతికి తెలుసుకుంటాము కానీ బయట వెతకాల్సిన అవసరం లేదు...
మనలోనే ప్రపంచం ఉంది...
పరమాత్మా ఉన్నాడు...
కాబట్టి మన గురించి మనం తెలుసుకుంటే చాలు...
బంధం, మోక్షము కూడా మనలోనే ఉన్నాయి... అంతర్ముఖత చెందాలి అప్పుడు విచారణ, అన్వేషణ మొదలవుతుంది.

ఓం శివోహం... సర్వం శివమయం.

శివోహం

శివా!నీ మహిమలు తెలియగ
కావాలా ఎందైనా దర్శనం
నేను కాదా అందుకు నిదర్శనం.
మహేశా . . . . . శరణు.

శివోహం

శంభో...
క్షణక్షణం ఎగిరెగిరి పడుతూ మారుతూ ఉంటుంది నా మనసు...
సకల మాయాలు మొసాలు చేసేది ఇదే మాయదారి మనసు...
దీని రాకడ పోకడ ఏరిగేది నీవే మహాదేవా...
మాయదారి మనసు చేసే నా పాపాపుణ్యాలకు నీదే పూచి...

మహాదేవా శంభో శరణు...

Thursday, March 17, 2022

శివోహం

మార్చుకోవాల్సింది గుణాలు కానీ గురువులు కాదు.

మార్చుకోవాల్సింది మనస్సు కానీ మతాలు కాదు.

మార్చుకోవాల్సింది బుద్ధిని కానీ భగవంతున్ని కాదు.

మార్చుకోవాల్సింది అలవాట్లని కానీ ఆలయాలను కాదు.

మార్చుకోవాల్సింది చిత్తాన్ని కానీ సిద్ధాంతాన్ని
 కాదు.

మార్చుకోవాల్సింది తెలివిని కానీ తెరువును
కాదు.

మార్చుకోవాల్సింది సాంగత్యాన్ని కానీ
సంప్రదాయాలని కాదు.

 మార్చుకోవాల్సింది నడవడిని కానీ నమ్మకం కాదు

మనం ఇక్కడ ఉండేది చాలా కొద్దీ కాలం మాత్రమే సాధనతో సద్వినియోగం చేసుకోవాలి కానీ  ఒకళ్ళతో ఒకళ్ళు తగాదాలు పడుతూ ఉన్న కొద్దీ కాలాన్ని కూడా వృధా చేసుకోకూడదు.

ఓం శివోహం... సర్వం శివమయం.

Wednesday, March 16, 2022

శివోహం

జీతమిచ్చే యజమాని దగ్గర ఎంత భయ భక్తులతో ఉంటామో...
అలాగే గురువు దైవం దగ్గర కూడా  ఉంటె బాగుపడతాము...
భయం నుండి దైవం పుట్టింది...
భక్తి నుండి దైవత్వం పుట్టింది...
భయం భక్తులను మించిన స్థితియే ముక్తి.

ఓం శివోహం... సర్వం శివమయం

శివోహం

శివా!నీలకంఠ తేజం దేహమంత విరియగా
నుదిటి కన్ను శోభించెను తిరునామంగా
విస్తరించె నీ రూపం విష్ణువుగా
మహేశా ..... శరణు.

శివోహం

కంటి మంట దొరా నీవు...
నా గుండె మంటలార్పవా...
శివ నీ దయ తండ్రి.

Tuesday, March 15, 2022

శివోహం

జీవితం క్షణ భంగురం...
కాలం బలీయమైనది...
విధి నుండి తప్పించుకోవడం ఎవరికీ సాధ్యసాధ్యం...
మాయ ఎప్పుడు తన వలలో బంధిస్తుందో తెలీదు...
జనన మరణ చక్ర భ్రమణము నుండి మోక్షం  ఎప్పుడు కలుగుతుందో తెలీదు...
పుట్టినప్పటి నుండి మృత్యువు వెంటాడుతూ ఉంది..
అప్పటిదాకా పరమాత్మ ను శరణు వేడుదాం...

ఓం శివోహం... సర్వం శివమయం.

శివోహం

శివా!బయటకి వస్తే చూద్దామని  నేను
లోపలకి వస్తే కనబడదామని నీవు
ఎదురు చూపులే చూస్తున్నాము ఇద్దరం
మహేశా . . . . . శరణు .

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u శివా! మళ్ళీ జన్మలు ఉన్నా కానీ… మనిషిగ పుట్టే యోగ్యత కలదో లేదో… మళ్లీ నీ సన్నిధి ముంగి...