శివా!బయటకి వస్తే చూద్దామని నేను
లోపలకి వస్తే కనబడదామని నీవు
ఎదురు చూపులే ఇద్దరివీ
మహేశా . . . . . శరణు .
శివా!కదలగా లేని నీవే మమ్ము కదిలిస్తున్నావు
కనబడని నీవే మమ్ము కనబరుస్తున్నావు
మాకు ఇది చోద్యము నీకే ఇది సాధ్యము
మహేశా . . . . . శరణు .
శివా!ఈ రథమును కూర్చిన నీవే
సారథినెరిగించు వారధి దాటించు
నిను చేరుట ఎఱిగించు
మహేశా . . . . . శరణు
శివా!కరుణించగ నీకు హద్దులు లేవు
నీ కటాక్షానికి పద్దులు లేవు
నా ఆనందానికి అవదులు లేవు
మహేశా . . . . . శరణు .
శివా!ఆలింగనము కోరి అలమటించేను
ఆలకించవయ్యా నాదైన ఆర్తి
పాలించవయ్యా ఓ లింగమూర్తి.
మహేశా . . . . . శరణు .
శివా!నా ఇరుకు గుండెలో ఇమిడిన నీకు
నా ఇంటి పేరున ఇమడ ఇబ్బంది ఏమి
ఇమిడినంత నాకు అది ఎంతో ఘనము
మహేశా . . . . . శరణు .
శివా!నీటి బుడగను మనిషిగ జేసి
ఆ మనిషి జీవితం నీటి బుడగగ జేసి
చిత్రాలు చేసేవు చిత్తాన శివుడా .
మహేశా......శరణు.
శివా!పాదమైనా పదములైనా నిన్ను చేరుటకే
శేషమైనా విశేషమైనా నిన్ను తెలియుటకే
జననమైనా మరణమైనా నిన్ను చేరుటకే
మహేశా....శరణు.